“మళ్ళీ వచ్చావా విక్రం?! సిద్ధప్ప ఎట్లాంటివాడో నీకు ఎన్ని విధాలుగా చెప్పినా అర్థం అవుతున్నట్లు లేదే?! మంచి పేరు, డిగ్రీలు ఉన్నంత మాత్రాన మంచితనమూ, జ్ఞానమూ ఉన్నట్లు కాదు. ఈ సంగతి అర్థమయ్యేందుకు గాను నీకు గజదొంగ గంగన్న కథ చెబుతాను విను" అంటూ ఇలా చెప్పసాగింది..

గజదొంగ గంగన్న మరణ శయ్యమీద ఉన్నాడు. అతని అనుచరులు పదిహేను మందీ అతనున్న గది గోడలకు ఆనుకొని నిలబడి ఉన్నారు, విచారంగా. గంగన్న కొడుకు రంగన్న తండ్రి పడుకున్న మంచం కోడుమీద కూర్చుని, తండ్రి చేతుల్ని తన చేతిలోకి తీసుకొని నొక్కుతున్నాడు. అతని కళ్లలో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి.

పదహారేళ్ల రంగన్న, తండ్రి అడుగుజాడల్లో నడిచాడు, చాలా ఏళ్లుగా. గంగన్న అనుచరులు పదిహేను మందికీ అతను దైవమే. ఎవ్వరూ అతని మాట జవదాటరు.

తండ్రి తదనంతరం అతను నెలకొల్పిన చోర సామ్రాజ్యం యావత్తూ రంగన్న సొంతం అవ్వనున్నది. ఇప్పుడిక అతను దాన్నంతా ఏలాలి- తండ్రి సాయం లేకనే.

గంగన్నకు ఒక దగ్గు తెర వచ్చింది. దగ్గి దగ్గి మెలికలు తిరిగిపోయాడు. తన పని ఐపోయిందని అర్థమైంది. కొడుకుని దగ్గరగా వంగమని సైగ చేసాడు. రంగయ్య వంగి, తన చెవుల్ని తండ్రి నోటికి దగ్గరగా తెచ్చాడు. అందరూ తలలు వంచుకొని, నాయకుడు చెప్పే చివరి పలుకుల్ని ఆలకిస్తున్నారు శ్రద్ధగా.

గంగన్న మొదలుపెట్టాడు- "నాన్నా, రంగూ! నేను జీవితంలో చాలానే సాధించాను. మా నాయన నాకు కనీసం ఒక ఇంటిని కూడా ఇవ్వలేదు. జేబులు కొట్టటం నుంచి, చిన్నా చితకా దొంగతనాల్లోకి, అక్కడినుండి దోపిడీలలోకి అలవోకగా, అత్యంత సాహసో- పేతంగా ప్రవేశించాను. నేనుండే దారుల్లోంచి వెళ్లాలంటే బాటసారులంతా వణికి పోయేట్లు చేసాను. శ్రాస్త్రాల్లో దొంగ తనాల గురించి చెప్పిన మెళకువలన్నీ ఒక్కటీ పొల్లు పోకుండా ఆచరణలోకీ తెచ్చి చూపించి-ఇదిగో, యీ పదిహేను మందికీ తిరుగులేని నాయకుడినైనాను."

రంగన్న ఆయాసంతో కొంత సేపు దగ్గాడు. చుట్టూ అందరూ ఇంకా బాధగా ముఖం పెట్టారు. ఒక్కో అక్షరం కూడగట్టుకొని కొనసాగించాడు గంగన్న-

