ఆ రోజు ఆదివారం. రాజుకు బడి లేదు. "ఆడుకుందాం, వస్తావారా?" ఇంటి బయటికొచ్చి పిలిచాడు రవి. రవి, రాజు మంచి స్నేహితులు. ఇద్దరూ ఐదో తరగతి పిల్లలే.
"గ్రౌండుకి వెళ్ళి ఆడుకొని వస్తానమ్మా!" వాళ్లమ్మకు వినబడేట్లు అరిచి, అమ్మ ఏమన్నదో వినకుండానే బయటికి పరుగెత్తాడు రాజు.
గ్రౌండులో రవి, రాజు దాగుడు మూతలు ఆడటం మొదలెట్టారు. రాజు దాక్కునేందుకు వెళ్లి, దగ్గర్లో ఉన్న ఓ చెట్టు మీదికి ఎక్కి, కొమ్మల్లో దాక్కొని కూర్చున్నాడు.
రవి అతని కోసం వెతుకుతున్నాడు- ఓ కట్టె పుల్లతో తన దారికి అడ్డం వచ్చిన వస్తువునల్లా ఎత్తి పక్కకు పడేస్తూ.
అక్కడొక ప్రక్కగా అతనికో ఉండ చుట్టిన కాయితం కనిపించింది. కట్టెపుల్లతో దాన్ని కొట్టాడు. అది పైకి ఎగిరి, అవతల పడింది. రవి ఈసారి దాని దగ్గరికి వెళ్ళి మళ్ళీ కొట్టబోతూ, యథాలాపంగా వంగి, ఆ ఉండని విప్పి చూసాడు- "నన్ను కాపాడండి ప్లీజ్! ఎవరైనా!" అని గజిబిజి అక్షరాలలో రాసి ఉంది అందులో!
"ఒరే! రాజూ! ఇది చూడరా! ఒరే! దీనిలో ఏదో రాసి ఉంది!" హడావిడిగా అరిచాడు రవి.
వాడి గొంతులోని మార్పును గమనించిన రాజు చెట్టు మీది నుండి క్రిందికి దిగి వచ్చాడు "ఏమైంది? ఏమున్నది అందులో?!" అంటూ.
దాన్ని చదివి, "ఈ కాగితం ఎప్పటిదో మరి?! దీన్ని రాసిన వాళ్ళు ఇంకా బ్రతికి ఉన్నారో లేరో?!" అన్నాడు రాజు నిట్టూరుస్తూ, పెద్ద పోలీసువాడిలాగా మొహం పెట్టి.
"కాగితం ఉండ కొత్తగానే అనిపిస్తున్నది. రైటింగు చూస్తే ఎవరో పిల్లవాడిది లాగానే ఉన్నది. వాడు ఇక్కడికి దగ్గర్లోనే ఎక్కడో, ఏదో కష్టంలో ఉండి ఉంటాడు" అన్నాడు రవి, తనూ ఆలోచిస్తూ.
"ఇక్కడ ఎక్కువ ఇళ్ళు లేవు. పాడు బడిన భవనాలు నాలుగైదు ఉన్నాయి. దొంగలూ, తాగుబోతులూ తిరుగుతుంటారు అక్కడ- దీన్ని రాసిన పిల్లవాడెవరో వాటిలో ఉండచ్చని నా అనుమానం. రా! పోయి వెతుకుదాం" అన్నాడు రాజు, ముందుండి దారి తీస్తూ.
పిల్లలిద్దరూ అక్కడికి దగ్గర్లో ఉన్న ఇళ్ల తలుపులు కొట్టి, "అంతా బాగున్నారు కదండి?!" అని అడగటం మొదలు పెట్టారు.
"ఏమి, అట్లా ఎందుకు అడుగుతున్నారు?" అని అనుమానంగా చూసారు కొందరు.
"ఇట్లా చాలా సమయం వృధా అవుతున్నది. మనం చూడాల్సింది ఇళ్లలో కాదు. ఆ పాడుబడ్డ భవనాలలో!" అన్నాడు రాజు. "నాకు భయం బాబూ!" అన్నాడు రవి.
"నాకూ భయమేలేరా, కానీ తప్పదు. ఎవరో పాపం, కష్టాల్లో ఉన్నారు. మనం కాపాడాలి!" అంటూ వాడి చెయ్యి పట్టుకొని అటువైపు నడిచాడు రాజు.
