అనగనగా ఒక పొలం కాపు, తన పొలంలో తెల్లజొన్న వేశాడు. అది కాపుకొచ్చింది. జొన్న కంకులు గుత్తులు కట్టుకొని మినమిన లాడుతున్నాయి.

సరిగ్గా ఆ సమయంలో పంటను ఆశించినై, చాలా గువ్వలు- అన్నీ గుంపులు గుంపులుగా కంకులమీద వాలినై. లేలేత- పాల విత్తనాలను కొట్టేయటం మొదలెట్టాయి.

ప్రతి సారీ ఇట్లాగే జరుగుతూంది పొలం కాపుకి. ఈ పిట్టలతో అతనికి మా పెద్ద తంటా వచ్చిపడింది- ఎక్కడలేని నష్టం కలిగిస్తున్నాయవి. కంకులు తయారైన-ప్పటినుండి పొలంకాపుకి ఈ పిట్టలతో ఒకటే బాధ- కొందరు సలహా ఇచ్చారు: పంటకు పురుగు మందులు చల్లమని. కానీ పొలం కాపు పాపం, చాలా మంచివాడు. అట్లా చేస్తే గువ్వలు చచ్చిపోతాయని అతనికి తెలుసు. అదీగాక 'అట్లాంటి జొన్నలు తింటే మనుషులు కూడా చాలా రోగాల బారిన పడతారు' అని అతను వాళ్ళ మాటలు పట్టించుకునేవాడు కాదు.

కానీ ఈ‌ పిట్టలతో వేగేది ఎలాగ? బాగా ఆలోచించి, అతను పొలం మధ్యన, ఎత్తుగా కంచె ఒకటి ఏర్పాటు చేసాడు. దానిపైకెక్కి నిల్చుని, గట్టిగా అరుస్తూ, చేత్తోటి రాళ్ళు విసురుతూ గువ్వల్ని తోలటం మొదలు పెట్టాడు.

మంచె మీద ఓ రేకు డబ్బా పెట్టుకొని, దానిపైన కర్రతో కొడుతూ డబడబా శబ్దం చేసేవాడు. ఆ శబ్దానికి భయపడి గువ్వలు ఎగిరి పోయేవి- కానీ కొంచెం సేపు అటూ ఇటూ తిరిగాక, వాటి భయం తగ్గగానే మళ్ళీ వచ్చి కంకులమీద వాలేవి. ఇట్లా ఆ గువ్వల వ్యవహారం సాగుతూ పోయేది.

ఒక్కోసారీ అతను ఒక వడిసెల తీసుకొని, దానిలో రాయి పెట్టి, వడిసెలను గుండ్రంగా తిప్పి, రాయిని పొలం మీదికి విసిరేవాడు.

అలాంటి రాళ్ళు వేగంగా ఆకాశంలో శబ్దం చేస్తూ పోతుంటే, 'అవి వచ్చి తమకు తగిల్తే ఎలారా దేవుడా' అని భయంతో గువ్వలు దూరంగా ఎగిరి పోయేవి. అయినా ఒక సారి వడిసెల తిప్పటం ఆపగానే అవన్నీ తిరిగి వచ్చి జొన్న కంకులమీద వాలుతూనే ఉండేవి.

ఒకసారి అతను అట్లా వడిసెలలో పెట్టి విసిరిన రాయి జివ్వుమంటూ పోయి, పొలం చివరన ఉన్న జువ్విచెట్టు గుబురులో పడింది. ఆ జువ్వి చెట్టు గుబుర్లోనే, కొంతకాలంగా ఓ పావురాల జంట నివసిస్తూ ఉంది. రైతు విసిరిన రాయి పోయి తటాలున ఒక పావురానికి తగిలింది.

