ఒక ఊళ్లో చిన్న గ్రంథాలయం ఒకటి ఉండేది. అక్కడి పుస్తకాలకి మామూలు పుస్తకాల లాగానే కాళ్లూ, చేతులూ,కళ్లూ, ముక్కు లాంటివి ఏవీ లేవు; కానీ వాటికి వినడం, మాట్లాడటం వచ్చు!
పైగా అది చాలా చిన్న గ్రంథాలయం కూడా: కాబట్టి మొదటినుండీ అవే పుస్తకాలు వున్నాయి. అందుకని అవి వేళా పాళా లేకుండా ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉండేవి.
వాటి మాటలు కూడా మన మాటల్లానే ఉండేవి. దాంతో వాటి మాటలు విన్న ఊళ్ళోవాళ్ళు 'ఈ గ్రంథాలయంలో దెయ్యలున్నాయి బాబోయ్' అని అటువైపు రావడం మానేశారు. కానీ లైబ్రేరియన్‌ మాత్రం రోజూ భయపడుతూనే వచ్చి, కుర్చీ బయట వేసుకొని కూర్చునేవాడు- లేదంటే జీతం రాదు మరి!
ఇట్లా కొన్నాళ్ళు గడిచే సరికి, తమనెవరూ పట్టించుకోవడం లేదని దిగులు మొదలైంది పుస్తకాలకి.

అంతే కాక, ఒక వారం రోజులుగా ఎలుకలు కూడా రావడం మొదలుపెట్టాయి! ఎలుకల అడుగుల చప్పుడు వినగానే పుస్తకాలన్నీ భయంతో బిర్ర బిగుసుకుపోయి, నిశ్శబ్దంగా ఉండటం మొదలు పెట్టాయి.
ఎలుకలు వచ్చి, ఎంచక్కా ఏదో ఒక పుస్తకాన్ని కాసేపు కొరుక్కొని వెళ్లిపోయేవి! ఆ ఎలుకల్ని లైబ్రేరియన్‌ కూడా చూశాడు; కానీ ఎలుకలు లోపలికి వెళ్లినప్పుడు లోపల్నుండి మాటలు వినపడట్లేదు. దాంతో అతను 'దెయ్యాలకు ఎలుకలంటే భయం కాబోలు' అనుకొని, ఎలుకల్ని తరమకుండా వదిలేశాడు.
ఇక ఆ ఊళ్లో అయితే జనాలు అందరూ గ్రంథాలయం గురించి పూర్తిగా మర్చిపోయే పరిస్థితి వచ్చింది. అప్పుడు వచ్చారు, ఊళ్లోకి కొత్తగా- 5వ తరగతి పిల్లలు! అందరూ అల్లరి వాళ్లే! కాకపోతే బాగా ఆడుకుంటారు; ఇంకా బాగా చదువుకుంటారు! బళ్లో పుస్తకాలే కాకుండా, కథల పుస్తకాలు కూడా చదవటం వాళ్ళకి ఇష్టం!
అట్లా వాళ్లు ఒకరోజున వీధిలో నడుస్తూ పోతుంటే గ్రంథాలయం కనిపించింది. "అరే! మన ఊళ్లో గ్రంథాలయం వుంది. మనకెవ్వరూ చెప్పలేదే! సరే వెళ్లి చూద్దాం పదండి!" అని లోపలికి వెళ్లారు. ఊళ్లో చాలా మంది గ్రంథాలయం గురించి అసలు మాట్లాడుకోవటం కూడా మానేశారు కదా, అందుకని వీళ్ళకి కూడా ఎవరూ దెయ్యాల గురించి చెప్పలేదు. ఇక లైబ్రేరియన్‌ ఏమో వీళ్లని చూసి కూడా "లోపలికి వెళ్లాక దెయ్యాల మాటలు వినబడితే అప్పుడు వీళ్లకే తెలుస్తుందిలే; నేనెందుకు, చెప్పటం?' అని వీళ్లని ఆపలేదు.

పిల్లలు లోపల వున్న పుస్తకాల్ని చూసి "అరెరే! వీటిని ఎలుకలు కొట్టేసాయి! ఏమండీ లైబ్రేరియన్‌ గారు, ఇవెందుకండీ, ఇట్లా ఉన్నాయి. బాగు చేయచ్చుకదా? లోపలంతా దుమ్ము, బూజు ఉంది!" అన్నారు.
అప్పటికీ లైబ్రేరియన్‌ అసలు విషయం చెప్పలేదు. ఊరికే వీళ్ళని ఆట పట్టిద్దామని "నేనొక్కణ్ణీ ఎన్నని చేయను పిల్లలూ?! మీకు అంత ఓపిక, సరదా ఉంటే మీరే చేసుకోండి గదా?! ఏమైనా సామాన్లు కావాలంటే చెప్పండి, తెప్పిస్తాను" అన్నాడు.
