అనగా అనగా ఒక ఊళ్ళో బట్టలు నేసే రామయ్య ఒకడు ఉండేవాడు. అతని భార్య సీతమ్మ దూదేకులు తీసుకొచ్చి, రాట్నం మీద వడికి, దారంతీసి, కండెలు చుట్టేది. అతను ఆ కండెలకు రంగులద్ది, వాటిని సరిచేసుకొని, గుంట మగ్గం మీద బట్టలు నేసేవాడు. మగ్గం నడిచినప్పుడు ఏ దారాలు పైకి రావాలో, ఏవి క్రిందికి పోవాలో తెలిపే డిజైన్ అట్టల్ని కూడా భార్య సహాయంతో రామయ్యే తయారు చేసుకునేవాడు. అట్లా ఇద్దరూ శ్రమపడి తయారు చేసిన బట్టని పట్నంలో దుకాణాల వాళ్ళకు అమ్మి, ఆ వారానికి కావలసిన సరుకులు కొనుక్కొచ్చుకునేవాళ్ళు.

ఒకసారి అట్లా పట్నం వెళ్ళిన రామయ్య, రోజంతా ఎండలో తిరిగీ తిరిగీ చాలా అలసిపోయాడు.

'పట్నపు నీళ్ళు తన ఒంటికి పడవు' అని అతను పల్లెనుండి తెచ్చుకున్న నీళ్లన్నీ ఐపోయాయి- దాహంతో నోరు పిడచ గట్టుకు పోయింది. చివరికి ఊరికి బయలుదేరే సరికి అతని ప్రాణాలు కడబట్టినట్లయినై. రోడ్డుకు ఓ ప్రక్కగా కళ్ళు తిరిగి పడిపోయాడు.

కళ్ళు తెరిచి చూసేసరికి అతను ఒక గుహలో ఉన్నాడు- చిన్న భూతం‌ ఒకటి, అతని ముఖంలో‌ ముఖం పెట్టి చూస్తున్నది!

రామయ్య గట్టిగా కేకలు పెడదామనుకున్నాడు గానీ, అతని నోరు తెరుచుకోలేదు; గొంతు పెగల్లేదు; కనీసం మూలుగు కూడా బయటికి రాలేదు. అయితే భూతం పిల్ల మటుకు "తెరిచాడు! కళ్ళు తెరిచాడు!!" అని కేకలు పెట్టి అవతలికి ఒక్క గెంతు గెంతింది.

"ఓరోరి! వీడెవడో గట్టి పిండంలాగున్నాడు! చచ్చాడనుకొంటి! నువ్వేం చెప్పకు- నువ్వేం చెప్పకు!" అని మరో గొంతు వినిపించింది గుహ బయటినుండి.

రామయ్య లేచి కూర్చొనే సరికి పెద్ద భూతం ఒకటి లోపలికి వస్తున్నది. అంతకు ముందు తను చూసిన పిల్ల భూతం దాని తోకను పట్టుకొని అడుగులో అడుగు వేస్తున్నది.

"నేను ఇక్కడికెలా వచ్చాను? ఇంతకీ మీరెవరు?" అరిచాడు రామయ్య.

"కనిపించట్లేదూ?! భూతాలం!" అన్నది తల్లి భూతం, కళ్ళు పెద్దవి చేసి, తన గార పళ్ళు కనబడేట్లు ఇకిలించి.

"ఓహో! మీరు భూతాలా?! ఎవరో పగటి వేషగాళ్ళు అనుకున్నాను" అన్నాడు రామయ్య, "ఎలా తప్పించుకోవాలా?" అని ఆలోచిస్తూ.

"కాదు- నిజం భూతాలమే! కావాలంటే ముట్టి చూడు!" అని చేతులు ముందుకు చాచింది భూతం.

రామయ్య దాని చేతులు ముట్టి చూశాడుగానీ, అంతకు ముందెన్నడూ భూతం చేతులు ఎలా ఉంటాయో చూడలేదు కద, అందుకని అతనికి ప్రత్యేకంగా ఏమీ తెలియనైతే తెలీలేదు.

అయినా అతను మర్యాదగా తల ఊపుతూ "అవును- అవును- తెలుస్తూనే ఉంది" అని సణిగాడు.

"అయినా నువ్వు చచ్చావనుకొంటిమే! అందుకనే వీళ్ల నాయన్ని పంపించాను నేను!" అని నాలుక కరచుకున్నది భూతం.

"చెప్పేసావ్! చెప్పేసావ్! ఇప్పుడెలాగ?" అని ఎగిరింది భూతం పిల్ల.

"ఎక్కడికి పంపారు? ఎందుకు పంపారు?" అని ఒక్క ఉదుటున లేచి కూర్చున్నాడు రామయ్య. భూతం పిల్ల "కెవ్వు"మని అరిచి, ఒక్క గంతులో వాళ్ళ అమ్మ వెనక్కి చేరుకున్నది.

