వెంగాపురపు వెంగమ్మ కొడుకు వెంగళప్ప అమాయకుడు. పైగా అతనికి ఎక్కడా లేనంత మతిమరుపు.
ఒక రోజు పొద్దున్నే వెంగమ్మ కొడుకుతో "ఒరే! ఆషాఢమాసం వచ్చేసిందంటే ఇక మంచి రోజులు ఉండవు. అయితే అది కచ్చితంగా ఎప్పుడు వస్తుందో తెలీదు. మంగాపురంలో మన పంతులుగారు ఉంటారు. నువ్వు ఇప్పుడు బయలుదేరి ఆయన దగ్గరికి పోవాలి. ఆషాఢమాసం ఎప్పుడు వస్తుందో కనుక్కొని రావాలి. పోయి రాగలవా, సరిగ్గా?!" అన్నది.
"ఓ! దానిదేముంది, తప్పకుండా పోయొస్తాను వెంటనే! మంగాపురమేగా?" అని అన్నం మూట కట్టుకొని బయలుదేరాడు వెంగళప్ప.
మధ్య దారిలో అన్నం తినేంతవరకూ వాడికి ఆషాఢమాసం గుర్తుందిగానీ, ఆ తర్వాత వాడు ఆ మాటను మర్చిపోయాడు. ఎందుకో మరి, తను మంగాపురం పోవాలి, అక్కడ పంతులు గారిని కలవాలి- ఏదో అడగాలి.. ఏం అడగాలి?"
అట్లా ఆలోచిస్తూ పోయి పోయి వాడు నేరుగా ఓ గుంతలో పడ్డాడు. గుంత లోతుగా ఉందేమో, మరి ఎంత ప్రయత్నించినా అందులోంచి బయటికి రాలేకపోయాడు. "కాపాడండి-కాపాడండి!" అని అరవటం మొదలు పెట్టాడు.
అటుగా పోతున్న బాటసారులు కొందరు వాడిని చూసి జాలిపడ్డారు. తమ అంగవస్త్రాల్ని అన్నిటినీ కలిపి మోకులాగా కట్టి, దాన్ని గుంతలోకి జారవిడిచారు. దాని సాయంతో బైటికి వచ్చాడు వెంగళప్ప.
"ధన్యవాదాలు మీకు" అన్నాడు. వాళ్ళు "ఏమీ పరవాలేదు" అన్నారు.
వెంగళప్పకి ఆమాట చాలా నచ్చింది. "ఏమీ పరవాలేదు- ఏమీ పరవాలేదు" అని వల్లె వేసుకుంటూ ముందుకు సాగాడు.
సాయంత్రం అయ్యే సరికి వాడు ఇంకా తర్వాతి పల్లెలోనే ఉన్నాడు. అక్కడ వాడిని గుర్తుపట్టిన ముసలమ్మ ఒకామె "ఒరేయ్ వెంగళప్పా! ఎటురా, పోయేది? ఇవాల్టికి ఇక్కడే ఉండి, రేప్పొద్దున పోదువు" అన్నది
"ఏమీ పరవాలేదు- ఏమీ పరవాలేదు" అన్నాడు వెంగళప్ప.
"పరవా ఎందుకు లేదు! ఉంది. ఇప్పుడు వదిలితే మీ అమ్మ నన్ను ఇంక నమ్మి బ్రతకనిస్తుందా? అసలే కరువు రోజులు!" అన్నది ముసలమ్మ, వాడిని ఇంట్లోకి పిలిచి అన్నం పెడుతూ.
"కరువు రోజులు- కరువు రోజులు!" అనుకోవటం మొదలెట్టాడు వెంగళప్ప.
తెల్లవారగానే ముసలమ్మ "నాయనా! కరువు రోజులు వచ్చేసాయి! ఏదో కొంచెం చద్దన్నం మాత్రం పెట్టగలను నేను!" అన్నది.
"కరువు రోజులు" అన్నాడు వెంగళప్ప.
"అవున్నాయనా! కరువులో అధికమాసం అంటే ఇదే!" అన్నది ముసలమ్మ బాధగా.
"ఆ! దొరికింది! అధికమాసం! అధికమాసం" అరిచాడు వెంగళప్ప సంతోషంగా.
"ఏంటది?" అన్నది అవ్వ, బిత్తరపోతూ.
"అధికమాసం ఎప్పుడొస్తుందో కనుక్కోవాలి నేను. అదేదో ఊళ్ళో పంతులుగార్ని అడిగి!" అన్నాడు వెంగళప్ప.
"అధికమాసం కాదు, ఆషాఢమాసం అయి ఉంటుంది!" అన్నది అవ్వ కొంచెం అనుమానంగా.
"అదే అదే" అన్నాడు వెంగళప్ప "ఆషాఢ మాసం - ఆషాఢ మాసం" అనుకుంటూ.
