ఆగస్టు 14. స్వాతంత్ర దినోత్సవానికి ముందురోజు. అన్ని బడులలో లాగే ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో కూడా స్వాతంత్ర్య వేడుకలు జరగనున్నాయి. ఏర్పాట్లన్నీ చకచకా జరుగుతున్నాయి. అందరూ ఆ కార్యక్రమం గురించే మాట్లాడుకుంటున్నారు.

బడిలో చదివే రాహుల్‌ మటుకు మౌనంగా కూర్చొని ఉన్నాడు. అతని స్నేహితుడు సుధీర్ అన్నాడు- "రాహుల్! రేపు మన తరగతి వాళ్ల నాట్యరూపకం ఉంటుంది- ఉదయం ఎనిమిదికల్లా వచ్చేయాలి అందరం- గుర్తుందిగా, ఒకసారి ప్రాక్టీసు చేసుకొని, ఆ వెంటనే ప్రదర్శన!" అని.

"నాకు అసలు ఆసక్తి లేదు. నేను చెయ్యను. అసలు బడికే రాను. ఇంట్లోనే ఉండి సినిమా చూస్తాను" అన్నాడు రాహుల్.

"సినిమాలు ఎప్పుడూ చూసేవే కదరా, ఇట్లా అందరం కలిసి ఏదైనా కార్యక్రమం జరుపుకొనేది ఎప్పుడో ఒకసారి. రా, దానిదేముంది. మజా వస్తుంది" ఒప్పిస్తున్నట్లు అన్నాడు సుధీర్.

"ఏముంది, ఎవరో గెస్టులు వస్తారు, ఏదో మాట్లాడతారు; మనల్ని ఎండలో నిలబెట్టి, కూర్చోబెట్టి చంపుతారు; ఆ తర్వాత సర్కస్‌లో జంతువుల మాదిరి మన చేత గంతులు వేయిస్తారు వాళ్ల ముందు. నాకు అట్లాంటివి ఇష్టం ఉండదు" అన్నాడు రాహుల్.

"అట్లా అనకు! మన బడికి ఈసారి వచ్చే గెస్టు చాలా మంచివాడట. 'మనం అతనినుండి చాలా నేర్చుకోవచ్చు' అని చెప్పారు సోషల్ సార్. అయినా నాకోసం రారా, ఈ ఒక్కసారికీ!" ప్రాధేయపడ్డాడు సుధీర్.

"సరేలే! వస్తా! కానీ ఈ ఒక్కసారికే! మళ్ళీ మళ్ళీ రమ్మనకూడదు!" దిగి వచ్చాడు రాహుల్.

తరువాతి రోజు తెల్లవారుతూనే సుధీర్ ఫోను.."బయలుదేరుతున్నావుగా?" అని.

దాంతో ఇష్టం లేకపోయినా, బలవంతంగా బడికి బయలుదేరాడు రాహుల్. మొదట్లో జెండా వందనం.. అయిపోగానే ఎవరో పాటలు పాడారు; రికార్డు చేసిన పాటలు పెట్టి నాట్యం చేసారు కొందరు. ఏవీ అంత ఆసక్తికరంగా లేవు. రాహుల్‌కి విసుగు వచ్చింది. 'లేచి వెళ్ళిపోదామా' అనుకున్నాడు.

అంతలో "ఇప్పుడు మన అతిథి, మేజర్ శ్రీరామ్‌ మన దేశం గురించి కొద్ది మాటలు మాట్లాడతారు" అని అనౌన్సు చేసారు హెడ్మాస్టరు గారు.

మేజర్ శ్రీరాం ఎత్తుగా, బలంగా, ఆకర్షణీయమైన యూనిఫారం ధరించి ఉన్నాడు. ఆయనకు వచ్చిన మెడల్స్ కావచ్చు, రంగులు రంగులుగా ఆయన జేబునుండి వ్రేలాడుతున్నాయి. ఆయన వచ్చి మైకు పట్టుకొని గంభీరమైన స్వరంతో‌ మాట్లాడసాగాడు-

"ప్రియమైన పిల్లలారా! అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు! ఈసారి స్వాతంత్ర్య దినోత్సవాన్ని మీ మధ్య జరుపుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. గత సంవత్సరం ఈ సమయానికి నేను పంజాబ్ రాష్ట్రం అవతల సరిహద్దులో ఉన్నాను. ఆ రోజు నాకు ఇంకా గుర్తున్నది. మేం జెండా ఎగరేసి సెల్యూట్ చేసామో లేదో, మా పటాలంలోకి ఒక గ్రెనేడ్ వచ్చి పడ్డది. మీకు తెలుసు కదా, గ్రెనేడ్ పేలితే ఆ చుట్టు ప్రక్కల ఉన్నవాళ్ళు పది మందైనా ముక్కలు ముక్కలైపోతారు. మాకెవ్వరికీ ఏం చేయాలో తెలీలేదు. ఆ సమయంలో మీరైతే ఏం చేసి ఉండేవాళ్ళు?" ఆగాడాయన.

"పారిపోయేవాళ్లం" అన్నారెవరో. అందరూ నవ్వారు.

ఆయన నవ్వలేదు. చెబుతూ పోయాడు "గ్రెనేడ్ ప్రక్కనే ఉన్నాడు సుబేదార్ మానిక్ సింగ్. అతను మా ప్లాటూన్ వాడే.. తను వెంటనే ఆ గ్రెనేడ్‌ని చేతిలో పట్టుకొని బయటికి పరుగెత్తాడు. శత్రువులు ఎక్కడ ఉండి ఉంటారో ఊహించుకొని దాన్ని అటువైపుకు విసిరేసాడు!

