డొనాల్డ్ ట్రంప్
నాలుగేళ్ల కొకసారి జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అనూహ్యంగా విజయం సాధించి, అమెరికాకు నలభై ఐదవ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.
డెభ్భై సంవత్సరాల ట్రంప్ ప్రధానంగా రియల్ ఎస్టేట్ వ్యాపారి. అనేక ఆకాశ హర్మ్యాలు, జూదశాలలు, రిసోర్ట్‌లు, గోల్ఫ్ క్రీడాంగణాలు నిర్మించిన ట్రంప్, తరువాతి కాలంలో హోటల్ వ్యాపారంలోకి, మంచి నీళ్ల వ్యాపారంలోకి, ట్రంప్ యూనివర్శిటీ ద్వారా విద్యా వ్యాపారంలోకి, చివరికి విమానరంగంలోకి కూడా ప్రవేశించాడు. అమెరికాలోని అత్యంత ధనికులలో డొనాల్డ్ ట్రంప్‌ది 113 వ స్థానం.
"అమెరికాకి పూర్వ వైభవం" అనే నినాదంతో అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ విధానాలు అమెరికన్ల మీదే కాక మిగిలిన ప్రపంచ దేశాల మీద కూడా అమితమైన ప్రభావం చూపనున్నాయి.
'అమెరికాలో పెరిగిన నిరుద్యోగానికి బయటిదేశాలనుండి వచ్చిన వలస దారులే కారణం' అని నమ్మే ట్రంప్, విదేశాలనుండి అమెరికాలో పనిచేసేందుకు, చదువుకునేందుకు వెళ్ళిన/ వెళ్దామనుకుంటున్న ఔత్సాహికుల ఆశలపై నీళ్లు కుమ్మరిస్తున్నాడు. ట్రంప్ నిర్ణయాల నేపధ్యంలో మన యువతరం కూడా తన "డాలర్ డ్రీమ్స్" ని ఒట్టి 'డ్రీమ్స్' గానే ఉంచుకోవాల్సి రావచ్చని విశ్లేషకుల అంచనా.
ప్రపంచ వ్యాప్తమైన తీవ్రవాదానికి ముస్లింలను బాధ్యుల్ని చేస్తూ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు అనేక దేశాలను కలవరపెడుతున్నాయి. తాజాగా ఏడు ముస్లిం దేశాలు- ఇరాక్, ఇరాన్, సిరియా, సోమాలియా, సూడాన్, లిబియా, యమన్-ల నుండి "ఎవ్వరూ అమెరికాకు వలసపోయేందుకు వీల్లేదు" అని ట్రంప్ తీసుకున్న నిర్ణయం ప్రపంచ దేశాలన్నింటిని ఒక కుదుపు కుదిపింది.
"అమెరికాలో తయారు చేయండి; లేదా భారీ మూల్యం చెల్లించుకోండి!” అంటూ కార్ల కంపెనీలకు ట్రంప్ చేసిన హెచ్చరికల ఫలితంగా "మెక్సికోలో చవకగా కార్లు తయారు చేసి అమెరికాలో లాభానికి అమ్ముకుందాం" అనుకున్న కంపెనీలు కష్టాలపాలయ్యాయి.
ప్రధానంగా అమెరికా మీద ఆధారపడిన మన ఐ. టి. రంగానికి ప్రస్తుతం ట్రంప్ ఎన్నిక పెద్ద దెబ్బే కావచ్చు.
పి వి సింధు
2016 రియో-డి-జెనిరో ఒలింపిక్స్‌లో షటిల్ బాడ్మింటన్ క్రీడలో రజత పతకం సాధించిన పూసర్ల వెంకట సింధు అచ్చమైన మన తెలుగు బిడ్డ. ఇరవై ఒక్క ఏళ్ల సింధూను 2015లోనే భారత ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చి గౌరవించింది.
సింధు వాళ్ల అమ్మా నాన్నలు వాలీబాల్ ఆటగాళ్లు. వారి ప్రోత్సాహంతో సింధు చిన్నప్పటి నుండి షటిల్ బ్యాడ్మింటన్ నేర్చుకోవటం మొదలుపెట్టింది. ప్రసిద్ధ ఆటగాడు గోపిచంద్ హైదరాబాద్‌లో నిర్వహించే అకాడమీలో చేరి, ఆమె బ్యాడ్మింటన్‌లోని మెళకువలు సాధన చేసింది. అకాడమీ సింధు వాళ్ల ఇంటి నుండి యాభై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉండేదట! అయినా ఆమె క్రమం తప్పకుండా రోజూ ఆట నేర్చుకునేందుకు వెళ్లేది.
'క్రీడలంటే మక్కువ, ఏదైనా సరే నేర్చుకోవాలనే పట్టుదల ఉన్న పిల్లలకు సరైన ప్రోత్సాహం, మంచి శిక్షణ అందిస్తే వారు దేన్నైనా సాధిస్తారు' అని సింధు ఋజువు చేస్తున్నది.
< br>