అది ఒక సాయంత్రం. పిల్లలందరూ బడి నుంచి ఇంటికి సంతోషంగా తిరిగి వస్తున్నారు.
కానీ రోడ్డు మీద ఒక ప్రక్కగా నిలబడ్డ ఒక అక్క, తన తమ్ముడితో అంటున్నది: "మనం కూడా అందరి లాగా బడికి వెళ్తే బాగుంటుందిరా! కానీ నాన్న ఒప్పుకోడు!" అని.
"మనం ఇంకోసారి నాన్నని అడిగి చూద్దాంలేవే!" అన్నాడు తమ్ముడు.
ఆ తర్వాత ఇద్దరూ వాళ్ళ అమ్మ దగ్గరికి పోయి, "అమ్మా మేం కూడా బడికి వెళ్తాం అమ్మా!" అని అడిగారు.
అమ్మ అంది, "నేను సంపాదిస్తానా, ఏంటి? సంపాదించేది మీ నాన్న! వెళ్ళి నాన్నను అడగండి!" అని.
వాళ్ళు నాన్న దగ్గరికి వెళ్లి అడిగారు- "నాన్నా! మేం బడికి వెళ్తాం నాన్నా!" అని.

"ఎలా వెళ్తారు? మన దగ్గర డబ్బులు కూడా చాలా కొన్నే ఉన్నాయి కదా? అంత డబ్బు మీ బడికే కట్టేస్తే, మరి మనం తినేందుకు తిండి ఎక్కడినుండి వస్తుంది?..మీరు ఇక్కడే ఉండండి. తినేందుకు ఏదైనా తిండి తెస్తాను" అని వాళ్ల నాన్న కొంచెం అవతలికి వెళ్ళాడు. పిల్లలిద్దరూ అక్కడే దిగులుగా కూర్చొని ఉన్నారు.
అంతలో వర్షం మొదలైంది. జోరుగా కురుస్తున్నది. రోడ్లన్నీ ఖాళీ అయ్యాయి. అందరూ ఎక్కడికక్కడ వెళ్ళి దాక్కున్నారు. కానీ‌ ఈ పిల్లలు ఇద్దరూ మటుకు అక్కడే నిలబడి ఉన్నారు- వాళ్ళ నాన్న "వస్తాను-ఇక్కడే ఉండండి" అన్నాడుగా, అందుకని.
అంతలో ఒక ముసలాయన వచ్చి, "ఏంటి పిల్లలూ, వర్షం పడుతూ ఉంటే ఇక్కడ తడుస్తూన్నారు?! తడవకూడదు రండి!" అని వాళ్ళ చెయ్యి పట్టుకుని ఎదురుగుండా ఉన్న టీ షాపుకు తీసుకుని వెళ్ళాడు.
"వేడి వేడిగా రెండు టీలు చేసి ఇవ్వు, వీళ్లకు!" అన్నాడు షాపతనితో.
టీ తాగుతూ ముసలాయనకు తమ గురించి చెప్పారు పిల్లలు. "మీ నాయన ఏం చేస్తాడు?" అడిగాడు ముసలాయన.
"ఏ పనంటే అది చేస్తాడు" చెప్పాడు తమ్ముడు.
"చదువు వొచ్చా?"
"రాదు"

"కానీలే, మరి మా ఆఫీసులో వాచ్ మ్యాన్ పని ఉంది. జీతంకూడా కొంచెం ఎక్కువే ఇస్తాను. పని చేస్తాడా?" అడిగాడు ముసలాయన.
"చేస్తాడు- జీతం ఎక్కువిస్తే ఏ పనైనా చేస్తాడు" అన్నది అక్క.
"అయితే రేపు మీ నాయన్ని ఈ 'టీ'షాపు ఆయన్ని కలవమనండి. నన్ను ఎక్కడ కలవాల్సిందీ రాసి ఇస్తాడు ఈయన" అని ముసలాయన వెళ్ళిపోయాడు. ఆరోజు వాళ్ళ నాన్న రాగానే టీ షాపతను టీ ఇచ్చి చెప్పాడు: మీ పిల్లలు నీకు పని వెతికి పెట్టారు" అని.
"ఏం పని?" అడిగాడు నాన్న.
"ఆఫీసులో వాచ్‌మ్యాన్ పని! నీ పంట పండింది! చాలా డబ్బులు ఇస్తారు! నమ్మకంగా చేస్తావు గద?!" అడిగాడు టీ దుకాణం ఆయన.

"నమ్మకానికి మన దగ్గర కొదవే లేదు" అన్నాడు నాన్న.
"అయితే ముసలాయన ప్రత్యేకంగా చెప్పాడు: ఒక రూలు పెట్టాడు- మీ పిల్లల్ని బడికి పంపిస్తేనేనట, నీకు పని ఇచ్చేది-"
"డబ్బులు లేకనే కద, వాళ్లని బడికి పంపనిది?! మంచి జీతం ఇస్తే నేను ఎందుకు పంపను? వాళ్ళు చదువుకుంటేనే మేలు!" అన్నాడు నాన్న, ముసలాయన ఆఫీసు అడ్రసు తీసుకుంటూ.
మరునాటి రోజున నాన్న పనిలో చేరాడు. ఆ తర్వాతి రోజున పిల్లలిద్దరూ‌ బడిలో‌ చేరారు.