రవి, అంజి ఇద్దరూ మంచి స్నేహితులు. ఎదురెదురు ఇళ్ళలోనే ఉండేవాళ్ళు. కలిసి అడుకునేవాళ్ళు; కలిసి తినేవాళ్ళు; కలిసి బడికి వెళ్లడం, కలిసి హోంవర్క్ చేసుకోవటం- ఇట్లా అన్నింటా కలిసి ఉండేవాళ్ళు. వాళ్ల ఇళ్లు వేరు; శరీరాలు వేరు; కానీ 'మనసులు ఒకటే' అన్నట్లు ఉండేవాళ్ళు.
ఇలాంటి వీళ్ళ స్నేహాన్ని చూసి కృష్ణకు అసూయగా ఉండేది. కృష్ణ వాళ్ళు వీళ్ల బజారులోనే, అటు ప్రక్క ఇంట్లో ఉంటారు. వీళ్లు ముగ్గురూ ఒకే తరగతిలో చదువుతున్నారు: రవి, అంజీ- కృష్ణ. వీళ్ళిద్దరూ కృష్ణతో బాగానే మాట్లాడుతారు, కానీ కృష్ణ మటుకు వీళ్ళతోటే కాదు, అసలు ఎవ్వరితోనూ సరిగ్గా కలవడు. వీళ్లను చూసినప్పుడల్లా "అబ్బా అబ్బా! ఏమి రాసుకొని, పూసుకుంటున్నారో!" అని మనసులో కుళ్లుకునేవాడు కృష్ణ. "ఎలాగైనా సరే, వీళ్ళిద్దరినీ విడదీయాలి!" అని ఎప్పుడూ అలోచిస్తూ ఉండేవాడు.
అందుకే వాళ్లు ఎవరు పలకరించినా కసురుకుంటూ ఉండేవాడు. అయితే, ఒకసారి ఏమైందంటే, బడికి వచ్చేటప్పుడు కృష్ణ పెన్ను మర్చిపోయి వచ్చాడు. వాడు ఇప్పుడు నోట్సు రాసుకోవాలంటే పెన్ను లేదు. ఎప్పుడూ కసురుకునే కృష్ణను చూసి బళ్లో ఎవరూ ఏమీ ఇచ్చేవారు కాదు. మరి వీడు కూడా అంతే; ఎవరినీ ఏమీ అడిగేవాడు కూడా కాదు! రవి, అంజిలను అడిగితే ఇస్తారు గానీ, 'వాళ్ళని అడిగితే ఎలా?' అని అడగడు. లెక్కల సారు వస్తే కొడతాడేమోనని భయం. బాధ. 'సార్ వస్తే తిట్లు తప్పవు.. ఏమంటాడో, ఏమో?!' అనే భయం వాడి మొహంలో కనబడుతున్నది.
ఈ విషయం రవి గమనించాడు: "అయ్యో! వీడేదో టెన్షన్‌లో ఉన్నట్లున్నాడే!" అని, "కృష్ణా! ఏంట్రా? అలా ఉన్నావు? ఏమయ్యింది?" అని ప్రేమగా అడిగాడు.
"ఏం లేదులే. అయినా నీకెందుకే?!" అని కసురుకున్నాడు కృష్ణ.
వాడి సంగతి తెలిసిన రవి, వాడి ప్రక్కవాళ్లను అడిగి విషయం తెలుసుకున్నాడు. తన దగ్గర ఉన్న రెండు పెన్నులలో ఒక దాన్ని తీసి కృష్ణకు ఇవ్వబోయాడు చిరునవ్వుతో. అభిమానంతో కృష్ణముఖం ఎర్రబడింది. "నీ సాయం నాకేమీ అవసరం లేదు" అని చెప్పబోయాడు. అయితే అంతలోనే లెక్కల సారు అప్పుడే క్లాసులోకి వస్తూ కనిపించాడు. తప్పనిసరి పరిస్థితి.. తను అటు పెన్ను తీసుకున్నాడు; ఇటు సారు లోపలికి అడుగు పెట్టాడు.
ఆ తరువాత బడి వదిలేంతవరకూ కృష్ణ మనసులో ఆలోచనలు రేగాయి. 'నేను వీళ్లను శత్రువుల్లాగా చూసినా, వీళ్ళు మాత్రం నన్ను స్నేహితుడి లాగే చూస్తున్నారు' అని కృష్ణకు అర్థమయ్యింది. 'వీళ్ళు నాపట్ల మంచితనాన్నే ప్రకటిస్తున్నారు..కానీ తనేం చేస్తున్నాడు? తన ప్రవర్తనతో వీళ్ళను ప్రతిసారీ చిన్నబుచ్చుతున్నాడు!"
తెలియకుండానే అతని కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆ రోజంతా బడిలో కాస్త ముభావంగానే ఉన్నాడు కృష్ణ.
సాయంత్రం ఇంటికి వెళ్ళాక, రవి-అంజిలు కలిసి హోంవర్క్ చేసుకుంటుంటే, దగ్గరికి వెళ్లాడు. "సారీ, రవీ! నేను మీతోటి చాలా కఠినంగా మాట్లాడుతూ వచ్చాను. నన్ను క్షమించు" అన్నాడు.
అతనిలోని మార్పును అర్థం చేసుకున్న అంజి, రవి ఇద్దరూ కృష్ణను సమాధాన పరచారు. "ఏమున్నదిరా, స్నేహితుల మధ్య క్షమాపణలేవీ అక్కర్లేదు. కలిసి సంతోషంగా ఉందాం, ఒకరికొకరం సాయం చేసుకుందాం" అని చెప్పారు. ఆ తర్వాత ఇక ముగ్గురూ మంచి స్నేహితులు అయ్యారు!