అనగనగా అమెరికాలో ఎప్పుడూ‌ పచ్చగా ఉండే అడవి ఒకటి ఉండేది. ఆ అడవిలో చాలా ఓక్ చెట్లు ఉండేవి. సూర్యుడి ఎండ ఆ అడవిలో ఎక్కడా ఒక్క సూది మోపినంత కూడా పడేది కాదు: ఆ ఓక్ చెట్లు అంత దట్టంగా ఉండేవి. అడవి మొత్తం ఓక్ చెట్లతోటే నిండిపోయి ఉండేది.

అది కనుక్కున్నారు కొందరు మనుషులు. వాళ్లంతా రోజూ ఆ అడవిలోకి రావటం మొదలు పెట్టారు. చెక్క పని చేసే వడ్రంగులు వచ్చి చెట్లను నరికి కొట్టుకొని వెళ్ళేవాళ్ళు; వాటితో మంచి మంచి బొమ్మలు తయారు చేసేవాళ్ళు. రైతులు వచ్చి ఓక్ చెట్ల కొమ్మలను, ఒక్కోసారి పూర్తి మానుల్ని కూడా, నరికి తీసుకెళ్ళేవాళ్ళు; వాటితో తమకు కావలసిన వ్యవసాయ పనిముట్లు తయారు చేసుకునేవాళ్ళు.

కొద్ది రోజుల వరకూ ఓక్‌చెట్లకు ఇది బాగానే అనిపించింది. రాను రాను వాటికి భయం వేయటం మొదలైంది: "వీళ్ళు మనల్ని పూర్తిగా ఐపోగొడితే?" అని.

ఆ ఆలోచన వచ్చేసరికి ఓక్‌ చెట్లు చాలా గందరగోళ పడ్డాయి. తమ జాతి మొత్తం అంతరించిపోతుందని వాటికి భయం వేసింది.

చివరికి అన్నీ కలిసి దేవుడిని ప్రార్ధించటం మొదలు పెట్టాయి. "దేవుడా! ఈ మనుషులు ఎవ్వరూ మమ్మల్ని కొట్టకుండా చూడు!" అని.

వాటి ప్రార్థన విన్న దేవుడు ఒకరోజున నీటి మేఘం రూపంలో ప్రత్యక్షమైనాడు: "చూడండి, ప్రకృతిలో ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అని లేదు, మీరు వృధాగా భయపడుతున్నారు!" అన్నాడు.

"కాదు కాదు- "నిజంగానే మేం అంతరించి పోతాం! మమ్మల్ని మనుషులెవ్వరూ కొట్టేయకుండా చెయ్యి" అన్నాయి ఓక్ చెట్లు.

"సరే, అట్లాగే కానివ్వండి మరి, మీ ఇష్టం" అంటూ దేవుడు మాయం అయిపోయాడు.

తర్వాతి రోజుకల్లా ఓక్ చెట్లన్నిటికీ ఏదో వ్యాధి సంక్రమించింది. ఓక్ చెట్టుతో చేసిన ప్రతి వస్తువూ పాడవ్వసాగింది. ఇప్పుడు ఆ చెక్క బొమ్మలకి పనికి రావట్లేదు; పనిముట్లకీ పనికి రావట్లేదు. చివరికి పొయ్యిలో పెట్టుకునేందుకు కూడా!

మనుషులు "ఓక్ చెట్టు" అనగానే "అబ్బ వద్దు!" అనటం మొదలు పెట్టారు. మొదట్లో ఓక్ చెట్లకు ఇది చాలా సంతోషం అనిపించింది. కానీ రాను రాను అవి ఒంటరివి అయిపోయాయి.

మనుషులెవ్వరూ ఇప్పుడు అడవిలోకే రావట్లేదు. వాటిని పట్టించుకోవట్లేదు. చివరికి ఎండి, పడిపోయిన చెట్లమొద్దుల్ని కూడా ఎవ్వరూ ఎత్తుకెళ్ళట్లేదు.

ఇట్లా కొంత కాలం గడవగానే అవి మళ్ళీ దేవుడిని తలుచుకోవటం మొదలు పెట్టాయి: "దేవుడా!‌ మాకు ఈ ఒంటరి తనం వద్దు. ఇదివరకులాగే ఉండనివ్వు చాలు! తప్పయిపోయింది" అంటూ.

దేవుడు మళ్ళీ వచ్చాడు- "నేను చెప్పలేదా, ఇట్లా మీరు ఉండలేరని?!" అంటూ.

"నిజమే స్వామీ! మాకు ఇలాంటి జీవితం వద్దు. దీనికంటే అంతరించిపోవటమైనా మేలే!" అన్నాయి ఓక్ చెట్లు.

దేవుడు నవ్వి, "లేదులే! మీ వల్ల ఎంత లాభమో గుర్తించిన మనుషులు ఇంకా ఇంకా ఎక్కువ సంఖ్యలో మిమ్మల్ని పెంచుతారు. మీ వల్ల ఈ పర్యావరణం అంతా బాగౌతుంది. భూమి మొత్తం మీ గురించి గొప్పగా చెప్పుకుంటుంది. బెంగపడకండి" అంటూ ఆశీర్వదించాడు.

ఆ తర్వాత ఓక్ చెట్లు మళ్ళీ ఉపయోగంలోకి వచ్చేసాయి; మనుషులకు అవంటే మళ్ళీ ఇష్టం ఏర్పడ్డది. వాళ్ళు ఎక్కడపడితే అక్కడ ఓక్ చెట్లను పెంచటం మొదలెట్టారు.