కొత్తపల్లిలో వచ్చిన మూడు కోతుల బొమ్మ గుర్తుందా? ఇవిగో, పోరంకి వికాస విద్యావనంనుండి వచ్చిన మూడు కోతుల కథలు, ఒక నాలుగు.. వీటిలో మీకు ఏ కథ నచ్చిందో చెప్పండి?
బంక కథ
అనగనగా ఒక అడవిలో రాము, చింటూ, కిట్టూ అనే మూడు కోతులు ఉండేవి. అవి చాలా అల్లరివి. అడవిలో అంతటా తిరుగుతూ, ఇష్టం వచ్చినట్లు అడుకుంటూ, కనబడ్డ పండునల్లా తింటూ ఉండేవి ఎప్పుడూ.
చెట్లకు చాలా వాటికి బంక ఉంటుంది, కదా? ఒకరోజున ఈ మూడు కోతులూ అట్లా అడవిలో చెట్ల మీద ఆడుకుంటూ ఉంటే, వాటి చేతులకు ఆ బంక అంటుకుంది. దాంతో వాటికి చేతులు కట్టేసినట్లు అయ్యింది; ఒళ్ళంతా కంపరం మొదలైంది; మనసంతా 'కిచకిచ' మొదలైంది.
రాముకు కళ్ళు దురద పుట్టాయి. అది కళ్ళు నలుచుకునే సరికి, ఏముంది, చేతులు కాస్తా కళ్ళకు అతుక్కుపోయాయి! ఎంత పీక్కున్నా చేతులు విడిపోలేదు! దాంతో అది 'కుయ్ కుయ్' మని గట్టిగా అరవటం మొదలు పెట్టింది.
ఆ అరుపులు విని చింటూకి భయం వేసింది. 'అరవకు! అరవకు! నాకు భయం వేస్తున్నది!' అని తను కూడా గట్టిగా అరుస్తూ, చేతులకున్న బంక సంగతి మర్చిపోయి గట్టిగా చెవులు మూసుకున్నది. అంతే- దాని చేతులు కాస్తా చెవులకి అతుక్కుపోయాయి!
సరిగ్గా ఆ సమయానికి 'ఏయ్! చేతులు.. జాగ్రత్త..' అని అరవబోయింది కిట్టూ. దాని మాటలు గొంతులో ఉండగానే చింటూ చేతులు చెపులకు అతుక్కుపోయాయి! దాంతో 'అయ్యో, పాపం!' అనుకుంటూ తన చేతులతో నోరు మూసుకున్నది చింటూ. ఇంకేమున్నది, చేతులు కాస్తా దాని నోటికి అతుక్కుపోయాయి!
అట్లా చేతులు కట్టేసుకున్న మూడు కోతులూ వాటిని విడిపించుకుందామని ఎంత ప్రయత్నించినా పలితం లేకపోయింది. ఆ రోజు సాయంత్రం గాంధీ గారు అటుగా పోతూ వాటిని చూసారు. సరిగ్గా ఆ సమయానికి అక్కడికి దగ్గర్లోనే ఒక నక్క, ఎలుగు బంటి చనిపోయిన జింకను తినడానికి గొడవ పడుతూ కనిపించాయి. ఆ సమయంలో గాంధీ గారికి మన మూడు కోతులనూ చూసి చాలా ముచ్చట వేసింది. "అరే! మన మానవుల కంటే ఇవి ఎంతో మంచివే! చెడు చూడటం లేదు; అవి తిట్టుకునే తిట్లు వినటంలేదు; వాటిని తిట్టి తమ మనసును పాడు చేసుకోకుండా ఎంచక్కా నోరు మూసుకున్నాయి! మనకు ఎంత చక్కని పాఠాన్ని నేర్పుతున్నాయో కదా!" అనుకున్నారు. అట్లా మనందరికీ 'చెడు వినకు, చెడు చూడకు , చెడు మాట్లాడకు' అని ఒక సూక్తి పెట్టారు.
