చాలా ఏళ్ల క్రితం- కలియుగం ప్రారంభంలో, ఒకానొక గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. అతను చాలా నిజాయితీ పరుడు. మెల్ల మెల్లగా డబ్బును కూడబెట్టి, చివరికి ఒక భూస్వామినుండి కొంత భూమిని కొనుక్కున్నాడు. భూమి పూజ చేసాక, భార్య-కూతురు సాయంచేస్తుండగా, తను కొత్తగా కొనుక్కున్న ఆ భూమిని దున్నటం మొదలు పెట్టాడు.

అకస్మాత్తుగా 'ఖణేల్'మని శబ్దం వచ్చింది. నాగలి దేనికో తట్టుకొని ఆగిపోయింది. 'ఏదో బండ అయి ఉంటుంది' అనుకున్న రైతు, నాగలిని తప్పించి, అక్కడ త్రవ్వాడు. అతని కుమార్తె అక్కడి మన్నుని తొలగించి చూసింది- ధగ ధగా మెరిసే బంగారు నాణాలతో నిండిన రాగి బిందె ఒకటి కనిపించిందక్కడ!

దాన్ని చూసి రైతు, అతని భార్య-బిడ్డ ముగ్గురూ నిశ్చేష్టులైపోయారు. ఈ రోజుల్లోనైతే 'భూమిలో దొరికే ప్రతి నిక్షేపమూ ప్రభుత్వానికే చెందుతుంది' అని చట్టాలు ఉన్నాయి. కానీ ఆరోజుల్లో అలాంటివేమీ లేవు. రైతు చప్పుడు చేయకుండా దాన్ని మొత్తాన్నీ కైవశం చేసుకుంటే ఎవ్వరూ అడిగే వాళ్ళు లేరు!

కానీ నిజాయితీగల ఆ రైతు బంగారాన్ని సొంతం చేసుకునేందుకు ఇష్టపడలేదు. "మనం భూస్వామి దగ్గర కొన్నది భూమిని మాత్రమే; లోపల దొరికిన సంపదని కాదు కదా! మనకి దొరికిన ఈ లంకెబిందె భూస్వామిదే అయి ఉండాలి" అన్నాడు.

"అవును. మనది కాని సొత్తుని మనం తీసుకోకూడదు. ఈ బిందెను నా తలపైకి ఎత్తు- తీసుకెళ్ళి భూస్వామికి ఇచ్చి వద్దాం" అన్నది రైతు భార్య.

సరేనని రైతు బిందెను ఎత్తుతుండగా రైతు కుమార్తె అన్నది- "నాన్న గారూ! రాగి బిందెను నేను మొదట చూశాను. కనుక ఆ బిందెను నేను ఎత్తుకుంటాను" అని.

"నువ్వు చిన్న దానివి కద తల్లీ, ఇటువంటి బరువు పని నీకు ఎందుకు?" అన్నాడు తండ్రి.

"నాన్న గారూ! నేను పాలు, పెరుగు, మీగడ, నెయ్యి సమృద్ధిగా తిన్నదాన్ని. కనుక నాకు చాలా బలం ఉంది" అని రైతు కుమార్తె ఆ బిందెను ఎత్తి తన తలపైన పెట్టుకున్నది.

అట్లా వాళ్లు ముగ్గురూ భూస్వామి ఇంటికి వెళ్లారు.

రాగి బిందెను మోసుకొని వస్తున్న రైతు కుమార్తెను చూసి భూస్వామి అడిగాడు- "ఏమి జరిగింది తల్లీ?!" అని. రైతు భూస్వామికి సంగతంతా చెప్పి, "భూమిని త్రవ్వింది నేను, నాకు సాయం చేసింది నా భార్య, బిందెని మొదట చూసింది నా కుమార్తె. ముగ్గురం కలిసి, సమ్మతంగా నీ‌ సొత్తును నీకు తెచ్చి ఇస్తున్నాం. స్వీకరించు" అన్నాడు.

భూస్వామి ఆలోచనలో పడ్డాడు. "అట్లా కుదరదు గదా; నేను భూమిని నీకు అమ్మేసాను. ఇక దానితో నాకు ఏలాంటి సంబంధమూ ఉండదు. ఆ భూమికి యజమానివి నువ్వే. ఆ భూమిలో లభించినది ఏదైనా నీకే సొంతం అవుతుంది. ఈ బిందెను నువ్వు నాకు ఇవ్వాల్సిన అవసరం ఏమాత్రం లేదు. అది పూర్తిగా నీదే" అన్నాడు.

రైతు దానికి అభ్యంతరం చెప్పాడు: "నేను భూమిని మాత్రమే కద, కొన్నది?! భూమిలో లభించిన లంకెబిందెను తీసుకునే అధికారం నాకు ఎలా వస్తుంది? ఈ బిందె మీకే చెందాలి" అన్నాడు. వివాదం పెద్దదైంది.

అక్కడ చేరినవాళ్ళు ఎవ్వరూ ఈ సమస్యను పరిష్కరించలేకపోయారు. దాంతో అందరూ కలిసి ప్రభువైన ధర్మరాజు వద్దకు వెళ్ళారు.

రైతు నిజాయితీని, భూస్వామి ధర్మ నిరతినీ మెచ్చుకున్నాడు ధర్మరాజు. "నా రాజ్యంలో మీలాంటి వాళ్ళు ఉండడం నాకు గర్వకారణం. అయితే ఈ సమస్య చాలా జటిలమైనది. ఏ విధంగా పరిష్కరించినా సూక్ష్మమైన ధర్మానికి నష్టం వాటిల్లే అవకాశం ఉన్నది. అందువల్ల, మరి- ఇరు పక్షాల వాళ్ళూ నా తీర్పుకు కట్టుబడి ఉంటామని మాట ఇస్తే, అప్పుడు నా అభిప్రాయాన్ని వెలువరిస్తాను"అన్నాడు.

రెండు కుటుంబాల వాళ్ళూ, "మీరు ఎట్లా చెబితే అట్లా చేస్తాం" అన్నారు.

"సరే! అయితే నా తీర్పు వినండి. రైతు కుమార్తెను భూస్వామి కుమారుడు వివాహమాడాలి. బంగారు నాణాలతో నిండిఉన్న ఈ రాగి బిందె, మీ వివాహ సందర్భంగా మీ తల్లిదండ్రులు మీకిస్తున్న బహుమతి అవుతుంది" అన్నాడు ధర్మరాజు. రాజుగారి తీర్పుకు అందరూ సంతోషించారు.