ఈ ప్రపంచం అంతా మొదలైన కొత్తల్లో ఎప్పుడూ చీకటే ఉండేది; ఎప్పుడూ వెచ్చగానే ఉండేది. ఆ వెచ్చని, చీకటి ప్రపంచంలో జంతువులన్నీ చాలా సంతోషంగా జీవించేవి అన్ని జంతువులూ అంటే అన్నీ కాదు; కొయోట్ అనే పిల్లిలాంటి ఒక జంతువు మాత్రం చాలా బాధగా ఉండేది. దానికి పాపం, వేటాడటం బాగా వచ్చేది కాదు.

ఒకరోజున అది ఒక గ్రద్దని చూసింది. ఆ గ్రద్ద చాలా తెలివిగా వేటాడటం చూసి, కొయోట్ దానితో స్నేహం చేసింది- అట్లా అయినా కొంత ఆహారం తనకూ దొరుకుతుందని ఆశపడింది. ఆ రోజు సాయంత్రానికల్లా గ్రద్ద నాలుగైదు కుందేళ్లను పట్టుకున్నది, కానీ కొయోట్‌కి మాత్రం సరిగ్గా నాలుగైదు పురుగులు కూడా దొరకలేదు!

దాంతో పాపం ఆ కొయోట్‌కు సిగ్గు వేసింది. కొంచెం ఉక్రోషం కూడా వచ్చింది. "ఆc,, ఎంత చీకటిగా ఉందో చూడు- ఇట్లా ఉంటే నాకు ఏమి దొరుకుతుంది? కొంచెం వెలుతురు ఉండే స్ధలం ఏదైనా తెలుసా, నీకు?" అని అడిగింది గ్రద్దని.

"రా,నాతో" అని దాన్ని దూరంగా ఒక స్థలానికి తీసుకుపోయింది గ్రద్ద. వీళ్లు వెళ్లేసరికి అక్కడ 'కచిన' జాతి మనుషులు కొందరు, సంప్రదాయకంగా చేసే డాన్సు చేస్తున్నారు. 'కచిన' జాతి వాళ్లంటే చాలా బలశాలులని ప్రతీతి. గ్రద్ద కొయోట్‌ను వాళ్ల దగ్గరికి తీసుకెళ్లి "చూడు, వీళ్లు వెలుతురుని రెండు పెట్టెల్లో దాచి పెట్టుకున్నారు. ఒకటి పెద్ద పెట్టె, ఒకటేమో చిన్నపెట్టె. పెద్దదాంట్లో పెద్ద మంటలాంటి బంతి ఒకటి ఉంటుంది. వాళ్లు దాన్ని 'సూర్యుడు' అంటారు. ఎప్పుడన్నా వాళ్లకు ఎక్కువ వెలుగు కావాలంటే వాళ్లు దాన్ని వాడుతుంటారు. ఇక చిన్న పెట్టెలో, పాలిపోయినట్లు తెల్లగా ఉండే బంతి ఒకటి ఉంటుంది. అది 'చంద్రుడు' -తక్కువ వెలుతురు ఇస్తుంది" అన్నది.

గ్రద్ద, కొయోట్ రెండూ మెల్లగా పొదల్లో నక్కి నక్కి వాళ్లకి దగ్గరగా పోయాయి. వాళ్లంతా నాట్యం చేసీ చేసీ అలసిపోయి పడుకున్నాక, గ్రద్ద పెద్ద పెట్టెను ఎత్తుకొని ఆకాశంలోకి ఎగిరిపోయింది. కొయోట్ మాత్రం దాన్ని అనుసరిస్తూ నేలమీద పరుగు మొదలెట్టింది.

కొంచెం సేపటికి కొయోట్ అరిచింది, గ్రద్ద కేసి చూస్తూ - "ఓయ్! ఆ పెద్దపెట్టెని మోస్తూ అంత ఎత్తున, అంతసేపు ఎగిరితే అలసిపోతావు నువ్వు! కొంచెం సేపు ఆ బరువుని నాకు ఇవ్వు. నేనూ మోస్తాను" అని. గ్రద్ద దానికి పెద్ద పెట్టెను ఇస్తూ, "జాగ్రత్తరోయ్! చిలిపి పనులేమీ చెయ్యకు!" అని హెచ్చరించింది. బరువు కారణంగా కొయోట్ వేగం బాగా తగ్గింది. అది అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తూంటే, గ్రద్ద ఎగురుకుంటూ కొంచెం ముందుకి పోయింది.

అది అట్లా కొంచెం కనుమరుగు కాగానే కొయోట్‌కి ఉత్సాహం హెచ్చింది. "పెట్టెను ఒక్కసారి-కొంచెం, కొంచెం- కొంచెమే, తెరిచి చూస్తాను!" అనుకున్నదది. "లోపల ఎంత వెలుతురు దాక్కున్నదో చూడాల్సిందే, త్వరగా! " అని.

అందుకని అది పెట్టెను క్రిందికి దించి, మెల్లగా మూతను ఎత్తింది- పాపం, దానికి తెలీదు, సులువుగా ఉంటుందని సూర్యుడిని, చంద్రుడిని- రెండిటినీ ఒకే పెద్ద డబ్బాలో కుక్కి పెట్టి తెచ్చింది గ్రద్ద! కొయోట్ మూత తెరవగానే ఒళ్లు విరుచుకొని సూర్యుడూ, చంద్రుడూ ఇద్దరూ బయట పడ్డారు! వాళ్ళు బయట పడగానే ఆ వెలుతురుకు కళ్లు బైర్లు క్రమ్మి కొయోట్ కాస్తా మూర్ఛపోయింది. మరుక్షణం సూర్యచంద్రులిద్దరూ ఆకాశంలోకి దూసుకు పోయారు!

ఆకాశంలో ఎగురుతున్న గ్రద్ద వాళ్లిద్దర్నీ పట్టుకుందామని అడ్డంవచ్చింది, కానీ అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. సూర్యుడు భూమినుంచి చాలా దూరంగా వెళ్లిపోయాడు; చంద్రుడు మరీ అంతదూరం పోకుండా, కొంచెం దగ్గర్లోనే నిలబడిపోయాడు. వాడి చల్లదనం భూమిని చేరే సరికి, భూమి మొత్తం చల్లగా అయిపోయింది! వెచ్చదనం అంతా మాయమై, వణుకు మొదలైంది. చలికి మొక్కలన్నీ ముడుచుకు పోయాయి. మంచు కురవటం మొదలుపెట్టింది. జంతువులన్నీ ఎక్కడివి అక్కడ తల దాచుకొనే చోట్లకోసం పరుగులు పెట్టాయి!

"అయ్యో, ఎంత పని చేశావురా, తిక్క కొయోట్! నీ వల్ల సూర్యుడు, చంద్రుడు తప్పించుకుపోయారు, ఇప్పుడు మన మీద ఇంత చలికాలం వచ్చిపడింది!" అని తిట్టింది గ్రద్ద. అయినా వినేందుకు కొయోట్ అక్కడ ఉంటేగా?

ఆ రోజు నుండి ప్రతి సంవత్సరమూ వస్తోంది, చలికాలం!