అనగనగా ఒక ఊళ్లో స్వాతి అనే అమ్మాయి ఉండేది. తనకు మాటలు రావు. మూగది. ప్రతి విషయం సైగలు చేసి చెప్పేది. కానీ ఆ పాప మొద్దు కాదు- చాలా తెలివైనది. ఏడవ తరగతి చదువుతన్నది; చదువులో ఎప్పుడూ మొదటి స్థానంలో ఉండేది. స్వాతికి నీరజ అనే ఒక స్నేహితురాలు ఉండేది. తను స్వాతిని అన్ని విషయాలలోనూ ప్రోత్సహించేది.

స్వాతి వాళ్ళ అమ్మానాన్నలు తనని చాలా ప్రేమించేవాళ్ళు. తను అడగకనే తనకేది ఇష్టమో గ్రహిస్తారు వాళ్ళు.

వాళ్ళ నాన్న తనకు చాలా సార్లు చెప్పేవాడు: "నువ్వు ఎప్పటికీ మాట్లాడలేక పోవచ్చు. అయినా ఏమీ నష్టం లేదు. నువ్వు బాగా చదివి, మంచి ప్రయోజకురాలివి అవ్వాలి" అని. స్వాతి వాళ్ల అమ్మ చెప్పేది: "నువ్వు ఎప్పుడూ నవ్వుతూనే ఉండాలి" అని. అమ్మానాన్నలంటే స్వాతికి చాలా ఇష్టం.

ఒకసారి స్వాతి, వాళ్ల అమ్మ ఇద్దరూ ఒక పుణ్యక్షేత్రానికి వెళ్లారు. శ్రద్ధాభక్తులతో ఎవరైనా తమ మనసులోని కోరికలను అక్కడి దేవుడికి చెప్పుకున్నట్లైతే, అవి తప్పక నెరవేరుతాయని ప్రజల విశ్వాసం. "స్వాతికి మాటలు రావాలి దేవుడా!" అని కోరుకున్నది వాళ్ల అమ్మ. ఆ క్షేత్రం గురించిన వివరాలన్నీ సేకరించి నోట్సులో రాసుకున్నది స్వాతి.

దర్శనం అయ్యాక ఇద్దరూ రైలు బండెక్కి ఇంటికి బయలుదేరారు. అయితే రైలులో స్వాతికి నిద్ర పట్టలేదు. ప్రక్కనే వాళ్ల అమ్మ మటుకు నిద్రపోయింది. కిటికీ ప్రక్కనే కూర్చొని, బయటి చీకట్లోకి చూస్తూ కూర్చున్నది స్వాతి. అంతలో రైలు బండి ఏదో చిన్న స్టేషనులో ఆగింది.

ప్లాట్‌ఫారంకి ఆవల చెట్లు గుబురుగా పెరిగి ఉన్నాయి. చిన్న కుక్క పిల్ల ఒకటి, అక్కడ "కుయ్..కుయ్" మని మొత్తుకుంటున్నది. స్వాతి కిటికీ తెరిచి, దాన్ని పిలిచింది. అది గట్టిగా పెనుగులాడింది: మరింత గట్టిగా మొత్తుకున్నది.

స్వాతికి దాని పరిస్థితి చూసి జాలి వేసింది. లేచి, తలుపు దగ్గరికి వెళ్ళి, చూసింది: కుక్క పొదలో ఇరుక్కు పోయి ఉన్నది! స్వాతి అటూ ఇటూ చూసింది- ఎవరైనా పెద్దవాళ్లు కనిపిస్తారేమోనని. అయితే ఆ సమయంలో అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. రైలేమో ఏమీ చప్పుడు చేయట్లేదు. ఇప్పట్లో కదిలేటట్లు అనిపించలేదు. దాంతో స్వాతి మెల్లగా రైలు బండి దిగి, ముళ్ళపొద దగ్గరికి పోయింది. జాగ్రత్తగా అందులో ఇరుక్కున్న కుక్క పిల్లను తప్పించింది. దాన్ని బయటికి తీసి వదిలిపెట్టింది.

కుక్కపిల్ల తోక ఊపుకుంటూ‌ పరుగు పెట్టాకగానీ గమనించలేదు స్వాతి- తను ఎక్కాల్సిన రైలు తన వెనకనుంచే నిశ్శబ్దంగా బయలుదేరి పోయింది! ఆ సరికే స్టేషను దాటి పోతున్నది! పోతున్న ఆ రైలు వెనకే ప్లాట్‌ఫారం చివరి వరకూ పరుగుపెట్టి, ఏడుస్తూ అక్కడే కూలబడింది స్వాతి!

ఇక అక్కడ, రైలులో స్వాతి వాళ్ల అమ్మగారికి తెల్లవారే వరకూ మెలకువ రాలేదు. నిద్రలేచి చూసుకుంటే పక్కన ఉండాల్సిన స్వాతి కనిపించలేదు! దాంతో వాళ్ల అమ్మగారు కంగారు పడ్డారు. రైలులో అంతటా వెతికారు. బిడ్డ ఎక్కడా కనిపించలేదు! ఆలోగా రైలు వాళ్ళ ఊరుకు చేరుకున్నది. ఆవిడ రైలు దిగి, స్టేషను మాస్టారుగారికి ఫిర్యాదు చేసారు. ఇంట్లో‌ ఉన్న భర్తకు ఫోను చేసి జరిగినదంతా చెప్పారు. వెంటనే ఆయనకూడా రైలు స్టేషనుకు వచ్చేసారు. రైలు ఏ ఏ స్టేషన్లలో ఆగుతుందో ఆయా స్టేషను మాస్టర్లందరికీ వరసగా ఫోన్లు చేయించారు.

