అనగనగా సుందరయ్యఅనే జాలరి ఒకడు ఉండేవాడు. పెద్ద నది మధ్యలో, సుడిగుండాల ప్రాంతంలో చేపలు పట్టేవాడు అతను. ఆ ప్రాంతానికి పోవాలంటే వేరే జాలర్లు అందరూ భయపడేవాళ్ళు. అట్లా ఎవ్వరూ పోయేందుకు సాహసించని చోట్ల తానొక్కడే చేపలు పట్టడం వల్ల, అతనికి చేపలు బాగా దొరికేవి. అట్లా సుడిగుండాలంటే భయపడని సుందరయ్యను తోటి జాలర్లు ముద్దుగా 'సుడిగుండయ్య' అని పిలవటం మొదలెట్టారు.

సుడిగుండయ్య చాలా తెలివైన వాడు. నది ఉధృతంగా ప్రవహిస్తున్నప్పుడు కూడా, సుడిగుండం తనను లోపలికి లాక్కోకుండా రకరకాల ఉపాయాలు పన్నేవాడతను.

ప్రమాదకరమైన సుడిగుండాలలోకి జొరబడేటప్పుడు, ముందుగా నది ఒడ్డున నేలలోకి ఒక గుంజను పాతేవాడు. దానికి పొడవాటి మోకును ఒకదాన్ని కట్టేవాడు. ఆ మోకు రెండో‌ చివరను తన పడవకు కట్టేవాడు. ఎప్పుడూ ఆ తాడు పరిధిలోనే చేపలను వేటాడేవాడు.

ఒకనాడు నదిలో చేపలు పట్టే బెస్తవాళ్లను వెతుక్కుంటూ కొందరు రాజభటులు వచ్చారు. "మా రాజు గారికి ఒక రకం పక్షవాతం వచ్చింది. అది నయం కావాలంటే అయన చేతికి వెండి చేప రక్తం పూయాలి; కాలికి బంగారు చేప రక్తం పూయాలి అని వైద్యులు చెప్పారు. మీరు ఎప్పుడూ నదిలోనే తిరుగుతుంటారు కాబట్టి, అట్లాంటి చేపలు మీకేమైనా నదిలో దొరుకుతాయేమో చూడండి. వాటిని పట్టుకొచ్చి రాజు గారికి ఇచ్చారంటే, వెండి చేప పట్టి తెచ్చిన వారికి వెండి పడవ; బంగారు చేప పట్టి ఇస్తే వారికి బంగారు పడవ బహుమానంగా ఇస్తారు!" అని చాటించి పోయినారు.

ఇది విన్న సుడిగుండయ్య భార్య అతనితో "మామా! విన్నావు కదా! ఈసారి నువ్వు అట్లాంటి చేపలు పట్టుకురావాలి!" అన్నది. "మనం ఆ పడవలమ్మి, ఊర్లో మంచి ఇల్లు కొనుక్కొని హయిగా బతుకచ్చు!"

సుడిగుండయ్య నవ్వి "ఓసి పిచ్చి ముఖమా! వెండి పడవ, బంగారు పడవల్లో చేపలు పడితే మన గురించి అందరు గొప్పగా చెప్పుకుంటారు. అప్పుడు నా విలువే, వేరుగా వుంటుంది. వాటిని అమ్మితే ఏమొస్తుందే?" అన్నాడు. వాళ్ళిద్దరి మధ్యా ఆ చర్చ తెగలేదు కానీ, ఆనాటి నుండి సుడిగుండయ్య మామూలు చేపలు పడుతూనే, ప్రత్యేక దృష్టితో వెండిచేప కోసమూ, బంగారు చేప కోసమూ వెతకటం మొదలు పెట్టాడు.

అనుకోకుండా ఒకరోజు అవి అతని కంట పడ్డాయి! చాలా కష్ట పడగా, అతి ప్రయత్నం మీద ఒక్క వెండి చేప మాత్రం అతని వలలో పడింది. బంగారు చేప దూరంగా పారిపోయి తప్పించుకొని కూడా నీళ్ళలోంచి తాటి చెట్టంత ఎత్తుకు ఎగిరి దూకుతూ ఏవేవో వింత శబ్దాలు చేసింది. చేప అలా అరవటం విని సుడిగుండయ్య చాలా ఆశ్చర్యపడ్డాడు; కానీ అంతలోనే పెద్ద పెద్ద రెక్కలున్న భైరవడేగ ఒకటి ఎక్కడినుండో వాయు వేగంతో వచ్చి చేరుకొని, సుడిగుండయ్య చుట్టూ గిరగిరా తిరుగుతూ అతనితో "సుడిగుండయ్యా! ఆ వెండి చేపను వదులు!" అన్నది.