వాళ్ళకు కనిపించిన మొదటి పాడుబడిన ఇంటి గోడకే ఒక కన్నం ఉంది. ఇద్దరూ చప్పుడు చేయకుండా వెళ్ళి, ఆ కన్నంలోంచి లోపలికి చూసారు..
అక్కడ నిజంగానే ఎవరో పిల్లవాడు ఉన్నాడు! ఎవరో వాడిని అక్కడున్న కుర్చీకి కట్టిపడేశారు. వాడి కాళ్లు చేతులు కట్టివేసి, మూతికి ప్లాస్టర్ వేసి ఉంచారు. వాడు తప్పిస్తే ఆ ఇంట్లో ఎవరూ ఉన్నట్లు లేరు- ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది!
రాజు, రవి వెంటనే ఆ కన్నంలోంచి ఇంటి లోపలికి ప్రవేశించారు. వాళ్ళని చూడగానే ఆ పిల్లవాడి కళ్ళు మెరిసాయి. కుర్చీలోనే గింజుకోవటం మొదలెట్టాడు. రాజు వెంటనే ఆ పిల్లవాడి నోటికి వేసిన ప్లాస్టర్ పీకేసి, "ఎవరు నువ్వు? ఏమైంది?" అని అడిగాడు.
పిల్లాడు చెప్పాడు- "నా పేరు బాబు. పిఠాపురంలో నాలుగో తరగతి. నేను ఇవాళ్ల ఉదయం రోడ్డు మీద నడుస్తుంటే ఎవరో ఇద్దరు దొంగవాళ్ళు వచ్చి, నా మెడమీద గట్టిగా ఒక్క దెబ్బ వేసారు. తర్వాత తెలివి వచ్చి చూసే సరికి నేను ఓ కారులో ఉన్నాను! అయితే అదృష్టం కొద్దీ నా దగ్గర పెన్ను, పేపరు ఉండినై. దొంగలకి కనబడకుండా నేను 'నన్ను కాపాడండి' అని రాసి, ఆ కాయితాన్ని కారులోంచి బయటికి విసిరేసాను. 'దాన్ని చూసి ఎవరైనా రాకపోతారా, నన్ను కాపాడకపోతారా' అని ఎదురు చూస్తున్నాను. దొంగ కిడ్నాపరు-గాళ్ళు ఇద్దరూ నన్ను ఇక్కడ కట్టి పడేసి, ఇప్పుడే, బయటికి వెళ్ళారు" చెప్పాడు వాడు.
రాజు రవి ఇద్దరూ ఆలోచించారు. "ఇదిగో, నువ్వు ఇక్కడే కూర్చో! భయపడకు! మేం వెంటనే వచ్చేస్తాం!" అంటూ పోలీసు స్టేషనుకు పరుగు పెట్టారు; త్వరత్వరగా పోలీసులను పిలుచుకొచ్చారు.
పోలీసులు ఆ పాడు బడ్డ ఇల్లంతా తిరిగి చూసి, "మంచి పని చేసారు. వీడిని ఇట్లాగే కుర్చీలో ఉండనిద్దాం" అని ఆ ఇంట్లో అన్ని మూలలా మాటు వేసారు.
కొద్ది సేపటికి కిడ్నాపర్లు ఇద్దరూ తిరిగి వచ్చారు. "వీడి నాన్న బలే పిసినారిరా! కోటి రూపాయలు ఇమ్మంటే, చూడు పది లక్షలు ఇస్తానంటున్నాడు" అని మాట్లాడుకుంటూ ఇంటి లోపలికి అడుగు పెట్టారు.
మరుక్షణం పోలీసులు వాళ్లను చుట్టుముట్టారు. అంతమంది పోలీసులను చూసిన దొంగలిద్దరూ అవాక్కైపోయారు. చప్పుడు చేయకుండా లొంగిపోయారు. పోలీసులు వాళ్లకు బేడీలు వేసి స్టేషనుకు తీసుకు వెళ్లారు.
ఆ తర్వాత పోలీసులు, ఊళ్ళోవాళ్ళు, పిఠాపురం వాళ్ళు, అందరూ రవిని, రాజును ఎంత మెచ్చుకున్నారో చెప్పలేం!