స్వామి, శాంతకుమార్ ఇద్దరూ మంచి స్నేహితులు. ఇద్దరూ కలిసి ఉండేవాళ్ళు, కలిసి చదివేవాళ్ళు, ఎక్కడికి వెళ్ళినా ఇద్దరూ కలిసే వెళ్ళేవాళ్ళు. ఇద్దరూ మంచి ధైర్యస్తులు కూడా,
అయితే మరి వేసవికాలం వచ్చింది. సెలవల సమయం; మిత్రులిద్దరూ విడిపోయే సమయం కూడా- ఎందుకంటే మరి, స్వామి శాంతకుమార్‌లవి వేరు వేరు ఊళ్లు!
"ముందు నువ్వు కొన్ని రోజులు మా ఊరికి వస్తే, తర్వాత నేను కొన్ని రోజులు మీ ఊరికి వస్తాను" అని బేరం పెట్టాడు శాంతకుమార్. ఇంట్లో వాళ్లని అడిగితే వాళ్ళూ సరేనన్నారు. దాంతో స్వామి, శాంతకుమార్ ఇద్దరూ కలిసి శాంత వాళ్ల తాతగారి ఊరు- వెంకట్రామాపురం- వెళ్ళారు.
వెంకట్రామాపురంలో పాడు బడ్డ కోట ఒకటి ఉంది. ఊళ్ళోవాళ్ళందరికీ అదంటే భయం. ఎవ్వరూ అటువైపుకు వెళ్ళేవాళ్ళు కాదు- ముఖ్యంగా చీకటి పడిందంటే, ఇంక అటువైపుకు చూడాలంటే కూడా భయపడేవాళ్ళు అందరూ. కారణం ఏముంది- దయ్యాలు!
"ఆ కోటలో ఇదివరకు అనేక యుద్ధాలు జరిగాయి. అనేకమంది సైనికులు అకాల మృత్యువు పాలయ్యారు. వాళ్ళంతా దయ్యాలయ్యారు. ఇనప గొలుసుల్ని ఈడ్చుకుంటూ రాత్రంతా అటూ ఇటూ తిరుగుతుంటారు.." ఇది విన్నాక మిత్రులిద్దరికీ ఉత్సాహంతో అసలు ఏ మాత్రం నిద్రపట్టలేదు.
"అసలు ఆ మహల్‌లో ఏముందంటావురా?" అడిగాడు స్వామి.
"ఏమోరా! ఎవరో మనుషులే అయి ఉంటారు. కానీ అక్కడ ఎందుకు ఉంటున్నారు? ఏం చేస్తున్నారు?" అడిగాడు శాంతకుమార్.
"కనుక్కోవాల్సిందే!” అన్నాడు స్వామి.
"మరింకేం? ఇవాల్టి రాత్రే ముహూర్తం!" అన్నాడు శాంతకుమార్.
ఆ రోజు రాత్రి పన్నెండు గంటలకు మ్రోగేట్లు అలారం పెట్టుకున్నారు పిల్లలిద్దరూ. ఇంట్లో వాళ్లకు తెలిస్తే తిడతారు. అందుకని వాళ్లకెవ్వరికీ ఏమీ చెప్పలేదు.
సెల్‌ఫోను చేతపట్టుకొని, దాని వెలుతురులో మెల్లగా పురాతన మహల్ దగ్గరికి వెళ్ళారు- గట్టిగా మాట్లాడుకుంటూ.
వాళ్ళు మహల్ ప్రాంతాలకు చేరుకునేటప్పటికి సమయం దాదాపు ఒంటిగంట అవుతున్నది. అ ప్రదేశం అంతా నిర్మానుష్యంగా, జీవం లేనట్లు స్తబ్దుగా ఉన్నది.