ఇంతకీ మూడు కోతులకూ ఏమైంది, ఆ తర్వాత? అవి వాళ్ల అమ్మా వాళ్ల దగ్గరికి పోయినై. వాళ్ల అమ్మలు కొంచెం ఆలోచించి, వాటి చేత స్నానం చేయించాయి. స్నానంలో తేమకు వాటి చేతులు మళ్ళీ వాటి స్వాధీనంలోకి వచ్చేసినై!
రచన- ఎ.సూర్యతేజ్, ఆరవ తరగతి
తగిన శిక్ష
అనగనగా మూడు కోతులు. చెడు వినటం, చెడు మాట్లాడటం, చెడు చూడటం- ఇవే వాటి పనులు. ఇంకేమీ లేవు. అందుకని ఏ జంతువూ వాటిని పట్టించుకునేది కాదు.
ఒక రోజున వాటికో కుందేలు కనిపించింది.
చెడు మాట్లాడే కోతి దానిని ఆపి, 'నువ్వెందుకే, ఉండేది అడవిలో?! ఎందుకూ పనికిరావు నువ్వు!' అని హేళన చేసింది. చెడు వినే కోతి అది విని, ఇంకా ఎగతాళిగా ఇకిలించింది. కుందేలు ముఖం చిన్నబోయింది.
చెడుని చూసే కోతి దాన్ని చూసి చప్పట్లు కొట్టింది. కుందేలు ఆ మూడింటికేసీ కోపంగా చూసి, ఏమనాలో చేతగాక, పొదలోకి దూరింది.
మూడు కోతులూ నవ్వుకుంటూ ముందుకు పోయినై. ఈసారి వాటికి ఒక ఏనుగు ఎదురైంది.
మూడు కోతులూ దాన్ని ఆపినై.
"ఏంటి సంగతి?" అన్నది ఏనుగు.
"నువ్వు ఎందుకురా, ఈ అడవిలో?! ఒట్టి గడ్డి దండగ. ఎందుకూ పనికి రావు. పైగా అంత బండగా ఉంటావు" అన్నది చెడు మాట్లాడే కోతి.
"అహ్హహ్హహ్హ! భలే అన్నావు!" అంటూ ఇకిలించింది చెడు వినే కోతి. వాటిని చూసి ఏనుగు ముఖం ఎర్రబడింది.
"ఎంత మంచి దృశ్యం! చూస్తే దీన్నే చూడాలి! దీని ముఖం కందిరీగలకంటే ఎర్రగా ఉంది!" అన్నది చెడుని చూసే కోతి. ఏనుగు ఒక్క దూకు దూకి, మూడుకోతులనీ తొండంతో చుట్టి పైకెత్తింది. గిరగిరా తిప్పింది. అప్పటివరకూ ఎగతాళిగా నవ్వుతూన్న కోతులు మూడూ ఇప్పుడు భయంతో హాహాకారాలు చేసాయి.
అంతలోనే అక్కడికొచ్చిన కుందేలు ఏనుగును ఆపి- "ఏనుగు మామా! వీటికి శిక్ష వేయాల్సింది నువ్వు కాదు- సింహరాజు దగ్గరికి తీసుకుపోదాం. తప్పు చేసినవాళ్ళను శిక్షించే అధికారం రాజుగారికి ఒక్కరికే ఉంది" అంది.
ఏనుగు ఒక్క క్షణం ఆలోచించింది. మూడు కోతులనూ కట్టగట్టి రాజుగారి దగ్గరకు ఈడ్చుకెళ్ళింది. జరిగిందంతా చెప్పింది. రాజుగారు మూడు కోతులకూ తగిన శిక్ష వేసాడు: చెడు మాట్లాడే కోతి వారం రోజులపాటు నోటిమీద చేతులు వేసుకొని కూర్చోవాలి. చెడు వినే కోతి అన్ని రోజులపాటూ చెవులు మూసుకొనే ఉండాలి. చెడు చూసే కోతి వారం రోజులపాటు చేతుల్తోటి కళ్ళు మూసుకొనే ఉండాలి.
