కేరళలో కరిమన్నూరు అని ఒక ఊరు ఉంది. ఆ ఊళ్ళో కున్నిముత్తు అనే పిల్లవాడు ఉండేవాడు. వాడు ఒట్టి అల్లరి. వాడు చాలా చిన్నగా ఉన్నప్పుడే అమ్మ చనిపోయింది. నాన్న ఒక్కడే ఇక ఉన్నది. అయితే కున్నిముత్తు వాళ్ల నాన్న ఒక దొంగ! అక్కడా ఇక్కడా చిల్లర దొంగతనాలు చేస్తూ, చెడు సావాసాలు చేస్తూ జీవితం గడిపేవాడు. అయినా కొడుకంటే మటుకు చాలా ముద్దు. భార్య చనిపోయినప్పటి నుండీ కొడుకుకోసం అంగట్లో అవీ ఇవీ కొనుక్కొచ్చి పెట్టేవాడు. నిదానంగా కున్నిముత్తు చిరుతిండ్లకు బాగా అలవాటయ్యాడు. వాళ్ళ నాన్న అతనికి రోజూ చాలా చిల్లర డబ్బులు కూడా ఇచ్చేవాడు మరి!

స్కూల్లో చేరిన తరవాత కూడా కున్నిముత్తులో ఏ మార్పూ రాలేదు. స్కూలు ముందర ఉండే ఒక అంగట్లో పనికిరాని పదార్థాలన్నీ తినేవాడు. వీడి జేబులో ఎప్పుడూ గలగలలాడే చిల్లర డబ్బుల్ని చూసి నలుగురైదుగురు పిల్లలు ఎప్పుడూ వీడి వెంటనే ఉండటం మొదలు పెట్టారు. వీళ్లంతా క్లాసుల్లో సరిగా కూర్చోరు. బడికి శుభ్రంగా రారు. మాసిన బట్టలు, చింపిరి జుట్టు, జేబుల్లో ఎప్పుడూ ఏవో చిరుతిండ్లు - ఉపాధ్యాయులు ఎన్ని సార్లు చెప్పినా వీళ్ళు మాత్రం‌ మారలేదు. కున్నిముత్తు వాళ్ళ నాన్నకు కూడా చాలా సార్లు చెప్పారు. ఏమీ ఫలితం లేక పోయింది. చివరికి ఊళ్ళో అందరూ వాడికి 'అల్లరి పిల్లవాడు' అని ఓ ముద్ర వేసి ఊరుకున్నారు.

కున్నిముత్తు ఆరో క్లాసుకు వచ్చాడు ఇప్పుడు. ఆ సమయంలో‌ వాళ్ల స్కూల్లో వచ్చి చేరారు ఒక కొత్త టీచరు గారు. చేరిన మొదటి రోజే కున్నిముత్తు అల్లరిని గమనించారు ఆవిడ. వీడి కారణంగా ఇతరుల క్లాసులుకూడా ఎంత చెడుతున్నాయో‌ అర్థమైంది ఆవిడకు. రెండ్రోజుల్లో వాడి కుటుంబం గురించి, వాడి చిల్లర డబ్బుల గురించి తెలుసుకున్నారావిడ. ఎలాగైనా అతన్ని బాగు చేయాలని నిర్ణయించుకున్నారు.

సుజాత మేడం చాలా ఆలోచించారు. 'కున్నిముత్తుకు క్లాసులు ఆసక్తిగా ఉండేది ఎలాగ' అని ఆలోచించారు. పిల్లలకు ఇష్టమైన పాటలు, కథలు, ఆటల్ని పాఠాల్లో భాగంగా చేసారు. వాటి ద్వారా పిల్లలకు చదువులతోబాటు , మంచి ఆహార అలవాట్లు నేర్పారు. పరి శుభ్రత గురించిన పాటల ద్వారా వాళ్ళకు మంచి అలవాట్లు నేర్పారు. చూస్తూండగానే పిల్లలందరికీ చదువులపట్ల ఆసక్తి పెరిగింది- కున్నిముత్తుకు కూడా! చదువులు రాగానే మిగిలిన అలవాట్లలోకూడా మార్పులు వచ్చాయి. అతని స్నేహితులు అందరూ‌ కూడా బాగా చదువుకోవడం మొదలెట్టారు.

అయితే కున్నిముత్తు వాళ్ళ నాన్నకు తన కొడుకు చదువుకోవడం ఇష్టం లేదు. హైస్కూలుకు వస్తూనే కొడుకు తన పనుల్లో తోడుగా ఉంటాడని, తన శ్రమ తగ్గుతుందని, కొడుకుకు దొంగతనాలు మప్పవచ్చనీ ఇన్నాళ్ళూ ఆశించాడు. కానీ వీడు ఇప్పుడు చదువుల మీద ఇష్టం పెట్టుకున్నాడు! అందుకని చాలా సార్లు స్కూలుకెళ్ళి టీచర్లతో గొడవ పడ్డాడు అతను. 'నా కొడుకు, నా ఇష్టం' అని అరిచాడు. అయితే బడిలో టీచర్లు ప్రతిసారీ అతన్ని తిట్టి, బెదిరించి, కున్నిముత్తును బాగా చదువుకొనేలా చేసారు.

పదో తరగతి పరీక్షల్లో కున్నిముత్తుకు రాష్ట్ర స్థాయిలోనే గొప్ప మార్కులొచ్చాయి. అతన్ని సన్మానించడానికి జిల్లా కలెక్టరుగారు స్వయంగా స్కూలుకు వచ్చారు. హెడ్మాస్టరు గారు అప్పుడు ఆ సభకు కున్నిముత్తుతోబాటు వాళ్ళ నాన్నని కూడా పిలిపించారు.

సభలో ఆయన కున్నిముత్తు వాళ్ళ నాన్న గురించి చాలా గొప్పగా మాట్లాడాడు. "పాపం, బాబు చాలా చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ పోయింది. అప్పటి నుండి అన్నీ తనే అయి బాబును చాలా బాగా పెంచాడు. దాని కోసం చాలా కష్టపడ్డాడు. ఆయన చాలా గొప్ప మనిషి. కున్నిముత్తును టీచర్ల కంటే అతనే ఎక్కువ చదివించాడు..." ఇలా చెప్పేసరికి అందరికీ ఆశ్చర్యమయింది. అతనికీ నోట మాట రాలేదు. కలెక్టరుగారు అతన్ని పూల మాల వేసి అభినందించారు. దీంతో కున్నిముత్తు వాళ్ల నాన్న సిగ్గుతో కుంచించుకుపోయాడు. పూర్తిగా మారి-పోయాడు.

అటుపైన బాగా చదువుకున్న కున్నిముత్తు, పెద్దయ్యాక ఒక మంచి కలెక్టరయ్యాడు!