దక్షిణాఫ్రికానుండి ఒకసారి గాంధీ ఏదో పని మీద ఇంగ్లాండ్‌కి వెళ్ళాడు.
లండన్‌లో ఉంటున్న భారతీయులు కొందరు ఆయన్ని ఒక మీటింగుకు పిలిచారు. "దక్షిణాఫ్రికాలో మీ పోరాటం గురించి చెప్పాలి" అన్నారు వాళ్ళు.
మీటింగుకు వచ్చే వాళ్ళంతా విద్యార్థులూ, విప్లవకారులూనూ. అందరూ 'మన దేశానికి స్వాతంత్ర్యం ఎలా తేవాలి?' అని ఆలోచిస్తున్న వాళ్ళు. దక్షిణాఫ్రికాలో గాంధీ చేస్తున్న పనులను గురించి వాళ్ళు విని ఉన్నారు. "ఆయుధాలు లేకుండా, ఆవేశం లేకుండా పోరాటం ఎలా చేస్తారు, ఎవరైనా?" అని వాళ్లకు ఆశ్చర్యం. ఆ వివరాలు గాంధీ ద్వారా నేరుగా వినాలని వాళ్ల కోరిక. "నచ్చితే ఆ విధానాలను భారతదేశంలో కూడా అమలు చేయచ్చు" అని వాళ్ల ఆలోచన.
సామాన్యంగా ఇలాంటి మీటింగుల కోసం అందరూ ఎక్కడెక్కడి నుండో వచ్చి జమ అవుతారు. స్థానికులు, యువకులు ముందస్తుగా వచ్చి, అందరూ తినేందుకు, త్రాగేందుకు ఏర్పాట్లు చేస్తారు. ఎవ్వరూ ఒకరికొకరు గట్టిగా తెలియరు కూడా. ఇక సమయం అవుతుందనగా పెద్దలు, అతిథులు వస్తారు. అంతా భోజనం చేసాక, అతిథులు మాట్లాడతారు; ప్రశ్నలు-జవాబుల కార్యక్రమం ఉంటుంది; కొన్ని కొన్ని పరిచయాలు అవుతాయి. తర్వాత అంతా ఎవరి దారిన వాళ్లు పోతారు.
"ఓ వస్తాను" అన్నాడు గాంధీ.
"ఇక్కడ నాకు వేరే పనేమీ లేదు; కాబట్టి ఇది బాగానే ఉంటుంది: అయితే రెండు షరతులు- భోజనం కేవలం శాకాహారమే అయి ఉండాలి. మాంసం ఉండకూడదు; సారాయి కూడా ఉండకూడదు!" అన్నాడు.
ఆ వచ్చిన వాళ్ళు 'సరే' అన్నారు. మీటింగు ఫిక్స్ అయ్యింది: "దక్షిణాఫ్రికా నాయకుడు గాంధీ అధ్యక్షత వహిస్తాడు. ఎవరైనా రావచ్చు. స్వాగతం" అని లండన్ అంతటా ప్రచారం జరిగింది. "వీలైనవాళ్లు కొంత ముందుగా వస్తే, సభకు కావలసిన ఏర్పాట్లలో పాలు పంచుకోవచ్చు" అని కూడా రాసారు.
ఉత్సాహం ఉన్న వాళ్ళు కొందరు ఐదారు గంటల ముందే సభా స్థలికి చేరుకున్నారు. ఏర్పాట్ల బాధ్యత తీసుకున్న స్థానికులెవరో ఆ వచ్చినవాళ్లందరికీ పనులు పంచారు. గిన్నెలు, తప్పేలాలు శుభ్రం చేసుకోవడం, కూరగాయలు తరగటం, వంటపని- అన్నీ జోరుగా మొదలయ్యాయి.