వారం రోజుల్లో కోతులు మూడూ మంచివైపోయాయి! ఇంక అప్పటి నుంచి చాలా బుద్ధిగా ఉండటం మొదలు పెట్టాయి. రచన-రోహన్, ఆరవ తరగతి
చెడుని వినాలి, చూడాలి, పోరాడాలి!
ఒక అడవిలో మూడు కోతులు ఉండేవి. మూడు కోతులూ ఒకసారి 'చెడు వినకూడదు; చెడు మాట్లాడకూడదు; చెడు చూడకూడదు' అని నిర్ణయించుకున్నాయి.
సరిగ్గా ఆ సమయానికి ప్రక్క కొమ్మ మీద గూడు కట్టుకొని ఉన్న కోకిలమ్మ తన పిల్లలను గూటిలోనే వదిలి, మేతకోసం బయటికి వెళ్ళింది. అది అటు వెళ్ళగానే పరదేశం నుండి వచ్చిన గద్ద ఒకటి ఆ పిల్లల్ని ఎత్తుకు పోయేందుకు వచ్చి వాలింది. "ఓ! చెడు! చెడు! నేను దీన్ని చూడలేను!" అని ఒక కోతి కళ్ళు మూసుకున్నది.
"ఉం.. ఉం... బెబు!! బెబు!" అంటూ నోరు మూసుకున్నది మరొక కోతి.
"నేను ఈ అరుపులు వినలేను! వినలేను!" అంటూ చెవులు మూసుకున్నది మూడో కోతి.
సంతోష పడిన గద్ద కోకిల పిల్లలకు ఇంకా దగ్గరికి వచ్చింది. కోకిల పిల్లలు ప్రాణ భయంతో అరవటం మొదలెట్టాయి. అంతలో మూడు కోతులకూ చాలా సిగ్గు వేసింది. "అసలు మంచి అంటే ఏమిటి?! చెడు అంటే ఏమిటి?! ఇతర జంతువులకూ, పక్షులకూ, కీటకాలకూ అబద్ధాలు చెప్పడం చెడు. అట్లాగే తోటి పక్షులను, జంతువులను ఆపదల్లోకి నెట్టటం చెడు. అసలు అక్రమాలను చూడకుండా, వాటిని గురించి వినకుండా, వాటిని గురించి మాట్లాడకుండా ఉండకూడదు! చెడును అర్థం చేసుకొని, ఎన్ని కష్టాలెదురైనా సరే, పోరాడి చెడును అరికట్టాలి! మనం 'చెడును వినకూడదు,చెడు మాట్లాడ కూడదు, చెడును చూడకూడదు' అనుకోవడం అసలు సరైనది కాదు! పోరాటమే మేలు!" అనుకున్నాయి.
చటుక్కున కోకిల పిల్లలను అవి ఉండే గూటితో సహా- తీసుకెళ్ళి చెట్టు తొర్రలో పెట్టి, తొర్రకు అడ్డంగా నిలబడ్డాయి.
బెదిరించబోయిన గద్దను మూడూ కలిసి తరిమేసాయి. కోకిల పిల్లల్ని కాపాడాయి.
రచన-అక్షర, ఐదవ తరగతి
మారిన కోతులు
అనగనగా మూడు కోతులు ఉండేవి. అవి ఎప్పుడూ చెడ్డ పనులే చేసేవి. రోడ్డు మీద వెళ్ళే వాళ్ళ మీద రాళ్ళు వేసేవి; అరటి తొక్కలు విసిరేవి; పిల్లల చేతుల్లోంచి పదార్థాలన్నీ ఎత్తుకుపోయేవి; వాళ్లని కొరికేవి; ఇళ్ళలోంచి గిన్నెలు, చెంచాలు ఎత్తుకెళ్ళేవి- ఎప్పుడూ ఏదో ఒక తుంటరి పని చేస్తూనే ఉండేవి.
