అనగనగా ఒక అడవిలో రెండు కాకులు ఉండేవి. ఆ కాకులు ఇతర పక్షులతో సరిగా కలిసేవి కాదు, మాట్లాడేవి కాదు, ఒంటరిగా ఉండేవి. వాటికి స్నేహితులు ఎవరూ లేరు.
వాటికి రెండు కాకి పిల్లలు. కాకులు వాటి పిల్లలను జాగ్రత్తగా పెంచుకుంటూ తమ దారిన తాము బ్రతికేవి.

అయితే ఒకరోజున ఒక వేటగాడు వచ్చాడు. ఆ రోజు కొంచెం చలిగా ఉందని, ఆ చెట్టు కింద నిప్పు పెట్టుకున్నాడు. కొంచెం సేపు అయ్యాక వెళ్ళిపోయాడు; కానీ ఆ నిప్పును మాత్రం అలాగే వదిలేసాడు. మెల్ల మెల్లగా గాలి వీస్తుండేసరికి, ఆ చుట్టుప్రక్కల ఉన్న గడ్డి అంటుకున్నది. వాతావరణం వేడెక్కింది. దాంతో పిల్లలు ఏడవటం మొదలుపెట్టాయి; కానీ కాకులకు ఏం చేయాలో తెలీలేదు! పిల్లల దగ్గరికి వెళ్ళటానికి కూడా వాటికి ధైర్యం చాలలేదు.
'పిల్లలు ఆ వేడికి తట్టుకోలేవు' అని అవి తల్లి కాకి ఏడవటం మొదలు పెట్టింది. తండ్రి కాకి అక్కడే వేరే చెట్టు మీదికి ఎక్కి "ఏడవకండి! అరవకండి! కదలకండి!" అని గట్టిగా కేకలు పెట్టింది.
అంతలో అటుగా వెళ్తున్న పావురం ఒకటి, ఆ హడావిడి విని అక్కడికి వచ్చి చూసింది. పరిస్థితిని అర్థం చేసుకున్నది.
వెంటనే తన స్నేహితుడైన ఏనుగు దగ్గరకు పరుగు పెట్టింది. "త్వరగా రా! పాపం, ఆ కాకి పిల్లలు మంటల్లో ఇరుక్కున్నాయి. వాటిని కాపాడాలి!" అని దాన్ని పిలుచుకొచ్చింది. ఏనుగు కూడా నడుస్తూ నడుస్తూనే ఆలోచించింది: దారిలో ఉన్న ఓ మడుగులోంచి తొండం నిండా నీళ్ళు పీల్చుకొని వచ్చింది.

ఆ నీళ్లని బలంగా ఊసి, మంటల్ని ఆర్పింది.
కాకులు పావురానికి, ఏనుగుకి కృతజ్ఞతలు చెప్పాయి. "ఓ, దీనిదేముంది, ఒకరికొకరం సాయం" అని అవి రెండూ చెట్టాపట్టాలు వేసుకొని వెళ్ళిపోయాయి.
వాటిని చూసాక అర్థమైంది కాకులకు- 'స్నేహితులు వుండటం చాలా ముఖ్యం- స్నేహితులు ఉంటే బాగుంటుంది' అని. అటు తర్వాత అవి ఇతర పక్షులతో స్నేహం చేసినై. అన్నింటితోటీ కలిసిమెలసి ఉండసాగినై.