దాని రెక్కల విసురుకు నదిలో అలలు రేగి సుడిగుండయ్య పడవ అల్లల్లాడింది. సుడిగుండయ్యకు కొంచెం భయం వేసినా, గట్టిగా నిలబడి "అది నాకు దొరికింది. దాన్ని నేను ఎందుకు వదులుతాను?! నువ్వెవరు, నాకు చెప్పడానికి? దీన్ని తీసుకెళ్ళి నేను రాజుగారికి ఇస్తే, ఆయన నాకు వెండి పడవ ఇస్తాడు. మరి దీన్ని వదిలేస్తే నువ్వేమిస్తావో చెప్పు?!" అన్నాడు.

"నీ పడవకు సరిపోయే వెండిని నేనిస్తాను సరేనా? ఈ చేపను వదిలేసెయ్యి చాలు!"అన్నది భైరవడేగ. సుడిగుండయ్య కొంచెం సేపు ఆలోచించి "సరే" అన్నాడు.

బైరవ డేగ ఎక్కడికో వెళ్ళి, పెద్ద వెండి ముద్దను కాళ్ళ మధ్య ఇరికించుకొని తెచ్చింది. "ఇదిగో, ఈ వెండి కల్తీ లేనిది; స్వచ్ఛమైనది. రాజుగారు నీకిచ్చే వెండికంటే చాలా విలువైనది ఇది. దీన్ని ఇప్పుడే నది గట్టున పెడుతున్నాను. తీసుకో. చేపను వదిలెయ్యి!" అన్నది.

సుడిగుండయ్య వెండిముద్దను తీసుకొని వెండి చేపను నదిలోనే వదిలేసాడు. ఆ వెండిని మొత్తాన్నీ అమ్మి, సుడిగుండయ్య భార్య డబ్బు చేసుకున్నది. ఆ డబ్బుతో పెద్ద ఇల్లు కట్టించింది కూడా. అయితే అప్పటి నుండి ఆమె ప్రతి రోజూ 'ఈసారి బంగారు చేపను పట్టు' అని భర్తకు గుర్తు చేస్తూనే ఉంది. సుడిగుండయ్యకూడ బంగారు చేపకోసం గట్టి ప్రయత్నం చేసాడు. నిజంగానే బంగారు చేప పడింది కూడాను, అతని వలలో!

అయితే ఈసారి కూడా ముందుసారి లాగానే జరిగింది. వెండి చేప గాలిలోకి ఎగిరి ఏమేమో శబ్దాలు చేసింది. ఆ శబ్దాలు వింటూనే బైరవ డేగ వచ్చింది. గతంలో లాగే సుడిగుండయ్యతో "అయ్యా! నువ్వు కోరినంత బంగారాన్ని నేనిస్తాను. మా బంగారు చేపను మాత్రం వదిలిపెట్టు!" అన్నది.

అతడు సమ్మతించాడు. డేగ ఎక్కడి నుంచో ఈసారి పెద్ద బంగారు ముద్దను తెచ్చి, నది గట్టున పెట్టింది. సుడిగుండయ్య ఆ బంగారు ముద్దను చూసి సంతోషించి, చేపను వదిలేస్తూ బైరవ డేగతో "నీకు, ఈ చేపలకు ఏమిటి సంబంధం?" అని అడిగాడు.

"అయ్యా! అవి రెండూ నా ప్రాణ దాతలు. నేను చిన్నపుడు ఈ నదిలో పడి, కొట్టుకొని వచ్చి, ఈ సుడిగుండంలో పడిపోబోయాను. ఆ సమయంలో ఈ రెండూ నన్ను కాపాడి నది గట్టుకు చేర్చాయి. నేను వీటికోసం నా ప్రాణాలైనా ఇవ్వగలను" అన్నది.

సుడిగుండయ్య "ఓహో!" అని బంగారాన్నంతా ఇంటికి తీసుకుపోయి, భార్యకు ఇచ్చాడు. భార్య ఆ బంగారాన్నంతా అమ్మి ఎంత సొమ్ము చేసుకున్నదంటే, ఇక ఆ డబ్బు వాళ్ల కొత్త ఇంట్లో‌ కూడా పట్టలేదు! దాంతో‌ఆమె అతనితో "ఇప్పుడు మన దగ్గర చాలా డబ్బుంది కదా; ఇంక మనం ఇక్కడ ఉండటం క్షేమం కాదు- పట్టణానికి పోయి సుఖంగా ఉందాం" అన్నది.