మిగిలిన కోతులు వాటికి నచ్చ జెప్పేందుకు ప్రయత్నించినై. "మీ మూలంగా కోతులన్నిటికీ చెడ్డ పేరు వస్తున్నది" అని చెప్పినై. అయినా అవి పట్టించుకోలేదు. తమ దారిన తాము అల్లరి చేస్తూ 'రౌడీ కోతులు' అని పేరు తెచ్చుకున్నై.
అకస్మాత్తుగా ఒక రోజున "జూ" నుండి కోతుల్ని పట్టుకునేవాళ్ళు వచ్చారు. వలలు వేసారు. తాళ్ళు వేసారు. కనిపించిన కోతినల్లా వ్యాన్ ఎక్కించి తీసుకెళ్ళారు. 'వాళ్ళ నుండి తప్పించుకుందాం' అని రకరకాల ప్రయత్నాలు చేసాయి మన మూడు కోతులూనూ. ఒక్క ప్రయత్నం కూడా ఫలించలేదు సరికదా, 'ఇవే, దొంగ కోతులు!' అని జూలో పని చేసేవాళ్ళు వాటిని గుర్తించారు. వాటిని మూడింటినీ వేరుగా ఉంచి, తిండి పెట్టకుండా మాడ్చి, రకరకాలుగా సతాయించారు. అయినా అవి వాళ్లకు ఏమాత్రం లొంగలేదు.
చివరికి ఒకరోజున ఓ సర్కస్ వాళ్ళు వచ్చారు. 'మా సర్కస్‌లో పని చేసేందుకు కొన్ని కోతులు ఇవ్వండి' అని జూ వాళ్లను అడిగారు. జూ వాళ్ళకి వాళ్లంటే ఇష్టం లేదు; కానీ వాళ్ళు మన మూడు కోతులతోటీ బాగా విసిగిపోయి ఉన్నారు. ఎట్లాగైనా వాటికి బుద్ధి రావాలని, ఆ మూడు కోతుల్నీ సర్కస్ వాళ్లకి అమ్మేసారు.
మూడు కోతులూ చాలా సంతోషపడ్డాయి. స్వేచ్ఛ దొరికినట్లే ననుకున్నాయి. కానీ వాటికి తెలీదు- సర్కస్‌లో పని చేయటం అంటే నరకమేనని. సర్కస్ వాళ్ళు వాటికి అన్నం పెట్టకుండా మాడ్చారు. కొరడాతో కొట్టి తాము చెప్పిన పనల్లా చేసేట్లు వాటి చేత సాధన చేయించారు. అవి తప్పించుకునేందుకు ప్రయత్నించిన ప్రతిసారీ మరిన్ని శిక్షలు వేసారు.
కొన్ని వారాలు గడిచే సరికి కోతులు మూడింటికీ బుద్ధి వచ్చింది. "ఊళ్ళో అల్లరి చేయకుండా ఉండి ఉంటే హాయిగా ఉందుము కదా! మన అల్లరి వల్ల మనకి మనం కష్టాలు తెచ్చుకున్నాం; మిగిలిన కోతులకీ కష్టం తెచ్చి పెట్టాం!" అని చాలా బాధ పడ్డాయి.
చివరికి ఒకరోజున అవకాశం చూసుకొని మూడూ పారిపోయి, మెల్లగా ఊరు చేరుకున్నాయి. ఇప్పుడవి మంచి కోతులైపోయాయి. అల్లరి అస్సలు చేయలేదు. చెడు చెయ్యద్దు, చెడువినద్దు, చెడు మాట్లాడద్దు'ని సంపూర్ణంగా అమలులో పెట్టాయి! రచన-యువ సాయి తేజ,ఐదవ తరగతి