ఇక అక్కడ, ప్లాటుఫారం చివరలో కూర్చొని ఏడుస్తున్న స్వాతిని చూసి "ఏమైంది?" అని అడిగాడొక పిల్లాడు. వాడి పేరు అరవింద్. వాడు ఐదో తరగతి చదువుతుండగా వాళ్ల అమ్మానాన్నలు ఇద్దరూ ప్రమాదంలో చనిపోయారు. అప్పటినుండి వాడు ఆ ఊర్లోనే ఉంటూ, జనాలకు ఆ పనీ, ఈ పనీ చేసి పెడుతూ ఉన్నాడు.

కానీ వాడు ఏమడిగినా స్వాతి ఏడుస్తున్నది తప్పిస్తే ఏమీ సమాధానం ఇవ్వలేదు. చివరికి వాడు- "ఇదిగో చూడు పాపా, నువ్వు తప్పిపోయావని నాకు అర్థమైంది; నిన్ను మీ ఇంటికి చేరుస్తాను ఎలాగైనా; అయితే మీ ఊరేదో, ఇల్లెక్కడో తెలియాలి కదా ముందు?!" అన్నాడు గట్టిగా.

దాంతో స్వాతి ఏడుపు ఆపి, సైగలు చేయటం మొదలు పెట్టింది. కొద్ది సేపటికిగానీ అరవింద్‌కు అర్థం కాలేదు- 'ఈ పాపకి మాట్లాడటం రాదు' అని. అప్పుడిక వాడు ఆ పాపకి ధైర్యం చెప్పి, స్టేషను మాస్టరు గారి దగ్గరికి తీసుకెళ్ళాడు. స్టేషను మాస్టరుగారికీ సైగల భాష రాదాయె!

అంతలో అరవింద్‌కి ఒక ఐడియా వచ్చింది: ఒక పెన్ను, కాగితం తెచ్చి స్వాతికి ఇచ్చి, 'మీ అడ్రసు, ఫోను నెంబరు రాయమ'న్నాడు. అప్పటివరకూ స్వాతి ఊరికే కంగారు పడుతూ ఉండింది కానీ, "ఇట్లా రాసి చూపచ్చు కదా" అని గుర్తుకే రాలేదు!

ఇక ఆ తర్వాత ఆలస్యం ఏమీ లేదు- స్టేషను మాస్టారుగారు వెంటనే స్వాతి వాళ్ళ ఊరి స్టేషను మాస్టారికి ఫోను కలిపారు. స్వాతి వాళ్ల అమ్మానాన్నలు ఆయన ముందే కూర్చొని ఉన్నారు కంగారు పడుతూ. సంగతి తెలియగానే వాళ్లకి ప్రాణం లేచి వచ్చినట్లయింది.

వెంటనే ఇద్దరు రైల్వే పోలీసులను వెంట బెట్టుకొని, వాళ్ళు స్వాతి దగ్గరికి చేరుకున్నారు. అంతవరకూ రైల్వేస్టేషనులో కూర్చొని అరవింద్‌తో సంతోషంగా ఆడుకుంటూ ఉన్నది స్వాతి-

అమ్మానాన్నల్ని చూసిన ఆనందంతో ఆ పాప కొద్దిసేపు మూర్ఛపోయింది! అది చూసి అమ్మానాన్నలు చాలా కంగారు పడ్డారు! కానీ, కొద్ది సేపటికి తేరుకున్న స్వాతి 'అమ్మా! నాన్నా! వీడు అరవింద్!' అని మాట్లాడటం మొదలెట్టేసరికి, ఆనందంతో పొంగి పోయారు వాళ్ళు. ఏనాటికీ మాట్లాడద-నుకున్న పాప ఎలా మాట్లాడిందో తెలీక ఆశ్చర్యంలో మునకలు వేసారు.

స్టేషను మాస్టరుగారు వాళ్ళకు అరవింద్‌ని పరిచయం చేసారు: "వీడు బలే తెలివైనవాడు సర్- వీడి వల్లనే మీ పాపని మీకు ఇంత త్వరగా అందించగలిగాం" అని, వాడి గురించి చెప్పారు.

స్వాతి వాళ్ల అమ్మానాన్నలకు కూడా అరవింద్ చాలా నచ్చాడు. వాళ్ళు కొద్ది సేపు స్వాతితో మాట్లాడి, స్టేషను మాస్టారు గారితో "ఇక్కడెవ్వరికీ అభ్యంతరం లేదంటే, మేం అరవింద్‌ని మాతో పాటు తీసుకెళ్తామండి- మా పిల్లవాడుగా పెంచుకుంటాం. చదువు చెప్పించి ప్రయోజకుడిని చేస్తాం!" అన్నారు.

ఊరి వాళ్లంతా కలిసి మాట్లాడుకొని, ఆ రోజు సాయంత్రమే అరవింద్‌ని స్వాతి వాళ్ల వెంట పంపారు. అట్లా అరవింద్‌కి మళ్ళీ ప్రేమాభిమానాలు, ఆప్యాయతలతో నిండిన కొత్త జీవితం దొరికింది; స్వాతికి మంచి అన్న దొరికాడు.

తర్వాతి కాలంలో అరవింద్‌ బాగా చదువుకొని గొప్ప డాక్టరై తన ఊరికీ, పెంచిన తల్లిదండ్రులకూ కూడా మంచి పేరు తెచ్చాడు! స్వాతి కూడా డాక్టరైంది- 'అన్నకు తగిన చెల్లెలు' అనేవాళ్లు, వాళ్లని చూసినవాళ్లంతా!