కార్యక్రమం ప్రారంభమయ్యే సమయం దగ్గర పడింది. కుర్రవాళ్ళు కొందరు గేటు దగ్గర నిలబడి గాంధీ కోసం ఎదురు చూడటం మొదలు పెట్టారు. గాంధీ జాడ లేదు. "ఎవరైనా వెళ్ళి పిల్చుకొని వస్తే సరిపోయేది. దారి తెలుసో తెలీదో?" అన్నారొకరు. "ముఖ్య అతిథి కదా, కొంచెం ఆలస్యంగా వస్తాడేమో!" అన్నారొకరు. "ఇంతకీ ఆయన్ని పిలిచిన వాళ్లేరి, నేనైతే ఆయన్ని ఎప్పుడూ చూడలేదు" అన్నాడు ఒకాయన. "మేమూ చూడలేదు" అన్నారు మిగతా వాళ్ళు. అందరూ హడావిడిగా పోయి, గాంధీని పిల్చిన నిర్వాహకుల్లో ఒకరిని పిల్చుకొచ్చారు గేటు దగ్గరికి. సభకు ఇంకా ఐదే నిముషాలు ఉన్నది కానీ సభాధ్యక్షుడే లేడు!
"వచ్చేస్తూ ఉంటాడులే! భోజనం పనులు ఎంతవరకు వచ్చాయి?! తీరా అతిథులు అందరూ వచ్చాక, అప్పుడు ఇంకా వంట కాలేదంటే బావుండదు" అంటూ వంట గదిలోకి దారి తీసాడు నిర్వాహకుడు.
లోపల గాంధీ వంట పనిలో బిజీగా ఉన్నాడు! అందరూ ఎవరికి అప్పగించిన పనులు వాళ్ళు చేసుకుంటూ, కబుర్లు చెప్పుకుంటూ నవ్వుతున్నారు. వాళ్లందరితో కలిసి గాంధీకూడా వంట చేస్తున్నాడు! అది చూసిన నిర్వాహకుడు ఒక క్షణం బిత్తరపోయాడు.
తేరుకొని, "అదిగో! అక్కడ వంట చేస్తున్న మనిషే, గాంధీ!" అని నిర్వాహకుడు అరిచే సరికి అందరి చూపులూ గాంధీ మీదికి తిరిగాయి. "ఇంత సేపటినుండీ తమతో కలిసి పనిచేస్తూ, సరదాగా మాట్లాడుతున్న వ్యక్తి గాంధీనే!" అని గుర్తించి వాళ్ళంతా నోళ్ళు ఎండబెట్టారు.
"అయ్యో! మీరని మాకు తెలీలేదు. క్షమించండి. ఈ వంట పనంతా మీకెందుకు, ఆపండి- వేరే వాళ్ళం మేం చేస్తాం" అంటూ గాంధీని వారించబోయారు అందరూ. "ఏం ఫర్వాలేదు- వంటపని బాగుంటుంది- ఇంక ప్లేట్లు పెట్టేసెయ్యండి- అందరం తినేసి, ఆపైన మాట్లాడుకోవచ్చు" అన్నాడు గాంధీ.
పనులన్నీ బరువు కావు. జాగ్రత్తగా చూస్తే ఒక సంగతి అర్థం అవుతుంది: మనకు ఇష్టం లేని పనులు బరువనిపిస్తాయి.., కానీ, ఇష్టంగా చేసే పనులు ఏవైనా సరే, తేలికౌతాయి! అంతే కాదు, అవి మనకు సంతృప్తిని, ప్రశాంతతతో కూడుకున్న జ్ఞానాన్ని ఇస్తాయి!
గాంధీ లాంటి వాళ్ళు అన్ని పనుల్నీ గౌరవించారు. వాటిలో ఎక్కువ తక్కువలు పెట్టుకోలేదు. మేకలకు స్నానం చేయించటాన్ని, దారం వడకటాన్ని, పొలం పనిని, చదువు చెప్పటాన్ని, తమ పరిసరాలను శుభ్రం చేసుకోవటాన్ని, సొంతంగా చదవటాన్ని, రాయటాన్ని, మాట్లాడటాన్ని, పోరాటాన్ని అన్నిటినీ ఇష్టపడ్డారు. అన్నిటినీ గౌరవించారు.
మనం కూడా అట్లా ఉండగల్గితే నిజంగా బాగుంటుంది- కదూ?
పనులను గౌరవించే వాళ్లందరికీ నమస్కారాలు!
కొత్తపల్లి బృందం