అనేక సంవత్సరాల క్రితం ఫాదర్ అనాన్సీ అనే ఒక ముసలాయన ఉండేవాడు. ప్రపంచంలో ఉండే తెలివి తేటలన్నీ ఆయన దగ్గరే ఉండేవి. జనాలకి ఏమి కావాలన్నా వచ్చి అయన్నే అడిగేవాళ్ళు: "ఫాదర్ అనాన్సీ! నా కొడుకు ప్రవర్తన బాగుండాలంటే ఏమి చేయాలి? ఫాదర్ అనాన్సీ!మా మేనత్త ఆరోగ్యం మెరుగుపడేందుకు ఏమి చేయాలి?

ఫాదర్ అనాన్సీ!నా పంట పెరగాలంటే ఏమి చేయాలి ? -ఇట్లా రోజూ వందలాది ప్రశ్నలకు ఫాదర్ అనాన్సీ సమాధానాలు చెప్పేవాడు.

ఆయన ఇచ్చే సమాధానాలకు గాను ప్రజలు డబ్బులు చెల్లించేవాళ్ళు. దాంతో ఆయన గొప్ప ధనవంతుడయ్యాడు కూడా. ఆయన కుటుంబం ఏనాడూ ఆకలితో పడుకోలేదు-

కానీ అనాన్సీకి ఒకే ఒక్క భయం ఉండేది: 'ఎవరైనా నా తెలివితేటలు అన్నింటినీ దొంగిలించుకుపోతే ఎలా?!' అని. "నాకు డబ్బుని, గౌరవాన్ని విలువని తెచ్చిపెట్టే ఈ తెలివితేటలే లేకపోతే, ఇంక నేను ఎట్లా బ్రతకాలి?" అని నిరంతరచింతన ఒకటి మొదలైంది అతనికి.

దాంతో బాగా ఆలోచించి, ఇక ఉండబట్టలేక, తన తెలివితేటలన్నింటిని ఒక కుండలో పెట్టి, ఆ కుండని అడవిలో దాచిపెట్టివచ్చేందుకని బయలుదేరాడు.

ఫాదర్ అనాన్సీకి ఒక కొడుకు ఉండేవాడు. వాడి పేరు క్వేకుజింగ్. వాడికి వాళ్ళ నాన్నకు ఉన్నన్ని జిత్తులు, తెలివితేటలు ఉండేవి. తండ్రి ఏదో రహస్య పథకం వేశాడని వాడికి అర్థమైంది- అందుకని ఆయనకు కనబడకుండా వెంబడిస్తూ పోయాడు వాడు.

అనాన్సీ ఆ పెద్ద కుండని జాగ్రత్తగా కడుపుకు కట్టుకొని అడవిలోకి పోతున్న కోద్ది క్వేకుజింగ్ అనుమానాలు బలపడ్డాయి. రెట్టించిన ఉత్సాహంతో తండ్రిని వెంబడిస్తూ పోయాడు వాడు.

అట్లా పోయి, పోయి, చివరికి అడవిలో అన్ని చెట్లకంటే ఎక్కువ ఎత్తున్న చెట్టు ఒకదాని దగ్గర నిలబడ్డాడు అనాన్సీ. చేరే చెట్టు క్రింద దాక్కున్న క్వేకుజింగ్ అతనినే నిశ్శబ్దంగా గమనించసాగాడు. కొద్ది సేపు చెట్టు పైకి చూసిన అనాన్సీ ఒకసారి తల ఊపి, కుండతో సహా చెట్టు మీదికి ఎక్కేందుకు ప్రయత్నించసాగాడు-

కానీ తెలివితేటల కుండని కడుపుకి కట్టుకుని చెట్టు ఎక్కటం ఎట్లా? అది చాలా కష్టమైన పని! కుండ అడ్డం పడుతుంటుంది అతనికి! అందువల్ల ఎంతప్రయత్నించినా మొదటి కొమ్మను దాటి పైకి పోలేకపోయాడు అనాన్సీ! ఇంకొంచెం ప్రయత్నించే సరికి జారి, దబ్బున నేల మీద పడ్డాడు.

ఆ దెబ్బకు "అబ్బా!" అని మొత్తుకుని కూడా, మళ్ళీ పైకి ఎక్కేందుకు ప్రయత్నం మొదలెట్టాడతను!.

అయితే ఈసారి క్రింద పడేటప్పటికి అతను రెండవ కొమ్మ వరకూ ఎక్కగలిగాడు!

అయినా పట్టు వదలని అనాన్సీ మళ్ళీ ఇంకోసారి చెట్టు ఎక్కేందుకు ప్రయత్నించాడు. అయితే దురదృష్టం, మూడోసారి కూడా క్రింద పడాల్సి వచ్చింది!

దాంతో క్వేకు సింగ్ చెట్టు చాటునుంచి బయటకు వచ్చి "నాన్నా! నేను చూస్తుండగానే మూడుసార్లు పైకి ఎక్కావు; క్రింద పడ్డావు! అయినా కుండని పొట్టకి కట్టుకుని, ఎవరైనా చెట్టు ఎక్కుతారా?! వీపుకు కట్టుకుంటే పోలేదా, ఎంత సులభంగా చెట్టును ఎక్కచ్చో గదా?! అంతమాత్రం ఆలోచన లేదా?!" అన్నాడు.

అనాన్సీకి విపరీతమైన కోపం వచ్చింది. "నా ఈ తెలివితేటలు అన్నిటి నుండి ఏం లాభం వచ్చింది?! వేలెడంత లేని నా కొడుకు కూడా నాకు సలహాలు ఇస్తున్నాడే! ఇంత చిన్న పనిని కూడా నాకంటే బాగా చేయడం వాడికి తెలుసంటే, ఇక నా యీ తెలివి తేటలు అన్నీ‌ వృధాయే కదా?!" అని అతనికి చాలా విచారమూ, ఉక్రోషమూ వచ్చాయి.

ఆ కోపంలో తన కడుపుకు కట్టుకున్న కుండను తీసి గట్టిగా నేలమీదికి విసిరి కొట్టాడు.

"మరుక్షణం ఆ కుండ ముక్కలు చెక్కలైంది! అతను అందులో దాచిన తెలివి తేటలన్నీ తప్పించుకున్నాయి! ప్రపంచంలో అవన్నీ ఏవి-ఎక్కడికి-ఎన్ని చేరుకున్నాయో ఎవ్వరికీ తెలియదు!

అందుకనే, పైకి అట్లా కనిపించకపోయినా సరే, ప్రపంచంలో ఇప్పుడు నిజంగానే ఇన్ని తెలివితేటలున్నాయి! వస్తువులను సంరక్షించుకోవడం, పనులను సాధించుకోవడం ఇవన్నీ జనాలకి తెలుసు! ఎప్పుడు- ఏది- ఎట్లా- చేస్తే మంచిది; అనే తెలివితేటలన్నీ జనాలకి దొరికిపోయినై!

'తన కోపం-తన శత్రువు' అని ఎవరో అన్నారుగానీ, సరిగ్గా అన్నట్లు లేదు- ఫాదర్ అనాన్సీకి అంత కోపం రాకపోతే, తన కుండని అట్లా విసిరి కొట్టకపోతే, ప్రపంచానికి ఇంత మేలు జరిగేనా, అసలు?!