పిల్లలిద్దరూ మహల్ ద్వారం వద్దకు వెళ్లారో, లేదో- కోట వెనకవైపు ఆకాశంలో భయంకరంగా ఒక మెరుపు మెరిసింది. ఉరుములు ధబధబా ఉరిమాయి. అకస్మాత్తుగా మహల్ కిటికీలోంచి వాళ్ళ మీదికి వెలుతురు ప్రసరించింది. ఆ వెలుతురులో ఏదో వింత ఆకారపు నీడ ఒకటి.. వాళ్ళవైపుకే చూస్తూన్నట్లు నిలబడి ఉంది..
పిల్లలిద్దరూ గబగబా వెనక్కి పరుగెత్తారు. అంతలోనే ధడధడ మంటూ భయంకరమైన శబ్దం, వెలుగు! పెద్ద పిడుగులాంటిదేదో వచ్చి మహల్‌లో ఎక్కడో పడింది.
స్వామి, శాంత కుమార్ ఇద్దరూ ఇల్లు చేరుకునేంత వరకూ ఇక ఎక్కడా ఆగలేదు.
"భయపడ్డావా?" అడిగాడు స్వామి.
"అస్సలు లేదు. నువ్వు?" అడిగాడు శాంతకుమార్.
"అక్కడ ఉన్న నీడ మనిషిదైనా అయి ఉండాలి, లేదా ఏదైనా బొమ్మదైనా అవ్వాలి. నీడ కావాలంటే అసలు కాంతి కావాలి. మనల్ని చూసి ఎవరో అక్కడి లైట్లను ఆన్ చేసారు. కాబట్టి అక్కడ మనుషులు తప్పని సరిగా ఉన్నారు. వాళ్ళు ఎవరో దుష్టకార్యాలు చేసే వాళ్ళే- మంచి వాళ్ళైతే కాదు. మరి ఏం చేద్దామంటావు?" అడిగాడు స్వామి.
"అవును. రాత్రి మనం నిలబడ్డ ద్వారం ప్రక్కనుండే కొన్ని కరెంటు వైర్లు మహల్ లోపలికి వెళ్ళాయి చూసావా? పాత కాలపు మహల్‌కి అసలు కరెంటు వైర్లు, లైట్లు అవసరం లేదు కదా! అవి అక్కడికి ఎలా వచ్చాయి? ఇది ఏదో మోసమే!" అన్నాడు శాంతకుమార్.
శాంతకుమార్ వాళ్ల తాతయ్య పాతకాలంలో ఆ ఊరికి పట్వారీగా పని చేసి ఉన్నాడు. శాంత కుమార్ ఆయనకు సంగతి మొత్తం చెప్పాడు. ఆయన కొంచెం ఆలోచించి, "సరే రండి- మిమ్మల్ని మన సర్పంచ్ గారికి పరిచయం చేస్తాను. పట్నం పిల్లల మాదిరి, ఆయనతో ముచ్చట్లు పెట్టి, ఊరి విషయాలు కనుక్కోండి. ఆయన మంచాయనే, ఏమీ పర్లేదు" అని వాళ్లని సర్పంచ్ దగ్గరికి తీసుకెళ్ళాడు తాతయ్య.
సర్పంచ్ గారు మంచి మనిషి. ఊరి చరిత్రను అడిగిన పిల్లల్ని చూసి ఆయన చాలా ముచ్చట పడ్డాడు. వాళ్లకి చరిత్ర అంతా చెప్పాడు: "కోటలో ఇప్పుడు ఎవ్వరూ లేరు. కరెంటూ లేదు, ఏమీ లేదు. ఊళ్ళోవాళ్ళు కోటకు భయపడతారు. అది మామూలే. కోట వెనక పొలాలున్నాయి. అవును- మోటార్లు ఆడతాయి. అక్కడ ట్రాన్సుఫార్మర్ ఉంది ఒకటి. మంచి భూములు. పంటలు పడుతాయి బాగానే"
ఆరోజు రాత్రి ఏడు గంటల సమయంలో తాతయ్య చేత పోలీసులకు ఫోన్ చేయించారు పిల్లలిద్దరూ. అయితే పోలీసులు వచ్చే లోగానే బయలుదేరి కోట వెనక్కి వెళ్ళారు, ఆయన్ని కూడా వెంటబెట్టుకొని.
