అనగనగా ఓ రైతు దగ్గర ఒక ఆవు, ఒక గుర్రం ఉండేవి. రోజూ అవి రెండూ ఊరవతల ఉన్న అడవికి వెళ్ళి మేసి వచ్చేవి.
ఆవు, గుర్రం అడవికి వెళ్తుంటే ఒక కుక్క కూడా వాటితో పాటు అడవికి పోయేది. అట్లా రోజూ కలిసి వెళ్తూ, వస్తూ అవి మంచి స్నేహితులయ్యాయి. ముచ్చట్లు చెప్పుకొనీ చెప్పుకొనీ వాటి స్నేహం బాగా గట్టి పడింది.
అడవిలో ఉండే ఒక కుందేలుకు ఈ ముగ్గురు స్నేహితులను చూస్తే చాలా ముచ్చటగా ఉండేది. "నాకు కూడా ఇట్లాంటి ఫ్రెండ్స్ ఉంటే ఎంత బాగుండేది!" అనుకునేదది. కానీ వాటి దగ్గరికి వెళ్ళి "నాతో స్నేహం చేస్తారా?" అని అడగాలంటే, మరి దానికి సిగ్గు, బెరుకు!!
ఒకసారి కుందేలు పొదల మాటున కూర్చొని ముగ్గురు స్నేహితుల్నీ చూస్తూ మైమరచి పోయింది. తెలివి వచ్చి చూసుకునేసరికి ఏమున్నది, నక్క ఒకటి తనను వాసన చూస్తున్నది!
భయంతో వణికిపోయిన కుందేలు ఒక్క గెంతు గెంతి, పరుగు పెట్టింది. అంతలోకే గుర్రం సకిలించింది. ఆవు బుస్సుమన్నది. కుక్క గుర్రుమన్నది. నక్క వాటిని చూడగానే ఆగిపోయి, తోకముడిచింది. కుక్క, ఆవు, గుర్రం ముందుకు దూకటం, నక్క పారిపోవటం ఒకేసారి జరిగిపోయాయి.
ముగ్గురు స్నేహితులకూ కృతజ్ఞతలు చెప్పేసింది కుందేలు: "మిమ్మల్ని ఎన్నో రోజుల నుండీ చూస్తున్నాను. మీతో స్నేహం చేయాలని చాలా ఉత్సాహ పడ్డాను, కానీ బెరుకు వల్ల మీ ముందుకు రాలేదు ఇన్నాళ్ళూ" అన్నది.
ముగ్గురు స్నేహితులూ ఒకదానికేసి ఒకటి చూసుకొని "స్నేహం చేయాలనుకున్నప్పుడు బెరుకు పనికిరాదు. ఇన్ని రోజులూ నువ్వు మాకు కనబడలేదు గానీ, లేకపోతే మేమే నీతో స్నేహం చేసేవాళ్లం. ఈ నక్క ఏదో మనకు మేలే చేసింది. ఇవాల్టినుండి మనం నలుగురం స్నేహితులం!" అన్నాయి.