కంకణాలపల్లిలో రవి, గణేష్ అనే పిల్లవాళ్లు ఉండేవారు. ఇద్దరిదీ ఒకే స్కూలు; ఇద్దరూ బాగా చదువుకునేవాళ్లు. వాళ్ల ఇళ్లు కూడా ప్రక్కప్రక్కనే ఉండేవి.
ఇద్దరూ మంచి స్నేహితులే కానీ, వాళ్ల తల్లిదండ్రుల మధ్య మాత్రం రకరకాల గొడవలు ఉండేవి. అయినా రవి, గణేషులు మాత్రం ఎవరు ఏమన్నా పట్టించుకునేవాళ్లు కాదు.
అయితే ఒక రోజున రవి బడికి రాలేదు. ఎందుకు రాలేదో మరి, ఎవ్వరికీ తెలియలేదు. సాధారణంగా రవి, గణేష్ ఇద్దరూ కలిసి వస్తుంటారు బడికి- ఆ రోజున మటుకు తను బయలుదేరేప్పుడు రవిని పిలవలేదు గణేష్, ఎందుకనో.
'మధ్యాహ్నం వస్తాడేమో' అని ఎదురు చూసాడు; అప్పటికీ రాకపోవటంతో సాయంత్రం స్కూలు వదిలిన తరువాత రవి వాళ్ల ఇంటికి వెళ్లాడు అతను.
అప్పుడు తెలిసింది- 'రవిని పాము కాటు వేసింది; ఆస్పత్రిలో ఉన్నాడు! ప్రమాదమేమీ లేదు. అదృష్టవశాత్తు అతన్ని కరిచింది విషపు పాము కాదు' అని.
వెంటనే ఆసుపత్రికి వెళ్ళి చూసి వస్తానని బయలు దేరాడు గణేష్. కానీ వాళ్ల ఇంట్లో వాళ్లు పోనివ్వలేదు- "పిల్లల్ని రానివ్వరు; పిల్లలు ఆస్పత్రికి పోకూడదు; ప్రమాదం ఏమీ లేదులే; పోవాలని ఏమున్నది"-ఇట్లా ఏవేవో చెప్పారు. దానితో ఇక చేసేదేమీ లేక గణేష్ అట్లానే ఉండిపోయాడు.
రెండు మూడు రోజుల తర్వాత రవి ఇంటికి వచ్చాడు. తర్వాతి రోజునుండి స్కూల్‌కి రావటం కూడా మొదలుపెట్టాడు. గణేష్‌కి అతన్ని చూడగానే ప్రాణం లేచివచ్చినట్లయింది- దగ్గరికి పోయి, పలకరించి, చూడటానికి రానందుకు క్షమాపణలు చెప్పాడు. 'దానిదేమున్నది, అయినా ఆస్పత్రికి పిల్లల్ని రానివ్వరు!' అన్నాడు రవి. గణేష్ దగ్గర నోట్సులు తీసుకొని, తను లేనప్పుడు జరిగిన పాఠాలన్నీ అతని చేతే చెప్పించుకున్నాడు.
ఆ తర్వాత కొన్ని రోజులకు గణేష్‌ని ఓ వీధి కుక్క కరిచింది. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒక వారం విశ్రాంతి కావాలని చెప్పాడు. ఈ విషయం తెలిసి, అతని దగ్గరికి బయలు దేరాడు రవి. అయితే ఈసారి రవి వాళ్ల ఇంట్లోవాళ్ళు అడ్డు పడ్డారు- "ఏమున్నది, పర్వాలేదులే; బానే ఉంటాడులే, ఏమీ కాదు; అయినా నీకు బాలేనప్పుడు వాడు రాలేదు కదా, ఇప్పుడు నువ్వు ఎందుకెళ్ళాలి; వాళ్ల ఇంట్లో వాళ్ళు మంచోళ్ళు కాదు"- ఇట్లా రకరకాలుగా చెప్పసాగారు.
అయినా రవి పట్టించుకోలేదు. గణేష్ వాళ్ల ఇంటికి వెళ్ళి, అతన్ని పలకరించి, "ఏమీ పరవాలేదులేరా! నేను నీకు కావాల్సిన నోట్సులను అన్నీ ఎప్పటికప్పుడు అందజేస్తాను. నువ్వు ఇంట్లో ఉండే చదువుకుంటూండు" అని ధైర్యం చెప్పి వచ్చాడు. ఊళ్ళలో సంగతులేవీ దాగవు కదా, ఆ రోజు సాయంత్రం కల్లా రవి వాళ్ల ఇంట్లో తెలిసింది: 'వాడు గణేష్ వాళ్ల ఇంటికి వెళ్ళాడు- తాము వెళ్ళద్దన్నా వెళ్ళాడు!' అని. దాంతో ఆ రోజు సాయంత్రం రవి బడినుండి ఇంటికి రాగానే ఇంట్లో వాళ్లంతా 'కయ్యి'మంటూ లేచారు. "నీకు మేమంటే లెక్కలేకుండా పోతున్నది. నువ్వు మమ్మల్ని అస్సలు పట్టించుకోవట్లేదు. మేం వెళ్లద్దన్నా వెళ్తున్నావు వాళ్ళ ఇంటికి!" అని గొడవ పెట్టారు.
అయితే అంతా చూస్తున్న తాత రవికి మద్దతుగా నిల్చాడు. ఇంట్లో వాళ్లకి చెప్పాడు- "చూడండి, మీరు చేస్తున్నది పూర్తిగా తప్పు. 'ఇంతకు ముందు గణేష్ రాలేదు; కాబట్టి వాళ్ళింటికి వెళ్లకూడదు' అంటున్నారు మీరు. ఇప్పుడు వీడు పోలేదనుకో, ఆ తర్వాత వాళ్ల ఇంట్లో పెద్దలు వాడికి అడ్డు పడతారు. వీడు రాలేదని వాడిని పంపరు; వాడు రాలేదని వీడిని పంపరు. ఇట్లా పెద్దలు వేసుకునే మితిమీరిన లెక్కల వల్లనే పిల్లల మధ్య బంధాలు తెగిపోయేది! మీకు అర్థం అవుతున్నదో, లేదో- మానవ సంబంధాలన్నీ ఇట్లాగే చెడిపోతున్నాయి. 'వాడు చేస్తే మనం చేద్దాం, వాడు చేయకపోతే మనం చేయకూడదు' అని పిచ్చి నియమాలు పెట్టుకోవటం వల్ల అందరం నష్టపోతున్నాం. అసలు నన్నడిగితే 'వీళ్ళు చేసిన పని చాలా గొప్పది' అంటాను. మనం అందరమూ వాడి వెంట గణేష్ వాళ్ళింటికి వెళ్ళి పలకరించి రావాలంటాను. ఊరికే ద్వేషాలు పెంచుకోకూడదంటాను! మీరు రాకపోయినా నేనే వెళ్ళొస్తానంటాను!" అన్నాడు గట్టిగా.
తాత మాటలు అందరినీ ఆలోచింప జేసాయి. చీకటి పడేలోగా రవి వాళ్ల ఇంట్లోవాళ్లంతా గణేష్ వాళ్ళింటికి వెళ్ళి, వాడిని పరామర్శించి వచ్చారు.
అప్పటి నుండి వాళ్ల కుటుంబాలు రెండూ బాగా దగ్గరయ్యాయి! ఒకరి కష్ట సుఖాలలో మరొకరు పాలు పంచుకోవటం మొదలైంది!