పిల్లలంతా కాసేపు తమలో తాము మాట్లాడుకొని, "సరే లెండి సార్! అయితే మాకు ఒక బూజు కర్ర, ఇంకా ఊడవడానికి, తుడవడానికి సామాను, కాసిని రంగు కాగితాలు తెప్పించండి. యీ లోపల మేం వెళ్లి యీ పుస్తకాలకు వేయడానికి అట్టలు, ఇంకా మాదగ్గర ఉన్న మరికొన్ని కథల పుస్తకాలు తీసుకొస్తాం, ఇంకో గంటలో" అని చెప్పి వెళ్లిపోయారు.
లైబ్రేరియన్‌ వాళ్లు అడిగిన సామాను తెచ్చి భయం భయంగానే లైబ్రరీ లోపల పెట్టి, మళ్లీ బైట కుర్చీలో కూర్చొని పేపరు చదువుకోసాగాడు. కొంత సేపటికి పిల్లలు తమదగ్గరున్న కథల పుస్తకాలు, అట్టలు తీసుకొచ్చారు. వెంటనే పనిలోకి దిగారు కూడా. ముందు లోపల బూజంతా దులిపారు. అంతా ఊడ్చారు. పాత పుస్తకాల మీద వున్న దుమ్ము దులిపారు. వాటికి అట్టలు వేసారు. తాము తీసుకొచ్చిన కథల పుస్తకాలను ఒక అరలో సర్దారు. మొత్తం గ్రంథాలయాన్నంతా కడిగి, తుడిచారు. "రంగు కాగితాల్ని రేపు అతికిద్దాములే" అని అందరూ ఆడుకోవడానికి వెళ్ళి పోయారు.
అట్లా పాత పుస్తకాలకి తమను 'చాలా రోజుల నుండి మనుషులెవరూ కనీసం ముట్టుకోవటం కూడా లేదు' అనే బాధ తీరింది. పిల్లలు ఆడుకోవడానికి వెళ్లిన తర్వాత కాసేపటికి వాటికి కొంచెం ఓపిక వచ్చింది. ఐతే అవి 'మాట్లాడదాం' అనుకునే లోపే ఎలుకల అడుగుల చప్పుడు వినపడింది. చటుక్కున అన్నీ నిశ్శబ్దం అయిపోయాయి.
విచిత్రం ఏంటంటే, పిల్లలు తెచ్చిన కథల పుస్తకాలలో ఒకటి అసలు ఈ గ్రంథాలయం లోదే- చాలా రోజుల క్రితం దాన్ని ఎవరో తీసుకు వెళ్ళి, తిరిగి ఇవ్వటం మరచారు. అట్లా అది వాళ్ల పిల్లల్ని చేరి; చివరికి మళ్ళీ ఆ పిల్లల ద్వారా ఈ గ్రంధాలయానికే వచ్చింది. అయితే ఆ సంగతులేవీ ఆ పుస్తకానికి తెలీదు! అందుకే అది కూడా ఏమీ మాట్లాడలేదు. 'అసలు తను మాట్లాడగలదు' అన్న విషయాన్నే ఆ పుస్తకం మర్చిపోయింది పాపం.
కానీ అది కూడా అన్నీ వినగలదు కదా, అందుకని ఎలుకల అడుగుల చప్పుడు దానికి కూడా వినిపించింది. అయినా ఎప్పటి మాదిరి మామూలుగానే ఉంది.
ఎలుకలు వచ్చి, "ఇక్కడంతా మారిపోయింది- దుమ్ము దుశానం ఏమీ లేదు. అస్సలు బాలేదు" అని గొణుక్కున్నాయి. అంతలో వాటి చూపు కొత్తగా వచ్చిన పుస్తకాల మీద పడింది.
ఇన్ని రోజులుగా పాత పుస్తకాలు తినలేక ఉసూరు మంటున్న ఎలుకలకు, కొత్త పుస్తకాల్ని చూడగానే ప్రాణం‌ లేచి వచ్చినట్లయింది. అవి ఇక కొత్తవాటి దగ్గరికి వచ్చి ఒక్కొక్క దాన్ని కొరికి రుచి చూడడం మొదలు పెట్టాయి. అయితే మన కొత్త పుస్తకం ఇన్నాళ్ళూ నొప్పి అనేదే ఎరుగదు- పిల్లలు పాపం వాటిని జాగ్రత్తగా చూసుకున్నారు! అందుకని ఇప్పుడు ఎలుక కొరకగానే అది గట్టిగా "ఎవ్వర్రా అది, నన్ను కొరికింది?! అంతగా ఆకలి వేస్తే అన్నం తినండి, లేదంటే గడ్డి తినండి. పుస్తకాల్నా, తినేది?!" అని అరిచేసింది.
