రాజు చాలా బాగా చదివేవాడు. అన్నిటిలోనూ ముందుండేవాడు. చదువు పూర్తి అయ్యాక కొద్ది నెలల్లోనే తనకు ఉద్యోగం కూడా వచ్చింది.

ఉద్యోగ రీత్యా అతను మరో ఊరికి వెళ్లాల్సి ఉంటుంది. వాళ్ల నాన్న సాయంతో రాజు ఆ క్రొత్త ఊళ్లో ఓ ఇల్లు అద్దెకు తీసుకున్నాడు.

కొత్తగా ఉద్యోగం; వంట అదీ ఇంకా పూర్తిగా రాదు; ఒంటరిగా ఉండటం కూడా బాగా అలవాటు లేదు.

అయినా ఉద్యోగం అంటే తప్పదు కదా, రాజు తను బాడుగ ఉండే ఇంటి చుట్టు ప్రక్కల వాళ్లని పరిచయం చేసుకున్నాడు.

మంచి పిల్లవాడు కావటంతో అందరూ అతనికి బాగానే సహకరించారు. రోజూ ఉదయాన్నే పనికి పోయి, రాత్రి బాగా ప్రొద్దు పోయాక ఇంటికొచ్చేవాడు రాజు.

రాజు బాడుగ ఉండే ఇంటికి ఎదురుగా నివసించేవాడు, సోను. ఇంట్లో చేరిన కొద్ది కాలంలోనే రాజుకి సోను బాగా దగ్గరయ్యాడు. చలాకీగా తిరుగుతూ, స్నేహపూర్వకంగా ఉంటూ, పనులన్నీ చక్కబరిచే సోనుని రాజు చాలా ఇష్టపడేవాడు; బాగా నమ్మేవాడు.

రోజూ తన ఇంటి తాళం చెవిని సోనూకి ఇచ్చి ఉద్యోగానికి వెళ్లేవాడు రాజు. మధ్యాహ్న సమయంలో అంతా రాజు ఇంట్లోనే గడిపేవాడు సోను.

అట్లా మెల్లగా రోజులు గడిచాయి. రాజు ఉద్యోగంలో చేరి నెలరోజులు పూర్తి అయ్యాయి; మొదటి జీతం చేతికి వచ్చింది. ఆ సందర్భంగా చుట్టు ప్రక్కల వాళ్లకి అందరికీ స్వీట్లు పంచాడు రాజు.

ఇంటి అద్దె మొదలైనవి చెల్లించాక, మిగిలిన జీతపు డబ్బుల్ని ఒక సూటుకేసులో దాచుకున్నాడు. "ఈ డబ్బుల్ని ఊరికి పంపిస్తాను, మా అమ్మావాళ్ళు చాలా సంతోషపడతారు" అని కూడా చెప్పాడు సోనుతో.

ఆ తర్వాతి రోజున ఎప్పటి మాదిరే ఇంటి తాళం వదిలేందుకు సోను దగ్గరికి వెళ్తే, "నేను ఉండట్లేదు- అర్జంటుగా పొరుగూరికి వెళ్తున్నాను- మధ్యాహ్నంకల్లా వచ్చేస్తాను" అన్నాడు సోను.

"నేను వచ్చేసరికి ఎలాగూ సాయంత్రం అవుతుందిగా, ఇది నీ దగ్గరే ఉండనియ్యి" అని తాళంచెవి సోను గదిలోనే గోడకి తగిలించి ఆఫీసుకు వెళ్ళాడు రాజు.

ఆ రోజు సాయంత్రం ఆఫీసునుండి తిరిగి వచ్చే సరికి రాజు ఇంటికి వేసిన తాళం విరిగి పడి ఉన్నది! తలుపు ఊరికే గడియ పెట్టి ఉంది. లోపలికి వెళ్లి చూస్తే తన సూటుకేసు బ్రద్దలై ఉంది. దాంట్లో డబ్బులు మాయం! ఆ సమయానికి సోను తన ఇంట్లోనే ఉన్నాడు- సంగతి చెబితే "అయ్యో,అలాగా! రోజూ నేను ఉంటున్నాను కదా, గమనించుకుంటున్నాను. ఇవాళ్ళే నేనూ లేను; అందుకని ఇట్లా జరిగింది!" అన్నాడు బాధగా మొహం పెట్టి.

