అనగా అనగా ఓ అగ్రహారంలో విద్యానాథుడనే ఆకతాయి పిల్లవాడు ఒకడు ఉండేవాడు. వాడు చేసే తుంటరి పనులకు విసిగిపోయిన అమ్మా నాన్నలు వాడికి పదేళ్ల వయసు రాగానే "దేవుడా!‌ పదేళ్లపాటు మమ్మల్ని కాపాడావు! అంతే చాలు!" అంటూ మొక్కులు తీర్చుకొని, ఆ వెంటనే పేరున్న ఓ గురుకుల పాఠశాలలో పిల్లవాడిని చేర్పించేసి, చేతులు దులుపుకున్నారు. ఆ గురుకులం దట్టమైన ఓ అడవి మధ్యలో ఉండేది. ఎటు వెళ్ళాలన్నా చాలా దూరం. అట్లాంటి చోట ఉంచితే తప్ప కొడుకు దారిలోకి రాడని తల్లిదండ్రుల ఆలోచన.

ఆ గురుకులానికి ఆచార్యుడు కమల-నాథుడు. ఆయన చాలా మంచివాడు, విద్వత్తుగలవాడు. అనేక మంది విద్యార్థులకు వేదవిద్యను ఉచితంగా బోధించేవాడు.

ఆయన అదుపు-ఆజ్ఞలలో పెరిగిన విద్యానాథుడు మంచి విద్యావంతుడైతే ఐనాడు; కానీ వినయ విధేయతలు లేని విద్య ఎంత నేర్చీ ఏం ప్రయోజనం?! అతని అహంకారం పెరిగి సముద్రమంతైంది.

వయస్సు పెరిగే కొద్దీ విద్యానాధుడు చాల గర్విష్ఠిగా తయారైనాడు: "నేను ఆషామాషీ విద్యార్థిని కాదు! అద్భుతమైన తపస్సం-పన్నుడిని! మంత్ర శాస్త్రాన్ని పూర్తిగా ఔపోసన పట్టిన వాడిని! గురువుగారు కమల-నాథులంతటి వాడిని! నాకు కోపం తెప్పిస్తే ఎవరినైనా శపించగలను! నా మంత్రాలకు తిరుగుండదు! నా నోటిమాటే మంత్రం!" అంటూ తోటి విద్యార్థులను, తన కంటే చిన్నవాళ్లని బెదిరించటం మొదలు పెట్టాడు.

రాను రాను గురుకులంలోని విద్యార్థులంతా అతని నోటి మాటకు భయపడి, అణిగి-మణిగి ఉండటం నేర్చుకున్నారు. 'ఇతను గురుకులాన్ని విడిచి ఎప్పుడు వెళ్ళిపోతాడా' అని ఎదురు చూడటం మొదలుపెట్టారు.

అనుకున్నట్టే ఒక రోజున గురువుగారు అతన్ని పిలిచి, "నాయనా!‌ విద్యానాథా! ఇంతటితో నీ విద్యాభ్యాసం పూర్తయింది. ఇప్పుడిక నువ్వు మీ ఊరికి తిరిగి వెళ్లవచ్చు. నేను నేర్పిన ఈ విద్యలతో ప్రజలకు మేలు చేస్తూ, సుఖంగా జీవించు. పది మందికి మేలు చేస్తూ మంచి పేరు సంపాదించుకో" అని, ఆశీర్వదించి పంపాడు.

ఆ వెంటనే విద్యానాథుడు ఒక ఎతైన రాతిమీద కూర్చొని, విద్యార్థులందర్నీ పిలిచాడు. "ఇదిగో! నేను ఇక ఊరికి వెళ్తున్నాను. గురువుగారి అనుజ్ఞ అయ్యింది" అన్నాడు.

అందరూ సంతోషంగా ఊపిరి పీల్చుకొని "సరే, పోయి రా!" అన్నారు.

"పోతాను- పోతాను. ముందు మీరంతా నా ఆశీర్వాదం తీసుకొని తరించండి. నా అంతటి తపస్సంపన్నుడు మళ్ళీ మీకు దొరకునో, లేదో!" అన్నాడు విద్యానాథుడు.

అందరూ బిత్తరపోయారు. అయినా ఇది ఎప్పుడూ ఉండే వ్యవహారమే గనక, అందరూ అతనికి సాష్టాంగ నమస్కారం చేసి, అతని ఆశీస్సులు పొందారు.

అట్లా బయలు దేరిన విద్యానాథుడు ఒక పల్లెటూరు చేరినాడు. అక్కడ ఒక గుడి దగ్గర కూర్చుని, "నేను కమలనాథుని వద్ద విద్య పూర్తి చేసిన మహా పండితుడిని! మీరంతా నా ఆశీర్వాదాలు తీసుకుంటే, మీకు, మీ గ్రామానికీ మంచి జరుగుతుంది" అన్నాడు.

