అనగనగా ఒక ఊళ్లో ఒక అబ్బాయి ఉండేవాడు. ఆ అబ్బాయి పేరు వినాయకుడు. తను ఒక మంచి అబ్బాయి. అందరూ కూడా 'తను చదువుకు సరైనోడు' అనేవాళ్ళు.

చక్కగా చదువుకునే వినాయకుడంటే అందరికీ ఇష్టమే. 'అ-ఆ' లు కూడా అందరికంటే ముందు నేర్చేసుకున్నాడు వినాయకుడు.

మరి ఇప్పుడు తన వయస్సు పది సంవత్సరాలు. ఈ సరికి రకరకాల పుస్తకాలు ఎన్నో చదివేసాడు. సాహసాల కథలు, దయ్యాల కథలు, దొంగల్ని పట్టుకునే కథలు అంటే వాడికి చాలా‌ ఇష్టం.

వినాయకుడు ఆటలు కూడా బాగా ఆడేవాడు. బలంగా కూడా తయారయ్యాడు. కానీ తనకు ఇష్టమైన ఆట చదరంగం. చదరంగంలో తను అందరినీ ఓడించేవాడు.

వాళ్లకి మార్చి నెలలోనే సెలవలు ఇచ్చేస్తారు. అట్లా వాళ్లకి ప్రతి ఎండాకాలంలోనూ రెండు నెలల సెలవులు దొరుకుతాయి. ఆ సమయాన్ని పిల్లలు తమకు నచ్చిన పనులు చేసేందుకు వాడుకుంటారు.

ఆ సెలవులలో ఒక రోజున, రోడ్డు మీద జనాలంతా గుంపుగా గుమిగూడి ఉండటం చూసాడు వినాయకుడు. వాళ్లలో కొందరు బాధ పడుతూ వెనక్కి వస్తున్నారు. మరి కొందరేమో నవ్వుతున్నారు.

"ఏమైందో ఏమో!" అని తను కూడా అక్కడికి వెళ్ళాడు. అంతలోనే అక్కడ తన మిత్రుడు శివ కనిపించాడు వినాయకుడికి. "ఏమైందిరా?" అని అడిగాడు శివని.

"నువ్వే చూడు- పాపం బాగా భయపడిన-ట్లున్నాడు. దయ్యాన్ని చూసాడట!" చెప్పాడు శివ.

"దయ్యాన్ని చూసాడా?!" అని వినాయకుడు తను కూడా ఆ గుంపులోకి దూరి చూసాడు. అక్కడ ఒక పెద్దమనిషి- వణుక్కుంటూ ఒక కుర్చీ మీద కూర్చొని ఉన్నాడు. అందరూ ఆయన్ని ఓదారుస్తున్నారు. కొందరేమో వేప ఆకులు తెచ్చి అక్కడంతా గాలిలో తిప్పుతున్నారు.

వినాయకుడు ఒకాయనను "ఏమైంది?" అని అడిగాడు. "ఇతను ఊరి చివరన ఉన్న ఆ పాడుపడ్డ కోట లోపలికి వెళ్లాడట. అక్కడ ఏవో విచిత్రమైన శబ్దాలు వినిపించాయట. వెనక్కి తిరగ్గానే ఒక దయ్యాన్ని చూసాడట- అట్లా చెబుతున్నారు అందరూ. ఆ కోటలోకి పోయిన వాళ్లంతా ఇవాల్టికీ అట్లా భయపడుతూనే వున్నారు- అసలు ఎందుకు పోతారో, ఏమో!" చెప్పి వెనక్కి తిరిగాడాయన.

వినాయకుడు కూడా ఆయన వెనకనే గుంపులోంచి బయటికి వచ్చాడు. అక్కడ శివ వాడికోసమే ఎదురు చూస్తూ ఉన్నాడు. "చూసావా?" అడిగాడు శివ.

"ఊఁ.. ఇందులో ఏదో‌ మెలిక ఉంది" అన్నాడు వినాయకుడు.

"ఏమై ఉంటుంది?" అడిగాడు శివ.

"మనం వెళ్ళి కోటలో ఆడుకుంటే తప్ప, నిజం ఏంటో తెలీదు- మరి ఆడటానికి వస్తావా?" శివ 'సరే' అన్నాడు. ఇద్దరూ బ్యాటు, బంతి పట్టుకొని కోట దగ్గరికి చేరుకున్నారు.

ఊరు చివరికి చేరుకుంటుండగా శివ అడిగాడు- "మనం నిజంగానే కోటలోకి వెళ్తున్నామా?!" అని.

"అనుమానం లేదు. ఖచ్చితంగా వెళ్తున్నాం" అన్నాడు వినాయకుడు.

