అనగనగా ఒక అడవిలో ఒక సింహం. దానికి ఒకసారి చాలా ఆకలి వేసింది. ఎప్పుడూ దాని వెంట తోడుగా ఉండి, ఎప్పుడు ఏం చేయాలో చెప్పే మంత్రి- నక్క, ఆ రోజున ఇంకా రాలేదు.
'ఈ మంత్రికి ఏమయిందో! ఈరోజు ఇంకా రాలేదు?!' అనుకుంటూ చాలాసేపు ఎదురు చూసిందది. చివరికి "అయ్య బాబోయ్! నాకు అకలి దంచేస్తోంది- ఇంక లాభం లేదు. నేనే ఏమైనా ఆహారం వెతుక్కోవాలి!" అనుకుంటూ గుహలోంచి బయటికి వచ్చింది.
ఆహారం కోసమని అటూ-ఇటు చూసింది. అదృష్టం! దగ్గరలోనే కుందేలు ఒకటి కనబడింది.
'హమ్మయ్య కష్టపడకుండానే దొరికిందిరా కుందేలు! దీన్ని చంపి నా ఆకలి తీర్చుకుంటాను" అని రెండడుగులు ముందుకు వేసింది సింహం.
కానీ, అంతలోనే దానికో అనుమానం వచ్చింది-'ఈ కుందేలు నా ఆకలికి ఏం సరిపోతుందబ్బా?! ఇంత చిన్న ప్రాణిని చంపితే నా లాంటి రాజుకు మర్యాద ఏముంటుంది? మరి దీనిని చంపనా, వద్దా?!" అని.
అట్లా అది ఆ ఆలోచనలో ఉండగానే, మరి కొంచెం దూరంలో ఓ చెట్టు క్రింద కనపడింది ఒక జింక.
'ఆఁ!..అదిగో..అక్కడ ఉంది! జింక! నాలాంటి దానికి అదీ, ఆహారం అంటే..!"అనుకుంది సింహం.
ఆ ఆనందంలో దాన్ని పట్టుకుందామని గబగబా దాని వైపుకు పరుగెత్తింది. సింహం కదలికను చూడగానే ప్రాణాలు అరచేతపట్టుకొని చెంగున పొదలు దాటేట్లు దూకి, మెరుపులాగా మాయమైంది జింక!
సింహానికి బుద్ధి వచ్చింది. "ఓసి! ఎంత చలాకీగా తప్పించుకున్నావే?! మళ్ళీ చెబుతాను నీ సంగతి! హుంఁ.. ఆకలి మాత్రం దంచేస్తూన్నది! దూరం పోయే ఓపిక లేదు! సరేలే కానియ్యి.. మంత్రి వచ్చే దాకా కుందేలుతోటే సరి పెట్టుకుంటాను!"
అనుకున్నది.
తీరా చూస్తే అక్కడ ఆ కుందేలు కూడా లేదు!!