ఆ పల్లెటూరివాళ్ళు ఉత్త అమాయకులు. వాళ్ళంతా భయ భక్తులతోటి వరసలు వరసలుగా వచ్చి, ఈయనకు కానుకలు సమర్పించి, ఆయన ఆశీస్సులు పొందారు.

అట్లా మొదలుపెట్టి, విద్యానాథుడు తన దారి పొడవునా వచ్చే పల్లెల్లో అంతటా ఆగి, అందరినీ పిలిచి పిలిచి ఆశీర్వదిస్తూ, వాళ్ళిచ్చే కానుకలను ఆనందంగా స్వీకరిస్తూ పోయాడు.

అట్లా ఒకచోట జమ అయి పాదనమస్కా-రాలు చేస్తున్న పల్లెవాళ్లలో ఎనభై ఏండ్ల ముసలాయన కూడా ఒకడు ఉన్నాడు. ఆయన నిలబడే విద్యానాధుడికి రెండు చేతులూ జోడించి నమస్కరిస్తూ "స్వామీ! తమరు చూడగా ఇంత చిన్నవయస్సు. అంతలోనే వేదాలు, వేదాంగాలు సర్వం చదివానంటున్నారు. నిజమా?! ఇంతకీ ఇప్పుడు తమరి వయస్సెంత స్వామీ?!” అని అడిగేసాడు.

ఆ మాటలు వింటూనే "ఆశీర్వాద స్వామి" తోక త్రొక్కిన త్రాచుపాములాగా అగ్గిమీద గుగ్గిలం ఐపోయినాడు. "ఏమిరా! నీకు ఇంత కండ కావరము?! మా శక్తి సామర్థ్యాలనే శంకిస్తావురా?! మా వయస్సునే అడుగుతావా! మేము మంత్రం చదివితేనే దేవుళ్ళకు శక్తులొస్తాయి. లేదంటే అవి వట్టి రాళ్ళే! అంతటివాడనైన నేను, ఈ మారుమూల మీ పల్లెకు వస్తే, 'మా జన్మ చరితార్థమైనదంటూ నా పాదాలకు వంగి నమస్కరించి ఆశీర్వాదం యాచింపక, నన్నే ప్రశ్నిస్తావురా? నేను తలచుకుంటే ఈ గాలిని ఇప్పటికిప్పుడే ఆపగలను, మీ గ్రామానికి వర్షాలు రాకుండా చేయగలను. అగ్గి పుట్టించి మీ గ్రామం మొత్తాన్నీ క్షణంలో భస్మం చేయగలను! చూస్తావా, నా శక్తులు?!" అంటూ తన కమండలంలోని నీళ్లను చేతిలోకి వంచుకొని, ఏవేవో మంత్రాలు చదవటం మొదలు పెట్టాడు.

గ్రామస్తులంతా బెదిరిపోయారు. అందరూ ముసలాయనను తలా ఒక మాటా అన్నారు. ముసలాయన కూడా "అయ్యా! నన్ను క్షమించండి!" అంటూ స్వామికి సాగిలపడి, "అయ్యా! పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి నమస్కరించ కూడదట! అట్లా చేస్తే చిన్నవాళ్ళ ఆయుష్షు తగ్గిపోతుందట! అందుకే 'తమరి వయస్సు ఎంత?’ అని ప్రశ్నించాను" అని చెప్పి వెళ్ళిపోయాడు.

స్వామి ఆ రోజు రాత్రి అంతా ఆ ఊర్లోనే బస చేసాడు. చిన్నల్నీ, పెద్దల్నీ ఎవ్వరినీ వదల్లేదు: అందరికీ ఆశీర్వాదాలిచ్చాడు. చివరికి, "నా పాదాలు కడిగిన నీళ్ళు మీ ఇళ్ళల్లోనూ, పొలాల్లోనూ చల్లుకోండి పోండి" అని ఆనతి ఇచ్చి, తెల్లవారుతుండగా ఆ గ్రామ పొలిమేరలు దాటాడు.

గాలి చల్లగా వీస్తోంది. వాతావరణం ప్రశాంతంగా వుంది. సూర్యుడు బంగారు కాంతులను కురిపిస్తున్నాడు. పక్షులు కిలకిలారవాలు చేస్తున్నాయి. "ఆహా! ఇవి ఎంత మంచివి! అన్నీ నా కీర్తిని గానం చేస్తున్నాయి!" అనుకున్నాడు స్వామి.