ఆ దెబ్బకు పాపం ఆ పావురం రక్తం ఓడుతూ, పట్టు తప్పి, క్రింది కొమ్మకు జారి, కొమ్మల గుబురులో చిక్కుకొని, బాధతో రెక్కలు టపటపలాడిస్తూ అరవ సాగింది. దాని ప్రక్కనున్న పావురం కూడా గోలగోలగా అరుస్తూ దాని చుట్టూ తిరగటం మొదలు పెట్టింది.

దూరం నుంచి ఆ సన్నివేశాన్ని చూశాడు పొలం కాపు. వెంటనే మంచె దిగి, పావురాలున్న జువ్వి చెట్టు వైపుకు పరుగెత్తి పోయాడు అతను. గాయపడ్డ పావురం కొద్ది ఎత్తులోనే ఇరుక్కొని ఉన్నది. అయితే ఆ జువ్వి చెట్టు క్రిందే ఒక నాగు పాము పుట్ట కూడా ఉంది! పావురాన్ని అందుకునే తొందరలో ఉన్న కాపు, పుట్ట సంగతి మరచే పోయాడు. ముందు-వెనుక ఆలోచించకుండా, నేరుగా పుట్టను ఎక్కి పావురాన్ని అందుకోబోయాడు!

పుట్టలో పాము నిద్ర పోతున్నది. కాపు కాలు మోపే సరికి ఆ పుట్ట కాస్తా కూలింది. దాంతో బాటు పాముకు నిద్రాభంగం కూడా అయింది! వెంటనే అది కోపంతో బుసలు కొడుతూ బయటికి వచ్చింది. రైతుని చూసి పడగ విప్పి కాటు వేయబోయింది. కానీ దెబ్బతిన్న పావురాన్ని అందుకుంటూ అటు తిరిగి ఉన్న రైతు దాన్ని అసలు చూడనే లేదు!

అయితే వేదనతో అరుస్తూ అక్కడంతా కలయ తిరుగుతున్న పావురం మటుకు కాటు వేయబోతున్న ఆ పామును చూసింది. చటుక్కున పాము మీదికి దూకింది; దాన్ని కాలి గోర్లతో రక్కుతూ, ముక్కుతో పొడుస్తూ పోరాటం మొదలు పెట్టింది.

ఆలోగా గాయపడిన పావురాన్ని చేతిలోకి తీసుకున్నాడు రైతు. ఆలస్యంగానైనా పాముని, పావురాన్ని చూసాడు. దూరంగా పరిగెత్తాడు. తొందరపాటుతో పుట్టమీదికి ఎక్కటాన్ని తలచుకొని సిగ్గు పడ్డాడు. తనను కాపాడిన పావురం పట్ల అతనిలో కృతజ్ఞత పెల్లుబికింది.

గాయపడిన పావురాన్ని మంచె మీదికి తీసుకెళ్ళి, తనకు తెలిసిన ఆకు పసరులు నూరి కట్టుకట్టి, చికిత్స చేసాడు. కొన్నాళ్లపాటు ఆ పావురాన్ని తన మంచె పైనే ఉంచుకున్నాడు. దాని అదృష్టం బాగుంది- తగిలిన గాయం మానిపోగా, క్రమ క్రమంగా మామూలు స్థితికి వచ్చింది.

ఆ నాటి నుండి పావురాలు నిర్భయంగా అతని దగ్గరికి రావటం, మంచెపై వాలటం మొదలెట్టాయి. పొలం కాపు వాటితో తన కష్ట సుఖాలు చెప్పుకునేవాడు. అవి కూడా ఏవేవో రాగాలు తీస్తూ అతనికి బదులిచ్చేవి. మరి పావురాలు పిట్టలకు ఏం చెప్పాయో గాని, ఆశ్చర్యం- రైతు పొలానికి పిట్టల తాకిడి లేకుండా అయ్యింది!

మంచి మనసుగల వారికి మంచి స్నేహితులు లభిస్తారు. మనం చూపే ప్రేమాభిమానాలను బట్టి వాళ్ళు కూడా మనపై ఆప్యాయతని వర్షింపజేస్తారు.