రాఘవపురంలో నివసించే సూరయ్య కుటుంబాన్ని చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు. ఆయనకు ఒకే కూతురు. పేరు మీనాక్షి.
సూరయ్య చిన్న తనంలో చాలా కష్టాలు ఎదుర్కొన్నాడు. ఆ రోజుల్లో తనకు సినిమాల పిచ్చి ఉండేది. ఇంట్లోవాళ్ల అనుమతితోటీ, అనుమతి లేకుండా కూడానూ చాలా సినిమాలు చూసేవాడు. బడిని ఎగగొట్టి సినిమాలు చూడటం, బడిలో హాజరు తగ్గి, అధ్యాపకులు దండించటం, వాళ్ల నాన్న మండిపడటం- ఇవన్నీ సూరయ్య ఆలోచనల మీద బాగా ప్రభావం చూపాయి.
దానితో ఆయన చాలా స్ట్రిక్టుగా తయారయ్యాడు. ఇంట్లో ఎవ్వరూ ఆయన ముందు నోరెత్తటానికి లేదు. ఇంట్లో ఏవి ఉన్నాయో, ఏవి లేవో చర్చించటానికి లేదు. ఏ పని పడినా ఆయనకు చెప్పే వెళ్ళాలి. సినిమాలు, టివిలు, నవలలు- ఇట్లాంటివి అస్సలు మంచివి కాదు.
అట్లా అని ఆయన మరీ కఠినంగా కూడా ఏమీ ఉండేవాడు కాదు. మీనాక్షి బాగా చదువుకోవాలి, సొంత కాళ్ల మీద నిలబడాలి, ఆమెకి మంచి ఉద్యోగం రావాలి అని బాగా ప్రోత్సహించేవాడు కూడా. మీనాక్షి కూడా, వాళ్ల నాన్న కోరికను తీర్చేందుకు పట్టుదలతో కృషి చేసేది. పాఠశాలలో ప్రతి ఒక్క పనిలోనూ తనే ముందు ఉండేది. ఉపాధ్యాయులు చెప్పే మంచి మాటలని పాటించేది. పెద్దలు చెప్పే విషయాల్ని గుర్తుపెట్టుకొని పరీక్షలలో చక్కగా వివరించి రాసేది.
అయిత్తే ఒక్క విషయంలో మాత్రం ఆ పాప తండ్రి ఇష్టానికి భిన్నంగా ఉండేది. తనకు నాట్యం అంటే చాలా ఇష్టం. వాళ్ల బడి అసెంబ్లీలో ఎప్పుడు ఎవరు నాట్య ప్రదర్శన ఏర్పాటు చేసినా తను అందులో తప్పక పాల్గొనేది. నాట్యపోటీలు అనేకాలలో ఆమె బడి తరపున పాల్గొన్నది; పాల్గొన్న ప్రతిసారీ బడికి మంచి పేరు తెచ్చి పెట్టింది. ఆ సంగతులేవీ ఇంట్లో ప్రస్తావనకు వచ్చేవి కాదు. సూరయ్యకు నాటకాలు, నాట్యాలంటే అస్సలు ఇష్టం లేదు మరి! మీనాక్షి నాట్యం చేస్తుందని ఆయనకు తెలిస్తే ఆ పాపను బడి కూడా మాన్పించేసేవాడేమో!
ఒకరోజున వాళ్ల ఆర్ట్ టీచరుగారు మీనాక్షిని పిలిచి, "అమ్మా మీనాక్షీ! చదువు లాగే, కళలన్నీ కూడా విద్యలోని విభిన్న భాగాలే. వీటిలో ఒకటి గొప్ప, ఒకటి తక్కువ అని లేవు. అయితే, ఈ రోజుల్లో బ్రతుకు సాఫీగా సాగాలంటే చదువు తప్పని సరి కనుక, తల్లి దండ్రులు చదువు మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారు. నీలో మంచి కళాకారిణి కూడా ఉన్నది. నువ్వు చదువుకోసం నీలోని కళను అణచి వేస్తావో, లేక నీ చదువుతో పాటు దానికీ న్యాయం చేస్తావో బాగా ఆలోచించుకో. రెండూ చేయాలంటే మటుకు నువ్వు బాగా శ్రమించాలి. అందరికంటే ఎక్కువ సాధన చేయాలి" అని చెప్పింది.
"ఇష్టంగా నేర్పేవాళ్ళు ఉంటే శ్రమ పడటం ఏమున్నది టీచర్. నేను చదువుకూ న్యాయం చేస్తాను; నాట్యానికీ న్యాయం చేస్తాను" అన్నది మీనాక్షి నిశ్చయంగా.