ఒక్కసారిగా అంత పెద్ద గొంతుతో అరుపు వినపడేసరికి ఎలుకలకి వణుకు మొదలై, పరుగో పరుగు! "ఇంక మళ్లీ ఆ పక్కకి రాకూడదు బాబూ!" అని అరుచుకుంటూ పారిపోయాయి.
కొత్తపుస్తకం కొత్త గొంతు విన్న పాత పుస్తకాలకి ఆశ్చర్యం వేసింది. ఎలుకలు పారిపోయేసరికి ఆనందం కూడా వేసింది. ఇక లైబ్రేరియన్‌కేమో మళ్ళీ భయం పట్టుకుంది. "దెయ్యాలు ఇప్పుడు ఎలుకల్ని కూడా బెదర గొట్టేశాయి- అయ్యో, ఏం చేసేది దేవుడా!" అని బయటే కూర్చొని వణకటం మొదలు పెట్టాడు.
ఇక పాత పుస్తకాలన్నీ "ఎవరది?! ఎలుకల్ని బెదరకొట్టిన ధైర్యవంతులు?!" అన్నాయి. దానికి "నేనే" అన్న సమాధానం వచ్చింది. మాటా మాటా కలిసాయి. అంతా చాలా సంతోష పడ్డారు.
అట్లా మాటలు ఎక్కువయ్యే సరికి, లైబ్రేరియన్‌ తిట్టుకుంటూ "పాడు దెయ్యాలు! మనుషుల్ని ఇక్కడకు రాకుండా చేస్తున్నాయి! ఇప్పుడు ఎలుకలను కూడా తరిమేసాయి! ఇంక దీనికి నిప్పంటించేస్తే, నేను కూడా హాయిగా ఇంటికి వెళ్లి ఏదో ఒక పని చేసుకొని బ్రతకొచ్చు. పీడా వదిలి పోతుంది!" అని గట్టిగా గొణుక్కుంటూ తన కుర్చీని మరింత దూరంగా రోడ్డు మీదికి జరుపుకొని కూర్చున్నాడు.
ఆ మాట విన్న పాత పుస్తకాలన్నీ 'నిజంగా తగలబెట్టేస్తాడేమో' అని భయంతో అరవసాగాయి. అప్పుడు ఆ కొత్త కథల పుస్తకం అందర్నీ "ఆపండిరా, మీ గోల! అతను ఏమన్నాడో వినలేదా?! మన మాటల వల్లే దెయ్యాలున్నాయని అందరూ భయపడు-తున్నారు. ఆలోచించి చూస్తే 'ఇన్నాళ్లూ నేను మాట్లాడకపోవటం వల్లనే పిల్లలు నన్ను చూసి భయపడకుండా నన్ను జాగ్రత్తగా చూసుకున్నారు' అనిపిస్తుంది.

మీరు వింటానంటే ఒక మాట చెప్తా. దానితో మీ కష్టాలన్నీ పోతై; మళ్లీ మనుషులు ఇక్కడికి వస్తారు; వచ్చి మిమ్మల్ని అందరినీ జాగ్రత్తగా చూసుకుంటారు" అన్నది.
మిగిలిన పుస్తకాలన్నీ "నువ్వేం చెప్తే అది చేస్తాం! చెప్పు!" అన్నాయి.
అప్పుడు అది "ఇప్పటినుండీ మనుషుల అడుగుల చప్పుడు వినగానే మనం మాట్లాడటం మానేద్దాం. అసలు రేపు ఉదయం నుండీ గ్రంథాలయం తలుపులు తెరవగానే మాట్లాడటం మానేద్దాం. సాయంత్రం గ్రంథాలయాన్ని పూర్తిగా మూసేసేంత వరకూ అస్సలు మాట్లాడకూడదు. ఆ తర్వాత కావాలంటే మాట్లాడుకుందాం. అది కూడా గోల గోలగా కాకుండా, బయటి వాళ్ళు ఎవ్వరికీ వినపడకుండా చిన్నగా! అట్లా కొన్ని రోజులు ఉంటే, అప్పుడు ఇంక 'దెయ్యాలు లేవురా!' అనుకుంటూ మనుషులు మళ్ళీ వచ్చి మళ్ళాడుతారు" అంది.
అన్ని పుస్తకాలూ "సరే" అన్నాయి.