అట్లా మరికొంత దూరం నడిచే సరికి దారికి ఇరువైపులా పూలు చెట్లు, పండ్ల చెట్లు కనిపించాయి. అవి స్వామిని చూసి ఏమీ అనలేదు. స్వామికి కోపం‌ వచ్చింది. "ఎంత పొగరు వీటికి! నా వంటి తపస్వులు వస్తుంటే, ఇవేల, ఈ చెట్లు నేను నడిచేదారిలో పూలనెందుకు చల్లలేదు? ఈ ఫల వృక్షాలన్నీ వంగి మాకు తియ్యని పండ్లనెందుకు యివ్వలేదు? వీటి గర్వం అణచి వేయాల్సిందే"నని నీళ్ళు చేతిలోకి తీసుకొని మంత్రం చదవబోయాడు.

అంతలోనే గురువుగారి మాటలు గుర్తుకొచ్చాయి: 'అనవసరంగా ఎవరినైనా శపిస్తే, నువ్వు సంపాదించిన శక్తులు అంత మాత్రం వ్యర్థమైపోతాయి' అని. వెంటనే ఆ నీళ్ళను తానే త్రాగేసి, ఆ చెట్లను చూసి, "మిమ్మల్ని క్షమించాను బ్రతుక్కోండి పొండి" అంటూ ముందుకు సాగాడు.

ఆలోగా అటు ప్రక్కనే కొండ వారన ఒక గొర్రెల మంద, వాటిని కాచే గొర్రెల కాపర్లు కనబడినారు. "వీళ్లందరినీ ఆశీర్వదిస్తాను" అని సంకల్పించిన స్వామి వాళ్లకేసి తిరిగి కేక వేసాడు. వాళ్ళు కూడా 'ఎవరీ స్వామి?' అంటూ పరుగు పరుగున రాసాగారు.

ఆలోగా స్వామివారి చూపు గొర్రెలమీద పడింది. అవన్నీ తమ దారిన తాము పచ్చిక మేస్తున్నాయి. స్వామి వారికి బుగులు పుట్టింది. "ఇదిగో! మున్ముందు నా ఆశీర్వాదం వీటికి ఇవ్వాల్సిందే" అంటూ వాటివైపుకు నడిచాడు. "స్వామీ! స్వామీ! జాగ్రత్త!" అంటూనే ఉన్నారు కాపరులు. కానీ స్వామి వింటేగా?

"రండి! నాకు మోకరిల్లండి!" అంటూ‌ గొర్రెల్ని బలవంతం చేయటం మొదలు పెట్టాడు.స్వామి వారి శరీరం నిండా విభూది రేఖలు, కుంకుమ బొట్లు ఉన్నాయి. చేతిలో కమండలం, మెడలో రుద్రాక్ష మాలలు! కాషాయరంగు పంచె కట్టినాడు. ఆయన వింత ఆకారాన్ని చూసే సరికి, గొర్రెలు బెదిరి, ఎటుపడితే అటు పరిగెత్తటం మొదలు పెట్టాయి.

ఆ మందలోనే కొమ్ములు తిరిగిన పొట్టేలు ఒకటి ఉన్నది. అది ఆశీర్వాద స్వామిని తేరిపార చూసి. బుసకొట్టి, వెనక్కి పోయినట్లే పోయి, గబుక్కున వచ్చి, స్వామి మోకాళ్లను ఢీకొన్నది. స్వామివారు నేలమీద పడి "అమ్మా!" అని మొత్తుకోసాగారు. పరుగున వచ్చిన గొర్రెల కాపరులు, దొరికిన అడవి తీగలతో ఆయన రెండు కాళ్ళూ బిగించి కట్టి, ఆయన్ని ఎత్తుకొని గ్రామం వైపు పరుగు పెట్టారు.

వైద్యుడి దయవల్ల, వారం రోజుల తర్వాత మెలకువ వచ్చింది స్వామికి. చూస్తే ఎదురుగా, తనకు అంతకు మునుపు నమస్కరించిన ముసలాయన! ఆయన్ని చూస్తూనే ఆశీర్వాద స్వామిలోని అహంకారం కరిగి నీరైంది. లేచి ముసలి వైద్యుని పాదాలకు నమస్కరించి, క్షమించమని వేడుకున్నాడు.

అంతలో ఒక గొర్రెల కాపరి- "స్వామీ! మా గొర్రె పొట్టేళ్ళన్నీ మీ ఆశీర్వాదం కోసం బయట వరుసగా కాచుకొని ఉన్నాయి. మీ కమండలంలోకి నీళ్ళు పోయమంటారా?! అక్షింతలు కలిపి తెమ్మంటారా?!" అన్నాడు.

అహం కరిగిన స్వామివారు జవాబివ్వలేదు.. మౌనంగా తన కాళ్ల వైపు చూసుకుంటూ కూర్చున్నారు!