"నీ వేషం వేసుకొని, మీ ఊరెళ్ళాడు, వీళ్ళ నాయన. మీ ఊళ్ళో బాగా బలిసిన పశువులూ, గొర్రెలూ, మనుషులూ ఉంటారు కదా, వెళ్ళి వీలైనంతమందిని ఒకేసారి ఎత్తుకొచ్చేస్తే, తర్వాత ఓ ఏడాది పాటు మేం‌ హాయిగా వాటినే తింటూండచ్చు కదా- అందుకని!" మురిసిపోతూ గొప్పగా చెప్పింది భూతం.

"ఎవరు చెప్పారు? మా ఊళ్ళో మూడేళ్ళుగా వానల్లేవు. పశువుల కొట్టాలన్నీ‌ ఖాళీ. గొర్రెల మంద ఒక్కటి కనిపిస్తే ఒట్టు. అయినా నన్నడిగితే నేనే చెప్పేవాణ్ణిగా, అంత దూరం ఎందుకు వెళ్ళాడు ఊరికే?!" చికాకు పడ్డాడు రామయ్య.

"ఎందుకెళ్ళాడో, ఏంటో-" అని కలవర పడింది భూతం- "వెళ్ళాక నాలుగురోజులైనా ఒక్క ఫోనూ లేదు! ఎట్లా ఉన్నాడో, ఏంటో తెలీనే లేదు!"

"ఓహో! మీకు ఫోను కూడా ఉందా? ఏ నెట్వర్కు?" అనుకున్నాడు రామయ్య. అయినా అది భూతానికి ఎలా తెల్సిందో తెల్సింది-

"మా ఫోన్లు మీ ఫోన్ల లాగా కాదు- ప్రాణం ఉన్న మనిషి మెదడులోంచి మా మెదడుకు పోతై- అంటూనే భూతం గబుక్కున వచ్చి రామయ్య నెత్తి మీద ఓ కట్టెతో గట్టిగా మొత్తింది.

చటుక్కున రామయ్య మెదడులో ఓ ఫోను మోగుతున్నట్లు అనిపించసాగింది. స్పీకరుకు తగిలించినట్లు ఆ శబ్దం గుహ అంతటా ప్రతిధ్వనించ సాగింది- "క్రం..క్రం.. క్రంక్రం... క్రంక్రం.."

అంతలో అకస్మాత్తుగా "అబ్బా!.. నా ప్రాణాలు పోతున్నాయే! వీడు మామూలోడు కాదు! నా బ్రతుకింత ఘోరం అయిపోతుందని ఏనాడూ అనుకోలేదు.. అయ్యో!... అబ్బా!...కుయ్యో!" అని మూలుగులు వినిపించసాగాయి.

"ఓరోరీరీరీరీరి.. నీకేమైందిరో.." అని రామయ్య దగ్గరికొచ్చి మొత్తుకున్నది భూతం.

"మళ్ళీ‌ చెబుతా! ఇప్పుడు శక్తి లేదు! తొందరగా మన గుహలోంచి మంత్రపు నీళ్ళు కొన్ని పంపియ్యి నాకు! వాడి చేతికి ఇచ్చి పంపియ్యి పర్లేదు. వాడికి ఓ కిలో‌ బంగారమూ, పదో‌ పన్నెండో‌ వజ్రాలూ‌ కూడా మూటగట్టి ఇచ్చి పంపించు! పాపం! అయ్యో..!" అని వినిపించింది అవతలినుండి.

భూతం, పిల్ల భూతం రెండూ గొల్లున ఏడుపులంకించుకున్నాయి.

"అబ్బ! ముందు ఏమైందో‌ చెప్పి, ఆ తర్వాత ఏడవండి!" మొత్తుకున్నాడు రామయ్య. జవాబుగా ఇంకా గట్టిగా ఏడ్చింది పిల్ల భూతం.

తల్లి భూతం వణుక్కుంటూ రామయ్యతో "ఇదిగో అబ్బీ! ముందు బయల్దేరు! తొందరగా పో, మీ ఇంటికి! అక్కడ మా ఆయనుంటాడు- అయితే పాపం, నీకంటే చాలా నీరసంగా ఉంటాడేమో- ఆయనకి ఈ మంత్రపు నీళ్ళ చెంబు అందించు. ఈ బంగారమూ, వజ్రాలూ నీకు- తీసుకొని ఇక్కడున్నట్టే ఇల్లు చేరుకో- పో!" అని చేతికి ఓ చిన్న మూటనిచ్చి, రామయ్యను బయటికినెట్టేసింది.

రామయ్యకు ఏమీ అర్థం కాలేదు- అయినా "ప్రాణాలు దక్కిందే చాలు" అనుకొని పరుగు పరుగున ఇల్లు చేరుకున్నాడు. అల్లంత దూరాన ఉండగానే అతని భార్య అతన్ని ఎదుర్కొని, "మంచంలోంచి లేవొద్దన్నానా?! పోయి పడుకో, పో!" అంటూ ఇంట్లోకి లాక్కెళ్ళి, బయటినుండి గొళ్లెం పెట్టేసింది.