అక్కడి ట్రాన్సుఫార్మర్ దగ్గరో మనిషి కరెంటు వైర్లని తగిలిస్తున్నాడు. "మన ఊరి మనిషి కాదు" అన్నాడు తాతయ్య. "సరే,అయితే రా, మరి! అంటూ మెల్లగా వెళ్ళి, ఆ మనిషి ముఖం మీదికి తను తెచ్చిన గోతాం విసిరేసాడు స్వామి. అతను తేరుకునేలోగా తాతయ్య తన చేతి కట్టెతో అతని గుండు మీద బాదాడు. అతను క్రింద పడగానే ఇద్దరూ కలిసి అతని కాళ్ళు చేతులు కట్టేసారు.
ఆలోగా శాంతకుమార్ మెల్లగా కోట వెనక వైపు నుండి గడియ తీసి కోట లోపలికి దూరాడు. అక్కడ గ్రుడ్డి వెలుతురులో చాలా వైర్లు కనిపించాయి. అటు ప్రక్కనే ఒక కంప్యూటర్ కూడా ఉన్నది. అతను ఆశ్చర్యపోయి చూస్తూండగానే హటాత్తుగా తెల్ల బట్టలు ధరించిన ఆకారం ఒకటి అతని మీదికి దూకింది. శాంతకుమార్ చురుకుగా ప్రక్కకు దూకటం, ఆ ఆకారం కాలు అక్కడ ఉన్న వైరుపై పడటం ఒకేసారి జరిగిపోయాయి. మరుక్షణం అక్కడంతా మెరుపులు! తెల్లబట్టల మనిషి ఒకడు పెద్దగా అరిచి, తన్నుకులాడుతూ క్రింద పడ్డాడు!
శాంతకుమార్ అతన్ని కట్టెతో ప్రక్కకు నెట్టి, అతను ధరించిన బట్ట పీలికలతోటే అతని కాళ్ళు చేతులు కట్టేసాడు.
అక్కడి పెట్టెల్లో కరెన్సీనోట్ల కట్టలు చూసి పిల్లలిద్దరితో పాటు తాతయ్య కూడా నోరు తెరిచాడు.
"వీళ్ళు ఎవరంటార్రా? ఇన్ని డబ్బులు ఎక్కడివి వీళ్లకు?" అడిగాడు తాతయ్య ఆశ్చర్యంగా.
"నెల క్రితం మా మండలంలో ఉన్న బ్యాంకులో దొంగలు పడి, కోటి రూపాయలపైగా నోట్ల కట్టల్ని ఎత్తుకెళ్ళారు తాతయ్యా! ఆరోజున, మరుసటి రోజున కూడా ఊళ్ళోకి చాలామంది పోలీసులు వచ్చారు. ఆ దొంగల జాడ ఇంకా తెలియలేదు. "వాళ్ళే వీళ్ళు" అని నా అనుమానం" చెప్పాడు స్వామి.
అంతలోకే పోలీసు జీపు అక్కడికి చేరుకున్నది. "ఎవరు వీళ్ళు, ఇక్కడ ఏం చేస్తున్నారు?" అని అడిగారు వాళ్ళు. అంతలోకే వాళ్ళ చూపు అక్కడున్న నోట్ల కట్టల మీద పడింది. "వీళ్ళు.. వీళ్ళు.." అన్నారు.
"అవును. బ్యాంకు దోపిడీ చేసింది వీళ్ళే- ఇక్కడికి వచ్చి దాక్కున్నారు" చెప్పారు పిల్లలిద్దరూ.
పోలీసులు దొంగలిద్దరికీ బేడీలు వేసారు.
పిల్లల ధైర్య సాహసాలకు మెచ్చిన ప్రభుత్వం వాళ్లకు ప్రత్యేక బహుమతిని ఇచ్చింది. ఊళ్ళో వాళ్లంతా వాళ్లని బలే మెచ్చుకున్నారు.