పదో తరగతిలోనే కాదు, తర్వాత ఇంటర్మీడియట్ లోను, డిగ్రీలో కూడా చదువుల్లో ఫస్టు ఎవరంటే అందరూ మీనాక్షి పేరే చెప్పేవారు. బిడ్డ బాగా చదువుతున్నదని సూరయ్య చాలా సంతోష పడేవాడు. పరీక్షల సమయంలో ఆ పాప వెంట కూర్చొని చదివించేవాడు. విద్యని బాగా నేర్చుకుంటే ఎన్నో విజయాలు సాధిస్తావు తల్లీ" అని చెప్పేవాడు.
ఆ తర్వాత పోటీ పరీక్షలు రాసిన మీనాక్షి మొదటి ప్రయత్నంలోనే బ్యాంకు ఆఫీసరుగా ఉద్యోగం తెచ్చుకున్నది. సూరయ్య చాలా సంతోష పడ్డాడు. ఆయన కలలు నెరవేరినై. "ఇన్నేళ్ళూ నీ గురించి కష్ట పడింది ఇందుకే తల్లీ! నువ్వు నా పేరు నిలబెట్టావు!" అని చాలా మెచ్చుకున్నాడు.
కొద్ది రోజులకే రేడియోలో ఒక ఇంటర్వ్యూ ప్రసారమైంది. "జాతీయ నృత్యనాటక పోటీల్లో ప్రథమ బహుమతి సంపాదించి రాష్ట్రానికే వన్నె తెచ్చిన కుమారి మీనాక్షి ఈమధ్యే ఒక బ్యాంకు ఉద్యోగానికి కూడా ఎంపికైంది. చిన్నప్పటినుండీ నాట్యరంగానికి సేవ చేస్తూ, అనేక విజయాలను, పతకాలను సాధించింది మీనాక్షి. మరి ఇప్పుడు తను ఏం చేయనున్నది? ఉద్యోగమా-కళా జీవితమా?" అంటూ.
అందులో మీనాక్షి చెప్పింది: "ఉద్యోగాన్నీ, కళల్నీ నేను వేరు వేరుగా చూడను. ఇన్నేళ్ళూ చదువులతో పాటు నా ఇష్టమైన నాట్యాన్ని కూడా కొనసాగించగలిగాను. ఇకమీద కూడా అదే చేస్తాను. ఉద్యోగానికీ, కళాజీవితానికీ రెండింటికీ న్యాయం చేసి చూపిస్తాను".
రేడియోలో మాట్లాడుతున్నది తన బిడ్డ మీనాక్షే అని గుర్తించేందుకు చాలా సేపు పట్టింది సూరయ్యకు. అయితే ఒకసారి గుర్తించాక, ఆమె గొంతులోని స్థిరత్వం, ఆ పాప పరిణతి సూరయ్యను పూర్తిగా ఆశ్చర్యంలోకి నెట్టేసాయి. తన బిడ్డలోని ఈ కోణాన్ని తను ఇన్నేళ్ళుగా ఎందుకు, చూడలేకపోయాడు? తన నమ్మకాలనీ, భయాలనీ బిడ్డమీద ఎందుకు, రుద్దాడు? తన ఇంట్లోనే ఇంతటి ప్రజ్ఞాశాలి ఉన్నదని ఎందుకు, గుర్తించలేకపోయాడు? ఆమె ఇష్టాన్ని ఎందుకు కాలరాసాడు?"
ఆ రోజు ఆఫీసునుండి ఇంటికి వచ్చిన మీనాక్షికి కళ్లనీళ్లతో ఎదురైనాడు సూరయ్య "అమ్మా! నీకు నాట్యమంటే ఇంత ఇష్టమని నాకెందుకు చెప్పలేదమ్మా?" అంటూ.
కనీసం "టీవి చూస్తా నాన్నా" అన్నా కూడా మీరు తిట్టేవారు.. 'నేను నాట్యం చేస్తాను' అని మీకు చెప్పలేకపోయాను నాన్నా! అయినా నేను నీ ఆశయాలకు భంగం కలగనివ్వలేదు నాన్నా! చదువులకు ఏ లోపమూ రానివ్వలేదు" అన్నది మీనాక్షి.
"నన్ను క్షమించు తల్లీ! కళల్ని చిన్నచూపు చూసాను. నీలాంటి కళామతల్లి నా యింట పుట్టటం నిజంగా నేను చేసుకున్న పుణ్యం" అంటూ ఆనంద బాష్పాలు రాల్ఛాడు సూరయ్య.