అయోధ్యకు యువరాజు రాముడు, 'సాక్షాత్తు విష్ణువు అవతారమే' అని చెప్పుకునేవాళ్ళు.
ఇంకా పిల్లవాడుగా ఉండగానే ఆయన తాటకి అంతటి గొప్ప రాక్షసిని హతం చేసాడు. విశ్వామిత్రుడి యాగాన్ని అడ్డుకుంటున్న సుబాహుడిని చంపేసాడు; మారీచుడిని ఏడు సముద్రాల అవతలికి విసిరేసాడు.
అట్లా ఆయన విశ్వామిత్రుడి వెంట నడుస్తూ పోతుంటే, గౌతమఋషి ఆశ్రమం దగ్గర ఆయన పాదం సోకిన ఓ బండరాయి కాస్తా చక్కని యువతిగా మారిపోయింది!
ఆమె అహల్య- స్వయానా గౌతమఋషి భార్య; అయితే శాపం కారణంగా చాలా కాలంగా ఆమె అలా రాయిలా పడి ఉండింది; గౌతముడు కూడా ఆ ఆశ్రమాన్ని విడిచి పెట్టేసి మరో చోటుకు వెళ్ళిపోయాడు. ఇంత కాలానికి, రాముడి పాదం సోకటం వల్ల ఆమె శాపం తీరింది. రాముడికి ధన్యవాదాలు చెప్పుకొని, తిరిగి గౌతముడి దగ్గరికి వెళ్ళిపోయింది ఆమె.
ఈ ఉదంతం ఆ నోటా ఈ నోటా చుట్టు ప్రక్కల అందరికీ పాకింది. శ్రీరామ పాదపు గొప్పతనం గురించి ప్రజలంతా కథలు కథలుగా చెప్పుకోసాగారు.
ఆ తర్వాత కొన్నేళ్లకు రాముడు, సీత, లక్ష్మణుడు వనవాసానికి పోతూ గంగానది ఒడ్డుకు చేరుకున్నారు.
అక్కడికి దగ్గర్లో 'శృంగిబేరపురం' అనే ఊరు ఉంది. 'గుహుడు' అనే యువకుడు ఒకడు అక్కడ గంగమీద పడవ నడుపుకుంటూ ఉన్నాడు. చూడగానే గుహుడు రాముడిని గుర్తుపట్టాడు- చాలా గౌరవించాడు. అడవిలో దొరికే పండ్లు,తేనె అర్పించి మ్రొక్కాడు; 'నేను నీకు ఏం సేవ చేయాలో చెప్పు' అన్నాడు.
"పెద్ద పని ఏమీ కాదు- కాస్తంత ఈ గంగ దాటించు, చాలు-"అన్నాడు రాముడు.
గుహుడు కొంచెం సంకోచించినట్లు అనిపించాడు. తటపటాయిస్తున్నట్లు, ఇలా అన్నాడు:
"పాదాంబుజం తే విమలం హి కృత్వా
పశ్చాత్ పరం తీరమహం నయామి |
నో చేత్తరీ సద్యువతీ మలేన స్యాచ్చేత్
విభో విద్ధి కుటుంబ హానిః ||"
"-ఓ రామయ్యా! నీ పాదం తగిలి, ఇదివరకే ఓసారి రాయి కాస్తా అమ్మాయిగా మారింది. ఇప్పుడు మళ్ళీ నా పడవ కూడా అమ్మాయిలా మారిందనుకో, అప్పుడు నాకు రెండు కష్టాలు: ఒకటి - పడవ పోతే, నా జీవనాధారం పోతుంది. రెండు - పడవ అమ్మాయిగా మారి, ఆ అమ్మాయిని ఇంటికి తీసుకెళితే నా భార్య నన్ను తరిమేస్తుంది. అందుకని, ముందు నీ పాదాలు రెండూ బాగా కడుగనివ్వు. ఆ తర్వాత నా పడవని ఎక్కుదువుగాని" అని.
తన కోరికను అంత చక్కగా వెలువరించిన గుహుడిని రాముడు కరుణించాడు. మనసారా శ్రీరాముని పాదాలను కడిగి ధన్యుడయ్యాడు గుహుడు.