ఆ రోజు రాజు పుట్టిన రోజు- బడిలో అందరికీ చాక్లెట్లు పంచాడు రాజు.
ఆ రోజు సాయంత్రం బడి నుండి ఇంటికి వస్తుంటే అతనికి ఒక పనసపళ్ళ బండి కనిపించింది.
దాన్ని చూడగానే అతనికి గుర్తుకొచ్చింది: వాళ్ళ అమ్మానాన్నలకు ఇద్దరికీ పనసపళ్ళంటే చాలా ఇష్టం. అందుకని రాజు తన దగ్గరున్న పది రూపాయలతోనూ పనసపండ్లను కొని ఇంటికి తీసుకెళ్ళాడు. పనసపళ్ళు బహుమతిగా తెచ్చిన కొడుకును చూసి వాళ్ల అమ్మా నాన్న చాలా సంతోషపడ్డారు. పనస పళ్ళు తిని, విత్తనాలు పారేస్తుండగా రాజు వాళ్లని ఆపాడు-
"నాన్నా! ఈ విత్తనాలను పారెయ్యకండి. నేను వాటిని విత్తుతాను! కొన్నేళ్ల తర్వాత పనసపళ్ళు ఎంచక్కా మనింట్లోనే కాస్తై!" అన్నాడు.
రాజు వాళ్ల అమ్మ-నాన్న ఇద్దరూ మురిసిపోయారు. "వీడు పెద్దవాడ-య్యాడు!" అన్నది అమ్మ. "చక్కగా ఆలోచిస్తున్నాడు. ఎంత ముందుచూపో చూడు!" అన్నాడు నాన్న.
రాజు ఆ విత్తనాలు విత్తుతుంటే వాళ్ళ నాన్న వచ్చి, దగ్గర నిలబడి చూసి, ఫోటో తీశాడు.
ఆ రోజంతా వాళ్ళు దాని గురించి మాట్లాడుకున్నారు. అయితే రాత్రి నిద్రపోయి లేచేసరికి, ఇంక ఆ విషయం గురించి మరచిపోయాడు రాజు. అమ్మ-నాన్న కూడా మళ్ళీ దాని ఊసు ఎత్తలేదు.
పది రోజుల తర్వాత, రాజు ఓ చిన్న మొలకను చూశాడు. అది తను నాటిన విత్తనానిదే; కానీ ఆ సంగతి అతనికి గుర్తు రాలేదు. 'ఏదో పిచ్చి మొక్క' అనుకున్నాడు.
అయితే రాజు ఆ మొక్కవైపే చూడటాన్ని వాళ్ళ నాన్న గమనించాడు: "ఒరేయ్! అది నువ్వు నాటిన పనస విత్తనందేరా, పనస మొలక అది!" అన్నాడు నవ్వుతూ. ఆ రోజు తీసిన ఫొటో కూడా చూపించాడు.
రాజుకు అప్పుడు జ్ఞాపకం వచ్చింది.
"విత్తనం నాటడమే కాదు, అది పెరిగి చెట్టు అయేంతవరకూ జాగ్రత్తగా కాపాడాలి- చిన్న మొలక కదా! అది నీ కవల తమ్ముడి లాంటిది! గుర్తున్నదిగా, దాని పుట్టిన రోజు, నీ పుట్టిన రోజు ఒకటే!" అన్నాడు నాన్న.
ఇక ఆ తర్వాత తన తమ్ముడు మొక్కను మరిచిపోకుండా చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు రాజు.