ఒక ఊరిలో రవి, శాంత అనే దంపతులు ఉండేవారు. రవి వ్యాపారంలో బాగానే సంపాదించాడు.

దంపతులు ఇద్దరూ చాలా పొదుపుగా ఉండేవాళ్ళు; కానీ వాళ్ళ కొడుకు సతీష్ మాత్రం చాలా దుబారాగా తయారయ్యాడు.
వాడికి స్కూలుకి వెళ్ళడమంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. స్కూలుకు వెళ్తున్నట్టే వెళ్ళి, ఊరి చెరువు కట్ట మీద ఆడుకునేవాడు.

రాను రాను వాడికి చెడు సహవాసాలు అబ్బినై. బీడీలు, సిగరెట్లు త్రాగటం, సారాయి త్రాగటం లాంటి దురలవాట్లు వచ్చినై. వాటికి తోడు దుకాణంలోని డబ్బును తీసుకెళ్ళి, తోచిన జూదాల్లోను, పందాల్లోను ఖర్చు చేయటం మొదలెట్టాడు. కొడుకు దారి తప్పుతున్న సంగతి రవికి తెలిసినా, మొదట్లో పెడచెవిన పెట్టాడు. తన వ్యాపారపు పనుల్లో వ్యస్తంగా ఉంటూ, కొడుకు గురించి పెద్దగా పట్టించుకోలేదు.

తీరా వాడు ముదిరిపోయాక, అప్పుడు ముందుకొచ్చి "ఇలాంటి పనులు మంచివి కావురా" అని చెప్పి చూసాడు; తిట్టాడు; బెదిరించాడు; కొట్టాడు- ఏం చేసినా సతీష్ మాత్రం తన దారి మార్చుకోలేదు.

సతీష్ స్నేహితుడు మహేష్ అని ఒకడు ఉండేవాడు. "ఎందుకురా, ఇలా తయారవుతున్నావు? నేను పోవట్లేదా, స్కూలుకు? నువ్వూ రా, ఇద్దరం కలిసి వెళ్దాం! బాగా చదువుకుంటే మన కాళ్ళమీద మనం నిలబడచ్చు: లేకపోతే అందరితోటీ మాటలు పడుతూ బ్రతకాలి. కాలాన్ని వృధా చేయకు!" అనేవాడు.

"ఇదిగోరా, ఒరేయ్! నువ్వు చదువు; గొప్ప ఆఫీసరువవ్వు. నన్ను నా ఇష్టం వచ్చినట్లు ఉండనీ" అనేవాడు తప్ప, సతీష మటుకు వాడి సలహాలను పాటించేవాడు కాదు.

పదో తరగతి పాసవ్వగానే మహేష్ వేరే ఊరికి వెళ్ళిపోయాడు. పరీక్షలో తప్పిన సతీష్ ఊరికే పెద్దవాడయ్యాడు. ఊళ్ళోనే పెద్ద రౌడీ అయ్యాడు. తండ్రి సంపాదించిన డబ్బునంతా వ్యసనాలకు ధారపోసాడు. తల్లిదండ్రులు వాడిని తిట్టుకోని రోజు లేదు.
అయితే బాగా చదువుకున్న మహేష్ పోలీసు ఇన్‌స్పెక్టరు అయి, అదే ఊరికి తిరిగి వచ్చాడు. ఊరి రౌడీల పట్టికలో సతీష్‌ పేరును చూసి, చాలా బాధ పడ్డాడు. అతన్ని పిలిపించి "సతీష్, ఎలా ఉన్నావురా? అమ్మ-నాన్నలు ఎలా ఉన్నారు?" అని అడిగాడు.

"వాళ్ళు నన్ను ఇంట్లోంచి తరిమేసారురా. అదే నా బాధ!" చెప్పాడు సతీష్, తల దించుకుంటూ.

"మరి తమిమెయ్యక ఎలా ఉంటారురా?! నువ్వు ఇట్లా చెడుపనులు చేస్తూంటే, ఎవరైనా ఎంత కాలం కాపాడతారు? అదే నువ్వు చిన్నప్పటినుండీ చక్కగా చదువుకొని ఉంటే, బాధ్యతగల మనిషివి అయ్యేవాడివి! ఇప్పటికైనా నా మాట విను- దొంగ పనులు మానేసి, ఏదైనా వ్యాపారం చేసుకో, నేనూ నీకు ఏమైనా సాయం చెయ్యగలనేమో చూస్తాను. అట్లా కాక చెడు దారినే ఉంటానంటే మటుకు, ఇన్‌స్పెక్టరుగా నా బాధ్యతను నేను నిర్వర్తించాల్సి ఉంటుందని మర్చిపోకు!" కఠినంగా చెప్పి, లేచి వెళ్ళిపోయాడు మహేశ్.

అతని మాటలు సతీష్‌ని ఆలోచింపజేశాయి. చదువు వల్ల, సత్ప్రవర్తనల వల్ల మహేష్‌కు అబ్బిన హుందాతనం అతనికి నచ్చింది. 'నేనూ‌ మర్యాదస్తుడిని అవుతాను' అనిపించింది అతనికి. మనసు మారింది. తల్లిదండ్రులను ప్రాధేయపడి, వాళ్ళ సాయంతో తను కూడా నిజాయితీగా ఒక వ్యాపారం మొదలుపెట్టాడు. నిలకడమీద అందులో విజయం సాధించి, మర్యాదస్తుడు అనిపించుకున్నాడు!