కొత్త బళ్లో నా మొదటిరోజు.. కొత్తబడి! అదే మా పాత బడిలో నైతే, సెలవుల తర్వాత మళ్లీ బడి తెరుస్తుంటే నేను ఎంత ఉత్సాహంగా ఉండేవాడినో! చుట్టూ మా ప్రాణస్నేహితులు నలుగుర్ని పెట్టుకొని, వాళ్లు సెలవల్లో ఏమేం సాహసాలు చేశారో వర్ణించి చెబుతుంటే.. అంతా భలే సరదాగా ఉండేది! కానీ ఇప్పుడు...? ఈ సంవత్సరం అట్లా కాదు. బడంటే మా పాత బడే.. ఎంత బాగుంటుందో మా బడి..!
నేను ఇంకా మా పాతబడి గురించిన ఊహల్లోనే ఉన్నాను, కానీ నిజానికి ఈ బడి కూడా బాగానే ఉన్నట్లుంది... నీడనిచ్చే చెట్లున్నై, చాలా. గాలి చల్లగా, బాగుంది. వాతావరణం హాయిగా ఉంది.
ఉదయం అసెంబ్లీలో అందరూ వరసలుగా నిలబడితే, నాలాగే 'ఎక్కడో తప్పిపోయిన మొహాల్లాంటి' పిల్లలూ ఉన్నారు; పాత స్నేహితుల్ని కలుసుకున్న ఆనందంతో బిగ్గరగా, అలుపులేనట్లు మాట్లాడేస్తూ ఉన్న పిల్లలూ ఉన్నారు.
అసెంబ్లీ అయిపోగానే అందరం మా మా తరగతి గదుల్లోకి నడుస్తున్నాం. నాకేమో క్రొత్తగా, భయం భయంగాఉంది. గదిలోకి వెళ్లేసరికి దాదాపు అంతా నిండింది. ఒక కళ్లజోడు పిల్లాడి ప్రక్కనే కొంచెం చోటు కనబడితే, వెళ్లి నా పేరు చెప్పి, "కొంచెం కూర్చోవచ్చా?" అని అడిగాను. వాడిపేరు రాహుల్ అట. నాలాగే ఏదో కొత్త పిల్లవాడేనట! ఇంకేముంది, ఇద్దరం ఫ్రెండ్స్ అయిపోయాం! అంతలోనే టీచరుగారు వచ్చేశారు.
"గుడ్ మార్నింగ్, పిల్లలూ! నేను మీ క్లాస్‌టీచర్ శాంతను!" అన్నదావిడ, ఉత్సాహంగా నవ్వుతూ. మమ్మల్నందరినీ మా పేర్లతో బాటు ఇంకా మా గురించి ఏవైనా రెండు వాక్యాలు చెప్పమన్నది. మేం అందరం చెప్పాక, ఆవిడ బడి నియమాల్ని వివరించింది. నాకైతే ఆవిడ చెప్పే ప్రతి ముక్కా చాలా బాగా అర్థమైంది. నా భయాలన్నిటినీ ఆమె తన ఒక్క క్లాసుతో తీసేసినట్లైంది.
చూస్తూండగానే లంచ్ టైం అయ్యింది. పిల్లలందరూ జట్లు జట్లుగా చెట్ల దగ్గరికి వెళ్తుంటే, నేను, రాహుల్ కూడా అందరితో బాటు వెళ్లి చెట్ల నీడన భోంచేశాం. నేను బాగున్నాను, కానీ రాహుల్ మాత్రం ఇంకా కొంచెం బెదిరిపోయినట్లే ఉన్నాడు అప్పటికి. అన్నం తిన్నాక మేం బడంతా తిరిగి చూశాం.
ఈ బడిలో లైబ్రరీ ఎంత బాగుందో! లైబ్రరీనిండా అరలు- ప్రతి అరలోనూ నిండుగా మంచి మంచి పుస్తకాలు! బడి ఆటస్థలం కూడా భలే ఉంది. చెట్ల దగ్గరైతే ఉడతలు అటూ ఇటూ పరిగెత్తుతూ సందడిగా ఉంది.
మళ్లీ గంట కొట్టేసరికి అందరం తరగతి గదుల్లోకి వెళ్లాం. ఆ సరికి మేం ఎంత గట్టి గట్టిగా మాట్లాడటం, అల్లరి నవ్వులు మొదలు పెట్టేశామంటే, ఎవరో టీచరుగారు లోనికి తొంగి చూసి "నిశ్శబ్దంగా ఉండండి" అని చెప్పి వెళ్లారు! అది మా బడిలో మొదటిరోజు గనక, టీచర్లు టైంటేబుల్ ఇచ్చాక, పాఠాలేవీ మొదలు పెట్టలేదు.
టీచరుగారు ఒక పీరియడ్‌లో మేం అందరం సెలవల్లో ఏం చేశామో చెప్పమన్నారు. నేను మా అమ్మమ్మ వాళ్ల ఊళ్లో ఏం చేశానో చెప్పాను: ఆవు పాలు పితుకుదామని కూర్చుంటే, దాని కట్లు విప్పి ఉన్నైగద, అది నన్ను ఎట్లా తరుముకొచ్చిందో చెబితే అందరూ ఒకటే నవ్వులు!
చివరికి బడి గంట కొట్టగానే అందరం పుస్తకాలు సర్దుకొని బయటికి పరుగెత్తాం. బడి బయట మా నాన్న నిలబడి ఉన్నాడు- "అంతా బానే ఉందా?" అని ఆదుర్దాగా అడిగితే బొటనవేలు పైకెత్తి నవ్వుతూ అన్నాను- "మస్తు ఉంది!" అని.
నిజంగా మా యీ కొత్త బడి ఎంత మంచిదో! ఈ బళ్లో నేను ఈ ఒక్క సంవత్సరమేం ఖర్మ, ఎన్నేళ్లు గడపమన్నా గడిపేయగలను!