మల్లేశు, సీతాలు చాకలి పని చేసేవాళ్ళు. వాళ్లకు ఒక గాడిద ఉండేది. దాని పేరు గుడ్డూ. బట్టలు రేవుకు మోసేందుకు, బియ్యం సరుకులు తెచ్చేందుకు, పక్క ఊళ్ళో ఉన్న కూతురింటికి వెళ్ళేందుకు అన్నిటికీ ఆ గాడిదమీదే తిరేగేవాడు మల్లేశు.
ఓ రోజు కూతురింటికి ప్రయాణం కట్టాడు మల్లేశు. ఏవేవో పచ్చళ్ళు, పెరట్లో కాసిన కూరగాయలు సంచుల నిండా నింపాడు. "ఏమయ్యా! వేడిగా కాసిని గారెలు చేసి కూతురికి తీసుకు వెళ్దామా?" అంది సీతాలు.
"అవునవును. అల్లుడికి గారెలంటే చాలా ఇష్టం. చకచకా చేసిపెట్టు. తీసుకొని బయలుదేరుదాం" అన్నాడు మల్లేశు.
సీతాలు వంటింట్లోకి వెళ్ళి సరిగ్గా పదంటే పది గారెలు చేసింది.
కమ్మటి ఆ గారెల వాసనకు చుట్టు ప్రక్కల ఇళ్ళలో వాళ్లందరి నోళ్ళూ ఊరాయి.
పొరుగింటి రత్నమ్మ, సుబ్బరత్న కొంచెం సేపు ఆగారు గానీ, ఇక తట్టుకోలేక గబగబా వచ్చేసారు- "ఏం చేస్తున్నావు వదినా, ఇంత ఘుమఘుమలు!" అంటూ.
"అల్లుడికి గారెలంటే ఇష్టం కదా వొదినా, అందుకని ఇప్పుడు ఇవి పెట్టుకున్నాం. ఇదిగో తిని చూసి చెప్పండి అని వాళ్ళిద్దరికీ తలా ఒక గారే ఇచ్చింది సీతాలు.
వాళ్ళు తింటుంటే చూస్తూ ఉండలేకపోయాడు మల్లేశు. "సీతాలూ! నేను వీటిని మూట కట్టేయనా? బయలుదేరచ్చు ఇంక?" అంటూనే వాటి దగ్గరికి వెళ్ళి చకచకా రెండు గారెలు తినేసాడు. "బాగా వచ్చినై. రుచి బలే ఉంది" అంటూ.
"అయిపోతున్నాయి.. తినకు! అయిపోతున్నాయి.. తినకు" అని సీతాలు గుండె అరిచింది, కానీ రత్నమ్మ, సుబ్బరత్న ఉండగా ఆ మాటని బయటికి అనలేదు కదా! అందుకని "అవునవును బాగా వచ్చాయి. ఇంకో రెండు తినయ్యా!" అనేసింది పళ్ళు నూరుతూ.
'సీతాలు అన్నది కదా' అని మల్లేశు ఇంకో గారె లాగించాడు.
పొరుగిళ్ళవాళ్ళు వెళ్ళగానే సీతాలు మల్లేశుతో వాదనకు దిగింది-"తినమంటే అట్లా తినెయ్యటమేనా?! చూసుకోవద్దా?! నేను మనిషిని కాదా?!" అని. దాంతో మల్లేషు సీతాలుని బుజ్జగించి, ఆమెకు రెండు గారెలు తినబెట్టాడు- తను ఇంకో గారెను లాగిస్తూ.
అంతసేపటి నుండీ గారెల వాసనని పీలుస్తున్న గాడిద ఇంక తట్టుకోలేక పోయింది. నేరుగా ఇంట్లోకి వచ్చేసి, మిగిలిన రెండు గారెల్నీ లటుక్కున తినేసి, చక్కా పోబోయింది.
సీతాలు లబోదిబోమన్నది. "గారెలు తినేసి పోతోంది చూడయ్యో!" అంటూ.
దాంతో మల్లేశు కట్టె పట్టుకొని గాడిద వెంట పడ్డాడు: "బిడ్డకోసం అన్నన్ని గారెలు చేస్తే తినేసేందుకు నీకు నోరెలా వచ్చిందే!" అని అరుస్తూ. అతని వెనకనే సీతాలు!
గాడిదకి తల తిరిగింది: "నేను తిన్నది రెండే కదా, అట్లా అంటారేంటి?!" అని. అయినా తనని తాను కాపాడుకోవాలి కాబట్టి, అది చటుక్కున వెను తిరిగి, రోడ్లోకి పరుగు పెట్టింది.
కొద్ది దూరం దాని వెంట పడిన మల్లేశు, సీతాలు అలిసిపోయి, ఒట్టి చేతులతో వెనక్కి తిరిగి వచ్చారు. అప్పటికి ఊరి పొలిమేర చేరుకున్న గాడిద కొంచెం సేపు చాలా ఆలోచించింది: "రెండు గారెలు తింటే కూడా తట్టుకోలేని యజమాని వృధా" అనిపించింది దానికి. అందుకని అది ఆ ప్రాంతాల్లో దొరికిన గడ్డినే మేసేసి, అక్కడే పడుకొని నిద్రపోయేందుకు చూసింది. అయితే ఎంత సేపటికీ దానికి నిద్ర రాలేదు. ఒకవైపునుండి మల్లేశు కట్టె పట్టుకొని వస్తున్నట్లు, మరో వైపునుండి పాములు, తేళ్ళు ప్రాకినట్లు, మరో వైపునుండి పులులు, తోడేళ్ళు వచ్చి మీద పడినట్లు అనిపించి వణుకుతో జ్వరం వచ్చేసింది దానికి. సాయంత్రం అయ్యేసరికి అది లేచి వెనక్కి బయలుదేరింది: "మళ్ళీ ఇంటికే పోతాను. పని లేకపోతే నిద్ర కూడా రాదు" అనుకుంటూ.
సరిగ్గా ఆ సమయానికే దాన్ని వెతుక్కుంటూ వచ్చాడు మల్లేశు. ఇప్పుడు అతని చేతిలో కట్టె లేదు. "పోనీలే! గారెలు తింటే తినేసావు. ఏం చేస్తాం. ఈసారినుండీ తినకు!" అంటూ దానిమీద బరువులు వేసి, కులాసాగా బిడ్డ ఊరికి తీసుకెళ్ళాడు. "మీకోసం గారెలు కూడా చేసిందమ్మా, మీ అమ్మ! కానీ ఇదిగో, ఈ గాడిదే- ఇది తినేసింది ఒక్కటీ మిగల్చకుండా!" అని మల్లేశు బిడ్డకి చెబుతుంటే గాడిదకు తల తీసేసినట్లయింది. అయినా సర్దుకుని అట్లాగే నవ్వుముఖంతో నిలబడింది అక్కడంతా.
తెల్లవారగానే మల్లేశం దాన్ని ఇంటికి తెచ్చి, ఎప్పుడూ కట్టే చోట కట్టేస్తే "అబ్బ! ఇల్లు చేరుకున్నాను!" అనుకొని తృప్తిగా నిద్రపోయింది గాడిద.
అయినా ఆ తర్వాత సంవత్సరం వరకూ అందరూ దాన్ని తిడుతూనే ఉన్నారు: "వదిలేస్తే ఇది ఎన్ని గారెలైనా తినేస్తుందమ్మా" అని!