ఒక పెద్ద మామిడిచెట్టు మీద ఒక కాకి, ఒక కోకిల నివసిస్తూ ఉండేవి. చాలా కాలంగా మంచి స్నేహితులు అవి. కోకిల తన గుడ్లను కాకి గూట్లోనే పెట్టేది. ఒకవైపున కాకి వాటిని పొదుగుతుంటే, కోకిల మాత్రం ఆ చుట్టుప్రక్కల పాటలు పాడుకుంటూ తిరిగేది.
ఒకరోజున బాటసారి ఒకడు అటువైపుగా పోతూ ఉంటే, చీకటి పడింది. దాంతో అతను ఆ రాత్రిని చెట్టు క్రిందే గడుపుదామని అనుకున్నాడు. ఆ సమయంలో కోకిల పాట పాడటం మొదలు పెట్టింది. ఆ పాట వింటూ చల్లగా హాయిగా నిద్రపోయాడు బాటసారి.
తెల్లవారుతూనే కాకి నిద్రలేచింది. 'కావ్!కావ్!' అని గట్టిగా పాట పాడటం మొదలుపెట్టింది. క్రింద నిద్ర పోతున్న బాటసారి ఆ పాట విని గబుక్కున నిద్రలేచాడు. కొంచెం చిరాకుగా లేచి నిలబడి , అటూ ఇటూ చూశాడు. తొందర తొందరగా నడచుకొని వెళ్లిపోయాడు.
అతను అలా హడావిడిగా వెళ్తుండటం చూసింది కోకిల. "ఎందుకు కాకమ్మా, ఆ బాటసారి తెల్లవారు జామునే వెళ్లిపోతున్నాడు?” అని అడిగింది కాకిని.
"అతను నీ పాట విని రాత్రంతా హాయిగా నిద్రపోయాడు, అది నాకు నచ్చలేదు. అందుకని ప్రొద్దునే నేను పాడి, వాడిని నిద్రలేపి పంపేశాను. అందరూ నిన్నే మెచ్చుకొంటారు; నన్ను అసహ్యించుకొంటారు. అందుకే నేను అలా చేసేది! నువ్వంటే నాకు అసూయ. అందుకే నేను పాట పాడాను; ఇప్పుడు నీ గుడ్లను కూడా పాడుచేస్తాను" అని కాకి అరిచింది గట్టిగా.
"ఎందుకు అక్కా, అలా అరుస్తావు? ఆ బాటసారి వెళ్ళిపోయాడనే కదా, నువ్వు నన్ను, నా గుడ్లను అస్యహించుకొంటున్నది? సరే, కానివ్వు. నేను వెళ్ళి ఆ బాటసారినే అడుగుతాను- అతను ఎందుకు చికాకు పడ్డాడో!" అని కోకిల బాటసారిని వెతుక్కుంటూ పోయింది.
దూరంగా నడాచుకొంటూపోతున్నాడు బాటసారి. కోకిల ఎగురుకుంటూ అతని దగ్గరకు వెళ్ళి- "అయ్యా! కాకి పాట పాడితే మీరు అక్కడ నుండి వెళ్లిపోయారట, ఎందుకు? మీరు తనని అవమానించారని నొచ్చుకున్నది కాకి. అది ఇప్పుడు నన్ను, నా గుడ్లను అసహ్యించుకుంటున్నది" అన్నది.
"అయ్యో అలాగా! నేను మాట్లాడతాను ఆగు, కాకితో" అని బాటసారి వెనక్కి తిరిగి చెట్టు దగ్గరకెళ్ళాడు.
ముఖం ముడుచుకొని కూర్చున్న కాకితో అతను అన్నాడు- "కాకమ్మా! నన్ను క్షమించు. నిజం చెప్పాలంటే కోకిల గొంతు చాలా బాగా వుంటుంది, నీ గొంతు అంత బాగుండదు. అందుకే నేను నీ పాట వినబడగానే అక్కడి నుండి లేచి వచ్చేసాను.
అయినా మీరు ఇద్దరూ చాలా మంచి స్నేహితులని అందరూ అంటుంటే విన్నాను. అట్లాంటి మీరు గొడవ పెట్టుకున్నారా? నీ గొంతు బాగుండదు; కోయిల బాగా పాడుతుంది- అయితే మాత్రం ఏమిటట? కేవలం గొంతు బాగున్నంత మాత్రాన అది గొప్పదయిపోతుందా? దానికసలు పిల్లల్ని పొదగడమే తెలియదు గదా!? నువ్వే లేకపోతే దాని గతి ఏమికాను? ఎవరి గొప్పవారిది. దాని పాట విని నువ్వు ఆనందించాలి. తన పిల్లల్ని నువ్వు పొదుగుతున్నందుకు అది సంతోషించాలి!" అని.
బాటసారి మంచి మాటలకు కాకి ముఖం వికసించింది. 'అవును కదా, నేనేంటి ఇంత గొడవ చేశాను?' అనుకున్నదది. ఆనాటి నుండి కోకిల పాటలంటే కాకికి ఇష్టం; తన గుడ్లను చక్కగా పొదిగే కాకి అంటే కోకిలకు ఇష్టం!