అంత డబ్బు వచ్చినా సుడిగుండయ్య ఆశ చావ లేదు. "ఈ సారి ఆ రెండు చేపలనూ పట్టుకొని రాజుగారికిస్తాను. ఆయన రోగం నయమౌతుంది. నన్ను సన్మానిస్తారు. వెండి పడవ, బంగారు పడవ కూడా ఇస్తారు. ఒక్కో రోజున ఒక్కొక్క పడవలో నదికి పోతాను!" అన్నాడు.

అమె నవ్వి, "మామా! దురాశకు పోకు! మన దగ్గర ఇప్పటికే చాలా డబ్బున్నది. దాన్ని కాపాడుకోవడమే కష్టం. ఉన్న డబ్బును ఎలా రక్షించుకోవాలో చూడకనే, ఇంకా డబ్బు సంపాదించే ఆలోచన ఎందుకు చేస్తావు? మనం ఇక్కడ ఉండటం ప్రమాదకరం- నిజంగా చెబుతున్నాను- 'వేరే ప్రాంతానికి వెళ్ళిపోదాం' అన్నది.

సుడిగుండయ్య ఒప్పుకోలేదు. మళ్ళీ పడవనెక్కి చేపల కోసం నదిలోకి పోయాడు. అతడనుకున్నట్లే ఈసారి బంగారు, వెండి చేపలు రెండూ అతని వలలో పడ్డాయి.

"ఇప్పుడు ఎవరు పిలుస్తారు, మీ స్నేహితుడిని?" అని ఎగతాళిగా నవ్వాడు సుడిగుండయ్య.

అయితే అవి రెండు వలలోనే గట్టిగా గింజుకులాడుతూ అరిచే సరికి బైరవడేగ రానే వచ్చింది. అది అన్నది, "అయ్యా! నేను నీకు కావలసిన దాని కంటే ఎక్కువగానే వెండి బంగారాలు ఇచ్చాను గదా, మళ్ళీ మా వాళ్ళను ఎందుకు పట్టుకున్నావయ్యా?! మొదట ఇచ్చిన దానికి రెట్టింపు వెండి బంగారాలు ఇస్తాను. వీటిని వదిలిపెట్టు! మళ్ళీ‌ ఎప్పుడూ పట్టుకోనని మాట ఇవ్వు!" అన్నది.

సుడిగుండయ్య ఒప్పుకోలేదు. "అట్లా కుదరదు. ఎన్ని సార్లు పట్టుకుంటాననేది నా ఇష్టం. ఈ చేపలను పట్టుకొని రాజుగారికి ఇస్తే అయన నన్ను సన్మానిస్తాడు. నువ్వు ఇచ్చేదానికంటే చాలా ఎక్కువ ఇస్తాడు!" అన్నాడు.

భైరవ డేగకు చాలా కోపం వచ్చింది. "చివరి అవకాశం ఇస్తున్నాను. పట్టు వదుల్తావా లేదా?!" అన్నది.

సుడిగుండయ్య అడ్డంగా తల ఊపాడు. "ఇంకా బెట్టు చేస్తే మరింత డబ్బు వస్తుంది!" అనుకున్నాడు.

అయితే భైరవ డేగ ఈ ఆశబోతుతో ఇంక బేరం చేయదల్చుకోలేదు. చటుక్కున ఆకాశానికి ఎగిరిందది. వేగంగా వచ్చి, అతను నది ఒడ్డున నేలలో నాటిన కర్రను తన కాళ్ళతో లాగి పారేసింది! తాడు సాయం లేని పడవ పట్టు తప్పింది. సుడిగుండంలో చిక్కుకొని గిరగిరా తిరగటం మొదలెట్టింది.

ప్రాణభయంతో 'కాపాడ'మని అరిచాడు సుడిగుండయ్య. చివరి నిముషంలో కోపం చల్లారిన డేగ అతన్ని కాపాడేందుకు ప్రయత్నించింది గానీ, ఫలితం లేకపోయింది. సుడిగుండయ్య సుడిగుండంలో కలిసిపోయాడు. వలతో పాటు పైకి తేలిన చేపలను భైరవడేగ వలలోంచి తప్పించింది.

వచ్చిన అవకాశాన్ని మంచి మనసుతో సద్వినియోగం చేసుకుంటే సరేగాని, దురాశతో బెట్టు చేస్తే మటుకు మొదటికి మోసం వస్తుంది.