అవ్వ వాడికి మంగాపురం దారిని కూడా గుర్తు చేసి, త్వరగా సాగనంపింది.
మెల్లగా పంతులుగారి దగ్గరికి వెళ్ళాడుగానీ, ఆషాఢమాసాన్ని మరచేపోయాడు వెంగళప్ప. వెళ్ళి, ఆయన దగ్గర నిలబడి, "అరవగోల- ఎప్పుడొస్తుంది?" అని అడిగాడాయన్ని.
పంతులు గారికి సంగతి అర్థం కాలేదు. "అరవగోల రావటం ఏమిటీ?!" అని ఆలోచించాడు.
ఆయన ఎంత వెతికినా తన దగ్గరున్న పుస్తకంలో అరవగోల కనిపించలేదు. అందుకని ఆయన ఉపాయం చేసి, "పుస్తకం కనపడలేదు బాబూ! నువ్వంటున్న అరవం ఏదో త్వరగానే వచ్చేస్తుందిలే, 'రేపో మాపో' అన్నాడు.
వెంగళప్పకు చాలా సంతోషం వేసింది. "దీన్ని అస్సలు మరిచిపోకూడదు! 'రేపో మాపో'" అని బిగ్గరగా అనుకుంటూ వెనక్కి పోసాగాడు.
వాడు పోయే దారిలోనే పాపం, ఎవరికో జబ్బు చేసి ఉంది. ఊళ్ళో వాళ్ళంతా వచ్చి వాళ్లని పరామర్శిస్తున్నారు. వెంగళప్ప వాళ్లకేసి చూస్తూ "రేపో మాపో- రేపో మాపో" అన్నాడు. దాంతో ఊళ్ళో వాళ్ళంతా వెంగళప్ప మీదికి దూకి దబదబా బాదేసారు.
లబోదిబో మన్న వెంగళప్ప చివరికి ధైర్యం చేసి "ఇంతకీ నేనేమి అనాలో చెప్పండి" అన్నాడు.
"అనుమానం ఏమున్నది, "అయ్యో పాపం" అనాలి!" అన్నారు వాళ్ళు.
"అయ్యో పాపం- అయ్యో పాపం!" అని గట్టిగా అంటూ సాగాడు వెంగళప్ప.
కొంచెం దూరం పోయే సరికి అతనికి ఓ పెళ్ళి ఊరేగింపు ఎదురైంది.
వెంగళప్ప "అయ్యో, పాపం" అంటుంటే వాళ్లకు ఎక్కడలేని కోపం వచ్చింది.
వాళ్ళు వాడిని నాలుగు అంటుకొని, "అలా అనకూడదురా, 'కనుల విందుగా ఉంది' అనాలి" అని చెప్పారు.
ఆసరికే ఏమనాలో మర్చిపోయిన వెంగళప్ప ఇప్పుడు బిగ్గరగా "కనులవిందుగా ఉంది- కనుల విందుగా ఉంది" అంటూ పోసాగాడు.
ఆ ఊరు దాటాడో లేదో వాడికొక కొట్టం కనిపించింది. అది తగలబడుతుంటే, ఊళ్ళో వాళ్ళు దాన్ని ఆర్పేందుకు విఫల ప్రయత్నం చేస్తున్నారు.
"కనుల విందుగా ఉంది" అంటున్న వెంగళప్పను చూసి వాళ్లందరికీ చిర్రెత్తుకొచ్చింది. వాళ్ళు వాడికి "అట్లా అనకూడదు- 'వర్షం పడితే బాగుండు' అనాలి" అని చెప్పారు.
ఏ పాత్రలో పోస్తే ఆ రూపాన్ని అందుకునే వాడు మన వెంగళప్ప. "సరే, దానిదేముంది? అలాగే అంటాను- 'వర్షం పడితే బాగుండు వర్షం పడితే బాగుండు'" అంటూ అక్కడినుండి బయలుదేరి వెంగాపురం పొలిమేరలు చేరుకున్నాడు.
ఇంకొద్ది సేపట్లో ఇల్లు చేరుకుంటాడనగా వాడికి తెలిసిన కుమ్మరి ఒకడు కనిపించాడు.
"వర్షం పడితే బాగుండు" అంటున్న వెంగళప్పని పట్టుకొని "అవేం మాటలురా? రేపోమాపో అనైనా చేర్చు! లేకపోతే నా వ్యాపారం ఏమైపోవును?" అన్నాడతను.
"అవును! అదే సరైన మాట! రేపో-మాపో!" అని సంతోషంగా అరుచుకుంటూ ఇంట్లోకి చేరుకున్నాడు వెంగళప్ప.
"మా నాయనే! ఎంత ప్రయోజకుడి-వయ్యావురా! మంగాపురం పోయి పంతులుగారిని శాస్త్రం కనుక్కొచ్చావంటే, నువ్వింక నా చేతికి అందివచ్చినట్లే!" అని మురిసిపోయింది వెర్రి వెంగమ్మ!