అంతలోనే మొత్తం పొగ అలుము కున్నది. ఎక్కడెక్కడినుండో తుపాకీలు పేలుతు-న్నాయి. గ్రెనేడ్ పేలింది.. ఎనిమిది మంది శత్రు సైనికులు హతమయ్యారు! మిగిలినవాళ్ళు మమ్మల్ని చుట్టుముట్టారు. మేమందరం ఆత్మరక్షణ పొజిషన్లు తీసుకున్నాం. శత్రువులు ముందుకు కదలకుండా ఆపుతూ హెడ్‌క్వార్టర్స్‌కు కబురుపంపాం. అదనపు బలాలు వచ్చేవరకూ అట్లా మేం కొద్దిమందిమీ శత్రువులను నిలువరించాం. తర్వాత మనవాళ్ళు రావటంతో శత్రువుల దాడి విఫలమైంది.

మేం కాపాడిన ఆ పోస్టు మన రక్షణ వ్యవస్థలో చాలా కీలకమైనది. అది శత్రువుల పాలబడితే వాళ్ళకు భరత భూభాగం లోకి ప్రవేశించటం సులభం ఐపోయేది. మీకెవ్వరికీ భద్రత లేకుండా పోయేది!" ఆయన చెప్పిన తీరులోని ఉత్కంఠకు పిల్లలంతా నిశ్శబ్దం అయిపోయారు. ఒక్కసారి ఆపి, కొనసాగించాడు శ్రీరాం. "ఇది మీకు ఎందుకు చెబుతున్నానో అర్థమైందా, దేశాన్ని స్వతంత్రంగా ఉంచటం కోసం, సరిహద్దుల్ని కాపాడటంకోసం తమ సర్వస్వాన్నీ అర్పించి నిలచి ఉన్నది మన సైన్యం. దేశభక్తికి ఆద్యంతం ప్రతీకగా నిలిచేవాళ్ళం అంతమందిమి ఉన్నాం కాబట్టే మన దేశం ఈరోజున సమున్నతంగా నిలచి ఉన్నది. మీలో ప్రతి ఒక్కరికీ దేశభక్తి ఉందని ఆశిస్తున్నాను.

మీరు పెద్దయ్యాక రకరకాల వృత్తులు చేపడతారు. దేశానికి మేలు చేసే పనులు చేయండి. మీలోంచి కొందరైనా వీర సైనికులు రావాలని నా కోరిక.. " శ్రీరాం మాట్లాడుతున్నంత సేపూ పిల్లలు ఎంతో ఆసక్తిగా విన్నారు. ఆ రోజున శ్రీరాం మన దేశం గొప్పదనాన్ని గురించి మాట్లాడాడు. మనందరం ఎట్లా కలిసి ఉండాలో చెప్పాడు. సైన్యంలో‌ రకరకాల ప్రాంతాలకు చెందినవాళ్ళు, మతాలకు చెందిన వాళ్ళు అందరూ ఎట్లా కలిసి పని చేస్తారో చెప్పాడు. క్రమశిక్షణ, సమయ పాలన గురించి మాట్లాడాడు. ఆ రోజున పిల్లలు మంత్ర-ముగ్ధులైపోయారు.

ఆయన మాట్లాడటం ముగించి సెలవు తీసుకుంటుండగా రాహుల్‌ ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాడు: "సార్! ఈ పని చాలా రిస్కు కదా, మీకు భయం వెయ్యలేదా? మీరు చనిపోతే ఎలాగ?" అని.

శ్రీరాం నవ్వాడు. "నీ పేరేంటి?" అని అడిగాడు. రాహుల్ చెప్పాడు.

ఆయనన్నారు: "చూడు రాహుల్, పెద్ద అవుతున్నకొద్దీ ఎవరికి వాళ్లం ఆలోచిస్తాం.. 'మనం ఎందుకు బ్రతకాలి? ఎట్లా బ్రతకాలి?' అని. అప్పుడు ఓ సంగతి అర్థమౌతుంది. 'మన ప్రాణం ఏమంత లెక్క కాదు. నిజంగానే, మనం ఏం చేస్తున్నాం అనేదే ముఖ్యం' అని. 'దేశాన్ని కాపాడటం ముఖ్యం' అనుకున్నప్పుడు, ఇక దానికోసం ఏం చేయాలో అది చేసేస్తాం. ప్రాణాల గురించి అసలు లెక్క చేయం" అనేసి, రాహుల్ భుజం తట్టి వెళ్లిపోయారాయన.

ఆ తర్వాత రాహుల్‌లో చాలా మార్పు వచ్చింది. 'ఊరికే బ్రతికి ప్రయోజనం లేదు- పదిమందికి పనికొచ్చే పనులు చెయ్యాలి' అనటం మొదలు పెట్టాడు. మొక్కలు నాటే కార్యక్రమాలు, గ్రామాల సందర్శన కార్యక్రమాలు- ఇట్లా బడిలో రకరకాల కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనటం మొదలు పెట్టాడు; అనేక బహుమతులు గెల్చుకున్నాడు కూడా. ఇదివరకు అతనిలో నిండా ఉన్న అనిశ్చితత్వం, అయిష్టం ఇప్పుడు పూర్తిగా మాయమైనాయి!

రాహుల్ పదో తరగతిలో ఉండగా "మేజర్ శ్రీరాంకు మహావీర చక్ర లభించింది" అని వార్త వచ్చింది. "నేనూ సైనికుడినౌతాను!" అన్నాడు రాహుల్, ఆ వార్తను చూడగానే. "నేను కూడా" అన్నాడు సుధీర్.