అనగనగా రామాపురంలో రామయ్య, సోమయ్య అనే రైతులు ఇద్దరు ఉండేవాళ్ళు. వాళ్లలో రామయ్య అమాయకుడు; సోమయ్య స్వార్థపరుడు.

ఒక ఏడాది రామయ్య సోమయ్యలు ఇద్దరూ వడ్లు పండించారు. రామయ్య పంట బాగా పండింది. సోమయ్య పంట పండలేదు. దాంతో సోమయ్య ఓర్వలేకపోయాడు. 'ఎట్లాగైనా సరే, రామయ్య పంటను నాశనం చెయ్యాలి" అని ఆలోచించాడు.


"ఏముంది, బాగా ఎండి కోతలకు సిద్ధంగా ఉన్న పంటకు నిప్పు పెడితే సరి!" అనుకున్నాడు. అందుకు కావలసిన సామాన్లన్నీ తీసుకొని ఆ రోజు రాత్రి చీకట్లో బయలుదేరాడు. కానీ తానొకటి తలిస్తే దైవం మరొకటి తలుస్తుందట! దారి మధ్యలోనే అతన్ని ఒక తేలు కుట్టింది! బాధతో విలవిలలాడి పోతున్న సోమయ్యకు రామయ్యే ప్రథమ చికిత్స చేసాడు!

"నువ్వు ఇంటికి పోయి పడుకోరా, నీ పొలానికి కూడా నేనే కాపలా కాస్తాను" అని అతన్ని ఇంటికి పంపించాడు కూడా! ఐనా సోమయ్యకు రామయ్య పట్ల ఇష్టం ఏర్పడలేదు. "పంటను వేరే విధంగా సొంతం చేసుకుంటాను- అసలు ఈ రామయ్యను చంపేస్తే పొలం, పంట అంతా కూడా నాదే అవుతుంది కదా" అని లెక్కలు వేసుకున్నాడు.


ఆ రోజు మధ్యాహ్నం రామయ్య పొలానికి వెళ్ళాడు. ఆ సమయానికి రామయ్య అక్కడ లేడు. తన అన్నపు మూటని అక్కడే ఒక ప్రక్కగా పెట్టుకున్న సోమయ్య, తను తెచ్చిన విషాన్ని రహస్యంగా రామయ్య అన్నపు మూటలో కలిపేసాడు. ఆపైన 'నేను ఇక్కడే ఉంటే అనుమానం వస్తుంది' అని తను దూరంగా వెళ్ళాడు.

అయితే ఆ రోజున రామయ్యకు అస్సలు ఆకలిగా లేదు. 'తరువాత తింటాను. అన్నం మూటని తీసుకొని వెళ్తే దారిలో ఎక్కడైనా తినచ్చు' అనుకుంటూ పరధ్యానంగా సోమయ్య తన కోసం పెట్టుకున్న మూటని పట్టుకొని ఊళ్ళోకి వెళ్లాడు రామయ్య.


అయితే ఆ సంగతి సోమయ్యకు తెలీదు కదా; కొద్ది సేపటి తర్వాత వచ్చి చూసిన సోమయ్యకు తన మూట బదులు రామయ్య మూట దొరికింది. దాన్ని చూసి 'అది తను తెచ్చుకున్న అన్నమే' అనుకున్నాడతను! దాన్ని తానే తిన్నాడు!

కొద్ది సేపటికి వెనక్కి తిరిగి వచ్చిన రామయ్య విషపుటాహారాన్ని తిని పడిపోయిన సోమయ్యను చూసి, కంగారు పడ్డాడు.

గబగబా అతన్ని తీసుకెళ్ళి ఆసుపత్రిలో చేర్పించాడు. అతను ఆస్పత్రిలో ఉన్నన్ని రోజులూ తనూ అక్కడే ఉండి సోమయ్యని కంటికి రెప్పలా చూసుకున్నాడు.

అతని మంచితనం సోమయ్య కళ్ళు తెరిపించింది. తన తప్పును గ్రహించి, మనస్ఫూర్తిగా పశ్చాత్తాప పడ్డాడతను.

ఆ తర్వాత అతనిలో ఇక ఎన్నడూ రామయ్య పట్ల అసూయ కలగలేదు. ఇద్దరూ కలిసిమెలిసి సంతోషంగా జీవనం సాగించారు.