అనగనగా ఒక ఊరు. ఆ ఊరు చుట్టూరా అడవి. ఆ ఊరి పెద్ద, శ్రీరాములు చాలా మంచివాడు. ఊరికి కావలసిన అన్ని సౌకర్యాలనూ కల్పించాడు. ఊళ్ళో వాళ్ళు కూడా తమ వంతుగా కట్టవలసిన పన్నులన్నింటినీ ఆలస్యం లేకుండా చెల్లించేసేవాళ్ళు. అట్లా వచ్చిన మొత్తాలను ఆయన ఒక గుహలో భద్రంగా దాచిపెట్టేవాడు. ఆ గుహ తలుపులు తీసేందుకు కూడా శ్రీరాములు ఒక జాగ్రత్త తీసుకున్నాడు. వాటి తాళాలు తెరుచుకోవాలంటే ఆయన కూతురు- సుజాత చేతిగుర్తులు కావాలి!
ఆ రోజుల్లో దేశంలో అంతటా బందిపోటు దొంగల తాకిడి ఎక్కువగా ఉండేది. ఒకసారి వాళ్ళు ఊరిమీద పడి, భీభత్సం సృష్టించారు. కనబడిన సొమ్ములు దోచుకున్నారు. ఎదిరించిన వాళ్ళను చంపారు. కొన్ని ఇళ్ళను తగలబెట్టారు; కొన్నింటిని స్వాధీనం చేసుకున్నారు. వాళ్ళు ఊరిపెద్ద ఇంటి వరకూ వచ్చేసరికి ఖాళీ గోడలు వాళ్లను వెక్కిరించాయి.
శ్రీరాములు సుజాతను ఎత్తుకొని అడవిలోకి పారిపోయాడు.

దొంగలు ఊరుకుంటారా? వాళ్ళు ఆయన్ని వెంబడించారు. భయంతో పరుగు పెడుతున్న శ్రీరాములు ఒక చోట జారి పడిపోయాడు! ఆయన చేతుల్లోంచి జారిన సుజాత నేరుగా లోయలోకి పడిపోయింది! శ్రీరాములు తేరుకునేలోగానే దొంగలు ఆయన్ని చుట్టుముట్టారు!
అందరూ ఆ పాప చనిపోయిందని అనుకున్నారు; కానీ నిజానికి సుజాత లోయ అడుగున ఉన్న ఓ చెట్టు కొమ్మల్లో పడింది. అ కొమ్మల్లో ఒక గ్రద్ద గూడు కట్టుకొని ఉంది. ఆకాశం నుండి సుజాత వచ్చి పడగానే గ్రద్ద ఆ పాపని కాళ్ళలో కరచుకొని తీసుకుపోయింది- జంతువుల సమావేశానికి.
అక్కడ చాలా జంతువులు సమావేశమై ఉన్నాయి. అవన్నీ సుజాతని చూసి చాలా ముచ్చట పడ్డాయి. అప్పుడు గ్రద్ద వాటిని ఉద్దేశించి "మనకు, మనుషులకు మధ్య సంబంధాలు బాగా చెడిపోతున్నాయి. వాటిని బాగు చేయాలంటే ఈ పాప లాంటి వాళ్ళు చాలా అవసరం. మీలో ఈ అమ్మాయిని ఎవరు పెంచే బాధ్యత ఎవరు తీసుకుంటారో వాళ్ళు ముందుకు రండి. మీవల్ల మన జంతు సమాజానికే కాదు, మనుషులకు కూడా మేలు జరుగుతుంది" అని.
జంతువులన్నీ‌ ఆలోచనలో పడ్డాయి. పులులు, సింహాలు 'మేం మాంసాహారులం. ఎప్పుడో‌ ఓసారి ఈ పాపను తినేయాలనిపించినా అనిపించచ్చు.
మేం పెంచుకోం' అన్నాయి. జింకలు, అడవి దున్నలు- 'మేం ఒకచోట ఉండనే ఉండం. మా వల్ల కాదు' అన్నాయి.

అప్పుడు ఒక భారీ ఏనుగు ముందుకు వచ్చింది- 'నేను పెంచుకుంటాను- నేను ఒంటరిదాన్నేగా, నాకూ తోడు అవసరం' అన్నది. మిగతా జంతువులన్నీ‌ పాపను దీవించి, 'నీకు ఎలాంటి అవసరం‌ ఉన్నా మాకు చెప్పు! వస్తాం" అని ఏనుగుకు చెప్పి వెళ్లి పోయాయి.
ఇక ఏనుగు ఆ పాపను తన మీద ఎక్కించుకొని ఇంటికి తీసుకువెళ్లింది. కొండపైన ఉండే ఒక కోటే, దాని ఇల్లు. ఏనుగు పాపని చాలా ముద్దుగా పెంచుకున్నది. పాప, ఏనుగు ఇద్దరూ కోట గోడమీద కూర్చొని రోజూ ఆకాశాన్ని, దూరంగా ఉన్న పట్టణాన్ని చూసేవాళ్ళు. అడవిలోని జంతువులు, పక్షులు అన్నీ సుజాతకు స్నేహితులయ్యాయి.
ఇక అక్కడ, బందిపోటు దొంగలు 'ఊరి డబ్బు ఎక్కడ దాచావు?' అని శ్రీరాములును చాలా వేధించారు. ఆయన్ని ఎత్తుకెళ్ళి చాలా కాలంపాటు తమ గుహలోనే బందీగా, బానిసగా పెట్టుకున్నారు.
అయినా శ్రీరాములు నోరు విప్పకపోవటంతో, చివరికి 'ఇక లాభం లేదు. వీడిని ఊరికే పోషించేది వృధా. చంపేద్దాం' అని నిశ్చయించుకొని, అడవికి తీసుకెళ్ళారు.

అది చూసిన పక్షులు కొన్ని సుజాత దగ్గరికి వచ్చి "సుజాతా! మీ నాన్నను బందిపోటువాళ్ళు చంపేయబోతున్నారు. త్వరగా వచ్చి కాపాడుకో! పద పద!‌ ముందు!" అని తొందర పెట్టాయి.
సుజాత తక్షణం వాటి వెంట బయలుదేరింది. ఆ పాప వెనకనే ఏనుగు, అడవిలోని మిగతా జంతువులు అన్నీ వెళ్ళాయి. వాటన్నిటి సహాయంతో సుజాత బందిపోట్లకు బుద్ధిచెప్పింది; తండ్రిని కాపాడుకున్నది!
దాంతో అడవిలోని జంతువులంటే ఊరి ప్రజలకు, ఊళ్ళో వాళ్లంటే అడవి జంతువులకు మంచి అభిప్రాయం కలిగింది. ఏనుగు, సుజాత విడదీయరాని మిత్రులైనారు. ఇక అటుతర్వాత బందిపోట్లు ఏనాడూ ఆ ఊరివైపుకు రాలేదు. అందరి సొమ్మూ సురక్షితంగా ఉంది!