మరుసటి రోజు పొద్దున తలుపు తెరవడానికి ముందే అన్ని పుస్తకాలూ నిశ్శబ్దంగా వున్నాయి. లైబ్రేరియన్‌ తలుపు తెరిచి కాసేపు చూసాడు- మాటలేమీ వినపడకపోయేసరికి అశ్చర్య పడ్డాడు! అంతలోనే పిల్లలు వచ్చారు. లోపల అన్నీ రంగు కాగితాలు అతికించారు. చిన్న చిన్న బొమ్మలు తాము గీసిన వాటిని, తెచ్చిన వాటిని అక్కడక్కడా అతికించారు. ఆపైన అందరూ సంతోషంగా కాసేపు పుస్తకాలు చదువుకొని, ఆటలు ఆడుకునేందుకు వెళ్లిపోయారు. ఆ మొత్తం సమయంలోనూ ఒక్క పుస్తకం కూడా గొంతెత్తి మాట్లాడలేదు. పిల్లలు వెళ్లిపోయాక కూడా అవన్నీ మాటలు బయటికి వినపడకుండా మాట్లాడుకున్నాయి.
మాటలు వినపడకపోయే సరికి, లైబ్రేరియన్‌కి కొంచెం ధైర్యం వచ్చింది. రోడ్డు మీదనుండి తన కుర్చీని లోపలికి తెచ్చి కూర్చున్నాడు.
ఆరోజు ఇక సాయంత్రం వరకూ మాటలు వినపడలేదు; ఎలుకలు కూడా కనపడలేదు. దాంతో చాలా ఏళ్ల తర్వాత లైబ్రేరియన్‌ సంతోషంగా ఇంటికెళ్లాడు. పుస్తకాలన్నీ కూడా చాలా సంతోషపడ్డాయి. కొత్త పుస్తకానికి ధన్యవాదాలు తెలుపుకున్నాయి.
"నువ్వు అలా ఎలా అరిచావు? వాటిని భలే భయపెట్టావు! అంత ధైర్యం ఎక్కడిది, నీకు?" అని అడిగాయి.
దానికి అది "ధైర్యమా! నాకెక్కడిది? కాకపోతే నాకు భయం లేదు అంతే. అసలు కారణం ఏంటో తెలియకుండా ఊరికే భయపడటం మూర్ఖత్వం. ఊళ్లో వాళ్లకి అసలు 'మనం మట్లాడగలం' అని తెలియదు కదా, ఊరికే మాటలు మాత్రం వినబడేసరికి భయపడ్డారు! మీరేమో ఎలుకలు అనేవి ఏంటో తెలీక, మిమ్మల్ని కొరుకుతుండే సరికి భయపడ్డారు! ఇంక ఆ ఎలుకలేమో నేను మాట్లాడతానని, అరవగలనని తెలీక, నా మాటలు విని భయపడ్డాయి! నేనేమో అవేంటో తెలీకపోయినా, భయపడకుండా అరిచాను అంతే! కారణం తెలియకనే మనం చాలా వాటికి భయపడతాం. వెతికి కారణాలు కనుక్కోడానికి ధైర్యం ఉన్నా, లేకున్నా, భయం మాత్రం ఉండకూడదు" అని చెప్పింది. "నిజమే కదా" అని నవ్వుకున్నాయి అన్నీ.
ఇక ఆరోజునుండీ 5వ తరగతి పిల్లలు, లైబ్రేరియన్‌ కూడా- రోజూ వచ్చి గ్రంథాలయం లోపల కూర్చొని చదువుకోవటం మొదలుపెట్టారు. కొన్నాళ్లు వాళ్లని గమనించి, మెల్లగా ఊళ్లోవాళ్లు కూడా ఒక్కరొక్కరూ రావటం మొదలుపెట్టారు.
ఇప్పుడు గ్రంథాలయం నిండా పుస్తకాలు ఉన్నాయి! కొత్త అల్మార్లు ఉన్నాయి! పిల్లలు గీసిన బొమ్మలు ఉన్నాయి! వాళ్లు ఆడుకునే బొమ్మలకి పూర్తిగా ఒక గది కేటాయించారు! గ్రంథాలయం మొత్తం కళకళలాడుతున్నది.
నిజం ఎలా వున్నా, ఊరు ఊరంతా 5వ తరగతి పిల్లల్ని "ఎంతైనా మీరు చాలా ధైర్యవంతులురా, ఒరే!" అని పొగిడింది.
అట్లా పొగిడినప్పుడల్లా వీళ్ళు అందరికీ కొత్త పుస్తకం చెప్పిన విషయమే చెప్పారు: "ధైర్యం ఉండటం కంటే, భయం లేకపోవటం చాలా ముఖ్యం! బహుశ: మాకు అంతగా భయం లేదు కావచ్చు" అని.