తన ఇంట్లో దొంగతనం జరగటం, మొదటి జీతం కాస్తా దొంగపాలవ్వటం రాజుకు చాలా బాధ కలిగించింది. "పోలీసు కంప్లెయింటు ఇద్దాం- నువ్వూ రా, కొంచెం!" అన్నాడతను.

కానీ ఎందుకనో, సోను ఉత్సాహం చూపలేదు- "అప్పుడప్పుడు మన ఊళ్లో దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి రాజూ, చాలా మంది పోలీసు కంప్లెయింటు ఇచ్చారు కూడా. కానీ అసలు దొంగలు ఎవరో ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు. ఇప్పుడూ ఏమీ ప్రయోజనం‌ ఉండదు" అనేసాడు.

పోలీసు కంప్లెయింటు ఇవ్వకుండానే మరో నెల గడిచింది. రెండో నెల జీతం వచ్చింది. రాజు ఆ సంగతి సోనూకు చెప్పి, "రేపు నువ్వు ఉంటున్నావుగా? నా జీతం మొత్తం ఇంట్లోనే ఉంటుంది!" అన్నాడు.

"అయ్యో! లేదే! నేను రేపు ఉదయాన్నే ఊరికి వెళ్తున్నాను!" అన్నాడు సోను.

"మరెట్లాగ? ఈ డబ్బుని ఏం చెయ్యాలో ఏమో!" అన్నాడు రాజు ఆందోళనగా.

"చూద్దాం.. రేపు మధ్యహ్నం వరకు ఆగగలను నేను" అన్నాడు సోము.

"మరుసటి రోజున దొంగ తప్పనిసరిగా వస్తాడు" అని గట్టిగా అనిపించింది రాజుకు. దొంగని పట్టుకోవటం గురించి కూడా ఒక ఆలోచన వచ్చింది. ఇంటి వెనక ప్రక్క తలుపులు తీసిపెట్టాడు. ముందువైపు నుండి రోజూ మాదిరే తాళం వేసాడు. తాళం చెవుల్ని సోనుకు ఇచ్చేసాడు.

అట్లా కొంచెం దూరం వెళ్ళినట్లే వెళ్ళి, చటుక్కున వెనక్కి తిరిగి వచ్చేసాడు. వెనక తలుపు నుండి ఇంట్లోకి వచ్చి దాక్కున్నాడు. కొంచెం సేపటికి బయటి తలుపు శబ్దం అయ్యింది. ఎవరో తాళం పగుల గొడుతున్నారు! లోపలి గదిలో సూట్‌కేసుకు దగ్గర్లోనే ఓ దుడ్డు కర్రను పట్టుకొని తయారుగా నిల్చున్నాడు రాజు. కొద్ది సేపటికి తాళం పగిలింది- మెల్లగా తలుపు తెరచుకొని ఇంటిలో అడుగు పెట్టాడు- సోను!!

అతన్ని చూసి రాజు నిర్ఘాంతపోయాడు. ఆ నమ్మక ద్రోహాన్ని తలచుకున్నకొద్దీ అతని రక్తం మరిగింది. దొంగవాడు సూటుకేసుని పగలగొట్టేందుకు కూర్చోగానే దుడ్డుకర్రతో అతని నెత్తిమీద ఒక్కటిచ్చిన రాజు, ఆ వెంటనే అతన్ని వెనక వైపు నుండి గట్టిగా పట్టేసుకొని "దొంగ! దొంగ!!" అని అరిచాడు. ఆ అరుపులకు చుట్టుప్రక్కల వాళ్లంతా వచ్చారు. అందరూ కలిసి సోనూను పోలీసులకు అప్పగించారు.

ఎవరికీ చిక్కకుండా దొంగతనాలు చేస్తూ పోతున్న సోనును తెలివిగా పట్టించిన రాజును పోలీసులు అభినందించారు.