శివ ఒకసారి వణికాడు- "ఏమో, నువ్వు అంత గట్టిగా చెబుతున్నావుగానీ, నాకైతే భయంగా ఉంది" అన్నాడు. "భయం ఏమీ లేదు. దయ్యాలు మనల్ని ఏమీ చెయ్యవు. నువ్వు శివుడివి, నేను వినాయకుడిని!" నమ్మకంగా చెప్పాడు వినాయకుడు.

వాళ్లు కోటలోకి పోయి ఆడటం మొదలు పెట్టారు.

చాలా సేపే గడిచింది గానీ దయ్యం ఏదీ వాళ్ల ముందుకు రాలేదు.

అయితే వాళ్ల ఆట ఇంకొంచెం సేపట్లో అయిపోతుందనగా వాళ్లకు విచిత్రమైన శబ్దాలు వినిపించటం మొదలెట్టాయి. శివ గబగబా వినాయకుడి ప్రక్కకు వచ్చి నిలబడ్డాడు. వినాయకుడేమో జేబులు తడుముకుంటూ నిల్చున్నాడు. కొద్ది సేపట్లోనే వాళ్ల ముందరికి వచ్చి నిల్చున్నది ఒక దయ్యం!!

వినాయకుడు జేబులోంచి చేతులు తీసాడు. శివకి ఏదో అందించాడు.

ఇద్దరూ ఒక్కసారిగా తమ చేతుల్లో ఉన్న కారపు పొడిని దయ్యం మీదికి చల్లి, ఊదటం మొదలెట్టారు.

అంతలో వినాయకుడు జేబులోంచి ఒక నిమ్మకాయ తీసి దయ్యం మీద పిండటం మొదలెట్టాడు. ఆశ్చర్యం, దయ్యం ఏమీ చెయ్యలేదు. ఊరికే అట్లా నిలబడ్డది.

అంతలోనే వాళ్లకు దయ్యం క్రింద మనిషి కాళ్లు కనబడ్డాయి.

ఇద్దరూ ఒకరి ముఖాలొకరు చూసుకొని, గబుక్కున దయ్యం మీదికి దూకారు. అది వేసుకున్న ముసుగును లాక్కున్నారు.
ఇప్పుడక్కడ, దయ్యం స్థానంలో ఎవరో ఒక పిల్లాడు- బిక్క మొఖం వేసుకొని నిలబడి ఉన్నాడు!

వినాయకుడు తన చేతిలోని బ్యాటుని ఎత్తి, వాడిని బెదిరిస్తున్నట్లు పెట్టి, అడిగాడు- "ఎందుకురా, నువ్వు ఎందుకు ఈ దయ్యం వేషం వేసి, జనాల్ని భయపెడ్తున్నావు?" అని.

ఆ పిల్లాడు ఒక క్షణం ఊపిరి పీల్చుకొని, ఇలా చెప్పాడు:

"మాది చాలా పేద కుటుంబం. మా అమ్మానాన్నలు బడి ఫీజులకు కూడా డబ్బులు ఇవ్వరు. అడిగితే పనికి పొమ్మంటారు- కానీ నాకేమో చదువు అంటే చాలా ఇష్టం. అందుకని ఇట్లా వేషం వేసుకోవటం‌ మొదలుపెట్టాను. ఇక్కడికి వచ్చిన వాళ్లు నన్ను చూసి పారిపోతూ వదిలేసిన వస్తువులను అమ్ముకుంటాను- అట్లా బడి ఫీజులు కడుతున్నాను.."

వినాయకుడికి చాలా బాధ వేసింది. "అయినా ఇట్లా ఇంకోళ్లని భయపెట్టటం మంచిపని కాదు కదా- ఒక పని చేస్తావా? మాతోబాటు రా. మా అమ్మా వాళ్లని పరిచయం చేస్తాను. వాళ్లు నీకు ఏమైనా సాయం చేస్తారేమో చూద్దాం. అయితే నువ్వు ఇంకెప్పుడూ ఇట్లా దయ్యం వేషం వేసి జనాల్ని భయపెట్టకూడదు!" అన్నాడు.

ఆ పిల్లాడి ముఖం వికసించింది. "సరే- నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఇంకెప్పుడూ దయ్యం వేషం వేయను" అని వాళ్లతోబాటు బయలు దేరాడు.

వినాయకుడు ఆ పిల్లాడిని తమ ఇంటికి తీసుకెళ్ళాడు. వినాయకుడు వాళ్ల అమ్మానాన్నలు ఆ పిల్లాడి చదువుకోసం ఎప్పటికప్పుడు సహాయం చేసారు! అటు తర్వాత కోటలో ఇంకెప్పుడూ దయ్యం అన్నదే కనిపించలేదు.