"రంగూ! మన యీ ఊళ్లల్లో జనాలంతా నా పేరెత్తితే చాలు- వణికిపోయేట్లు ఏలాను ఇన్నేళ్ల పాటు. ఇప్పుడు ఇదంతా నీకు ఇస్తున్నాను. ఎట్లా చేసుకుంటావో, నీ ఇష్టం. నిన్నిప్పుడు నేను కోరేది ఒక్కటే- నాకు మంచి పేరు తేవాలి నాన్నా! అందరూ గజదొంగ గంగన్న గురించి మంచిగా తలచుకునేట్లు చెయ్యి. ఇంతకు మించి నాకు ఏ కోరికా లేదు" అని చెప్పి కన్నుమూసాడు. అందరూ గొల్లుమన్నారు. రంగన్న తండ్రి అంత్యక్రియల్ని ఘనంగా నిర్వహించాడు. తండ్రి ఆఖరి కోరికను తీర్చాలనుకున్నాడు. "ఏం చేస్తే, అందరూ మా నాన్న గురించి మంచిగా అనుకుంటారు?" అని అడిగాడు అనుచరుల్ని.

ఒకడన్నాడు-" ఊరూరా విగ్రహాలు పెట్టిద్దాం" అని.

"ఉహుఁ" అన్నాడు రంగన్న.

"ఊరూరా ఆయన పేరు మీద బడులు, గ్రంథాలయాలు కట్టిద్దాం" ఇంకోడన్నాడు. "బాలేదుఁ" అన్నాడు రంగన్న.

“గంగన్న పేరిట విద్యార్థులకు స్కాలర్షిప్పులు ఇద్దాం” అన్నాడు మరొకడు.

“ఉహుఁ” అన్నాడు రంగన్న.

ఇట్లా ఎవరు ఏం చెప్పినా రంగన్న మెచ్చలేదు. చివరికి ఒక నిశ్చయానికి వచ్చినట్లు తలూపి, "అందరూ నేను చెప్పినట్లు చేయండి. ఇదివరకటి కంటే ఇంకా ఎక్కువ జేబులు కొట్టండి. ఎక్కువ దారి దోపిడీలు చేయండి. బందిపోటు పనుల్లోకీ దిగుదాం. బందిపోటు రంగన్న అంటే పిల్లలు, పోలీసులు కూడా వణికి పోయేట్లు చేద్దాం. ఇంక ఆగేది లేదు- తక్షణం మొదలు పెట్టండి!" అని ఆదేశించాడు రంగన్న. అనుచరులంతా జయ జయ నినాదాలు చేసారు.

ఇంతవరకూ చెప్పి, బేతాళం "అయినా జీవితమంతా దొంగ బ్రతుకు బ్రతికిన గంగన్నకు చరమాంకంలో మంచి పేరు అవసరం ఏమొచ్చింది? అది అతనిలోని బలహీనతకు, నిస్సహాయతకు ప్రతీక కాదా? ఇక తండ్రికి మంచి పేరు తెస్తానని మాట ఇచ్చిన రంగన్న చివరికి చేసిందేమిటి, స్వార్థం చూసుకోవటం తప్ప?” అని అడిగింది.

విక్రం చిరునవ్వు నవ్వి- “అట్లాంటిదేమీ లేదు- జీవితాంతమూ గజదొంగగా బ్రతికిన గంగన్నకు వేరే మంచి పేరు అవసరం ఏమీ లేదు: దొంగగా తనకు గొప్ప పేరు తెచ్చి పెట్టమని అతని ఉద్దేశం. ఆ సంగతి అర్థమైన కొడుకు అతని కంటే దుర్మార్గుడిగాను, క్రూరుడుగాను పేరు తెచ్చుకోవటం ద్వారా, ప్రజలకు 'తనకంటే తన తండ్రే నయం- 'గంగన్న అని చాలా మంచోడు పాపం, ఇప్పుడు చచ్చిపోయాడు' అనిపించేట్లు చేసాడు. అట్లా జనాలు గంగన్నను మంచిగా గుర్తు చేసుకుంటారు కద!‌ దుర్మార్గుల మన:ప్రవృత్తి ఇంతకంటే వేరుగా ఉండే అవకాశం లేదు" అన్నాడు.

ఆ సమాధానం సరైనదేనని గుర్తించిన బేతాళం అతని పట్టునుండి తప్పించుకొని చటుక్కున మళ్ళీ చెట్టెక్కింది.