అనగా అనగా ఒక ఊళ్ళో పాములు పట్టేవాడు ఒకడు ఉండేవాడు. పాములను ఆడించుకుంటూ బ్రతికేవాడతను. ఒకరోజు అతనికి బ్రతికి ఉన్న ఎలుక ఒకటి దొరికింది. అతను వెంటనే దాన్ని తన పాము బుట్టలో వేసేసాడు. "బాగుంది- ఇన్నాళ్ళకు పాముకు తగిన ఆహారం దొరికింది" అని నవ్వుకున్నాడు.
ఇక ఆ బుట్టలోపల ఉన్న పాము చాలా ఆకలి మీద ఉంది. ఎలుకను చూడగానే చటుక్కున దాని మీదికి దూకి పట్టుకున్నది. ఇంకొక్క క్షణంలో దాన్ని మ్రింగేస్తుందనగా సమయస్ఫూర్తి ఉన్న ఎలుక కిచకిచలాడుతూ- "ఓయ్!హలో! నీకు చాలా రోజులనుండీ ఆహారం సరిగ్గా లేనట్లుంది. అయినా ముందు నేను చెప్పేది విను, ఒక్క నిముషం: నువ్వు గనక నన్ను తినకుండా వదిలేసావంటే నేను నీకు చాలా గొప్ప సహాయం ఒకటి చేస్తాను. ప్లీజ్- నేను చెప్పేది విను" అన్నది.
ఎలుకను మ్రింగేందుకు నోరు బార్లా తెరిచిన పాము నవ్వింది. "చెప్పు, ఏం సాయం చేస్తావు?" అన్నది. "నేను నిన్ను ఈ బుట్టలో నుండి విడిపించగలను!" అన్నది ఎలుక.
"చావబోతూ కూడా పరాచకాలు ఆడుతున్నావు. బలే ఎలుకవి దొరికావు. ఇంత పెద్ద పామును నేనే వీడి బుట్టలో చిక్కుకొని బయటపడలేక పోతున్నాను. ఒట్టి ఎలుకవు- నువ్వు నన్ను ఎట్లా విడిపిస్తావు?" అంది పాము, ఎలుకను నోట్లో పెట్టుకోబోతూ ఆగి.
ఎలుక ధైర్యవంతురాలు. "సరే, నమ్మకం లేకపోతే నీ ఇష్టం. మళ్ళీ నన్ను అనకు- ఇప్పుడైతే నీకు రెండు అవకాశాలున్నై: నన్ను తినేసి జీవితాంతం వీడి చెరలోనే ఉండిపోతావా, లేకపోతే ఇప్పుడు కొంచెం సేపు ఆకలికి తట్టుకొని, జీవితాంతం స్వేచ్ఛగా బ్రతకగలవేమో చూస్తావా.. ఆలోచించుకో" అన్నది.
పాము ఆలోచనలో పడింది. "నిజమేలే. ఇది ఎట్లాగూ తప్పించుకోలేదు. నన్ను తప్పించకపోతే నేను కొంచెం సేపటి తర్వాతనైనా దీన్ని తినేస్తాను. అట్లాకాక ఇది నన్ను విడిపించిందనుకో, అప్పుడు దీన్నీ తినచ్చు, ఇంకా ఏమైనా కూడా తినచ్చు!" అనుకొని, "సరే, కానియ్యి. ముందు నన్ను ఇక్కడి నుండి విడిపించు, చూద్దాం" అన్నది.
వెంటనే ఎలుక పనిలోకి దిగింది. తనకున్న వాడి పళ్లతో ఆ వెదురు బుట్టను కొరకటం మొదలు పెట్టింది. మెల్లగా కన్నం పెద్దది అవ్వసాగింది. సరిగ్గా ఎలుక పట్టేంత కన్నం అవ్వగానే అది ముందు అందులోంచి దూరి బయటికి వెళ్ళింది. బయటినుండే కన్నాన్ని పెద్దది చేసి, "ఆఁ.. ఇప్పుడు బయటికి రా" అంటూ చటుక్కున అటు ప్రక్కనే ఉన్న ఒక చిన్న రంధ్రంలోకి దూరిపోయింది.
పాము జరజరా బుట్టలోంచి బయటికి వచ్చింది. స్వేచ్ఛా వాయువుల్ని పీల్చుకున్నది. ఎలుకకోసం చుట్టూ కలయ జూసింది. ఎలుక దూరిన రంధ్రం దగ్గర ముఖం పెట్టి, "ఏమైంది, బయటికి రా, ఇద్దరం కలిసి పారిపోదాం, ఇక్కడినుండి!" అన్నది.
"నిన్ను విడిపిస్తానన్నాను, నా మాట నిలుపుకున్నాను. ఇప్పుడు నువ్వు ఇంక ఎట్లా తప్పించుకుపోతావో నీ యిష్టం. ఇకపైన నీ దారి నీది, నా దారి నాది" అన్నది ఎలుక, రంధ్రంలో ఇంకా లోపలికి ముదుగుకొని.
"అదేంటి, మనిద్దరం స్నేహితులం! కలిసి ధైర్యంగా పారిపోవచ్చు, రా!" అన్నది పాము.
"అయ్యో, బాగుంది సంబరం. మనం స్నేహితులం ఎట్లా అవుతాము? అప్పుడంటే ఏదో ప్రాణాపాయ సమయం. నా ప్రాణాలు కాపాడుకోడానికి అట్లా చేశాను; నీ ప్రాణాలకోసం నువ్వు అట్లా చేసావు. ఇప్పుడు మన అసలు లక్షణాలు బయట పడతాయి. అందుకని, మన స్నేహం చెల్లదు గానీ, ఇక వెళ్ళిరా, పాములవాడు వచ్చేలోపు తప్పించుకో, పో!" అన్నది ఎలుక.
"అమ్మో! ఈ ఎలుక చాలా తెలివైనది- నాకు దొరకదు. ముందు పారిపోతే, ఆ తర్వాత కడుపాత్రం మళ్ళీ చూసుకోవచ్చు కానివ్వు" అని ఇక వెనక్కి తిరిగి చూడకుండా జారుకున్నది పాము.