లోపల మంచం మీద పడుకొని ఉన్నాడు రామయ్య!! -వాడిని చూసి రామయ్య ఒక్క క్షణం బెదిరిపోయాడు గానీ, వెంటనే తేరుకున్నాడు. అప్పుడు అర్థం అయ్యింది అతనికి: "ఇక్కడున్నది భూతం! తన వేషంలో వచ్చింది! తమ ఊళ్ళోంచి పశువుల్నీ, గొర్రెల్నీ, మనుషుల్నీ ఎత్తుకెళ్ళేందుకు వచ్చింది! తను లేకున్నా, ఇంట్లో వాళ్ళెవరికీ తను లేనట్టే తెలీలేదు!" ఆ ఊహ రాగానే అతనికి రక్తం మరిగినట్లయింది. ఆ భూతాన్ని పచ్చడి పచ్చడి చేయాలనిపించింది. అయితే భూతం వాడు ఎలాంటి దశలో‌ ఉన్నాడంటే, వాడికి అసలు ప్రాణాలు ఉన్నాయో, లేవో కూడా తెలీలేదు రామయ్యకు. అతను వెళ్ళి వాడి ముక్కు దగ్గర చెయ్యి పెట్టి, గాలి ఆడుతున్నదో లేదో‌ చూశాడు. అంతలోనే వాడు నోరు తెరిచి, నీరసంగా "నీ..ళ్ళు" అని గొణిగాడు.

రామయ్యకు ఆ భూతం వాడి పరిస్థితి చూసి జాలివేసింది. అంతలోనే వాడి భార్య ఇచ్చిన మంత్రపు నీళ్ళ చెంబు గుర్తొచ్చి, దాన్ని తీసి నీళ్ళన్నీ భూతంవాడి నోట్లో వొంపేసాడు.

నీళ్ళు నోట్లో‌ పడగానే భూతంవాడు కళ్ళు తెరిచి, నీరసంగానే లేచి కూర్చున్నాడు. వణికే గొంతుతోటే మాట్లాడటం మొదలెట్టాడు వాడు:

"ఒరే! మీరంతా బలే మంచోళ్ళురా! కష్టాలంటే మాకే అనుకున్నాను- మీకున్న కష్టాలు ఎవ్వరికీ ఉండవని ఇప్పుడర్థం అయ్యిందిరా! మీ ఊళ్ళో బక్కగాలేని పశువులు లేవు, ముదిరిపోని గొర్రెలు లేవు- చివరికి మీ ఊరి మనుషులెవ్వరికీ మేం తినేందుకు సరిపడ మాంసం కూడా లేదు- అయినా అందరూ బ్రతికి ఎలా ఉంటున్నారా, ఇక్కడ?

ఏదో, నాలుగు రోజులు హాయిగా ఉండచ్చు అనుకొని ఇక్కడికి వచ్చానుగానీ, మీరు తినే ఎండు కారమూ, జొన్న అంబలీ రెండ్రోజులు తినేసరికి నా బ్రతుకు ఇట్లా అయిపోయింది.

అది తిని, అన్ని గంటలు నేయాలట్రా? చీకటి గుంతల్లో కూర్చొని అన్నేసి గంటలు ఎట్లా పని చేస్తుంటార్రా, మీరు?! ఇదిగో, జాగ్రత్తగా విను- నువ్వు మంచోడివి గనక, నీకో ఆఫర్ ఇస్తా- నువ్వు కూడా భూతం అయిపోయి, నాతో వచ్చేయ్- నిజం, భూతాల జీవితం మీ జీవితం కంటే వందరెట్లు బాగుంటుంది- నా బిడ్డ మీద ఒట్టు!" అని ఏదేదో వదిరాడు వాడు.

రామయ్య వాడికేసి జాలిగా చూస్తూ నిలబడ్డాడు. "వీడికి ఏదో‌ తిక్క పట్టింది" అనిపించింది అతనికి. అయితే అంతలోనే భూతంవాడు లేచి, చెంబుని పట్టుకొని, గట్టిగా కళ్ళు మూసుకొని, వణికాడు "ఉహుహుహుహు" అంటూ. మరుక్షణంలో వాడక్కడ లేడు!

అకస్మాత్తుగా ఆరోగ్యంగాను, బలంగాను తయారైన రామయ్యని చూసి, అతని భార్య కొంచెం‌ ఆశ్చర్యపడింది గానీ, "కొత్త ఆరెంపీ డాక్టరు ఇచ్చిన మాత్తర్లు అంత బాగా పని చేసినాయి" అనుకుని ఆమె ఎప్పటిమాదిరే రామయ్యకు పనులు పురమాయించటం మొదలెట్టేసింది!

ఆమెకు భూతం ఇచ్చిన బంగారం గురించీ, వజ్రాల గురించీ చెబుదామా అనుకున్నాడు గానీ, రామయ్యకి ధైర్యం చాలలేదు. 'కష్టకాలంలో పనికొస్తాయిలే' అని ఆ మూటని భద్రంగా దాచిపెట్టి, ఎప్పటిలాగే పనిలోకి దిగాడతను!