అనగనగా మంగపట్నంలో రాఘవయ్య అనే వ్యాపారి ఉండేవాడు. అరటి పండ్ల వ్యాపారం చేసేవాడు అతను. పచ్చి అరటిపళ్ళు తీసుకొచ్చి, వాటిని మహా భయంకరమైన రసాయనంలో ముంచి పెడితే, ఒక్క రాత్రిలో అవి ముచ్చటగొలిపే పసిడి రంగుకు తిరిగేవి. ఈ సంగతి తెలీని అమాయకులు రోజూ రాఘవయ్య అంగడిలో అరటిపళ్ళు కొనుక్కొని పిల్లలకు తినిపిస్తూండేవాళ్ళు.

రంగయ్య దుకాణానికి దగ్గర్లో ఒక పెద్ద జువ్వి చెట్టు ఉండేది. దాని మీద చాలా చిలకలు నివాసం ఉండేవి. దారిన పోయే జనాలు వాటిని చూసి ముచ్చటపడి తమ దగ్గరున్న పప్పులో, కాయలో కొన్ని ఆ చెట్టు మొదట్లో పెట్టి పోతుండేవాళ్ళు. వాటిలో‌ కొన్ని చిలకలు మనుషుల్ని చూసీ చూసీ వాళ్లలాగా మాట్లాడటం కూడా మొదలు పెట్టాయి.

ఒకసారి ఉరుములతో కూడిన పెద్ద వర్షం కురిసింది. రాఘవయ్య దుకాణం మూసి బయటికి వస్తుంటే చెట్టు క్రింద ఒక రామ చిలుక పడిపోయి కనిపించింది. దానికి బాగా గాయాలు అయి ఉన్నాయి! జాలిపడిన రాఘవయ్య, ఆ రామచిలుకను ఒళ్ళోకి తీసుకొని, కట్టుకట్టి, సపర్యలు చేసాడు.

కొద్ది సేపటికి అది తేరుకున్నది. రాఘవయ్యకు 'థాంక్స్' చెప్పింది. "ఏం జరిగింది?'అని అడిగాడు రాఘవయ్య. "ఎవరో ఒక అతను ఇక్కడే చాలా సేపు తచ్చాడాడు. నాకు అనుమానం వచ్చింది. ఎగిరిపోవాలనుకున్నాను. అంతలోనే అతను నన్ను గులేర్‌తో కొట్టాడు. అది తగిలేసరికి ఇలా కింద పడిపోయాను. అయితే అతనికి నేను ఎక్కడ పడ్డదీ తెలీలేదు. కొంచెంసేపు వెతికి, తిరిగి వెళ్లిపోయాడు" చెప్పింది చిలుక.

అటు తర్వాత అది రాఘవయ్యకు కొంచెం దగ్గరైంది. రోజూ సాయంత్రం సమయంలో వచ్చి దుకాణంలో కూర్చునేది; రాఘవయ్య ఏమైనా ఇస్తే తినేది; చిన్న చిన్నగా ముచ్చట్లు పెట్టేది. ఒకసారి అది వచ్చే సరికి కొళాయి నుంచి నీళ్ళు చుక్కలు-చుక్కలుగా కారుతున్నాయి. కొంచెం సేపు చూసి, "నీళ్ళు కట్టేయ్! నీళ్ళు కట్టేయ్!" అని అరిచింది చిలుక. రాఘవయ్య కుళాయి కేసి చూసి, "ఏం కాదులే!" అని, తన పని తను చేసుకుంటూ ఉండిపోయాడు.

చిలుకకి నీళ్ళు వృధా అవ్వటం ఇష్టం కాలేదు. 'ఏం చేద్దాం?' అని ఆలోచించింది. 'కడుపులో దాచుకుందాం- వృధాగా పోగొట్టేదెందుకు?'అని వెళ్ళి నీళ్ళు త్రాగటం మొదలు పెట్టింది.

కొద్ది సేపటికే దాని కడుపు నిండేసరికి, ఇక ఏం చేయాలో తోచలేదు. 'ఒంటెనైనా కాకపోతినే!' అనుకొని, చివరకు అ ప్రయత్నం నుండి విరమించుకున్నది.

అయితే అది చూస్తూండగానే నీళ్ల చుక్కలు ఆగాయి: ట్యాంకులో నీళ్ళు అయిపోయాయి. వెంటనే చిలకకు ఒక ఐడియా వచ్చింది. నేలమీద పడి తన్నుకుంటూ "దాహం-దాహం" అని అరవటం మొదలెట్టింది.

రాఘవయ్య గబగబా వచ్చి కుళాయి తిప్పి చూసాడు. నీళ్ళు లేవు! "ట్యాంకులో నీళ్ళు ఐపోయాయి" అని మోటారు వేయబోయాడు. కరెంటు లేదు! దాంతో‌ అతనికి ఇక ఏం చేయాలో‌ తోచలేదు. "కొంచెం‌ ఆగు- వేరే ఎక్కడైనా కాసిని నీళ్ళు దొరుకుతాయేమో చూసి వస్తాను" అని పోబోయాడు.

చిలుక లేచి కూర్చుని, "లేదులే, నాకు దాహం కాలేదు. నీకు బుద్ధి చెప్పడానికి ఇలా చేసాను. కుళాయిలో నీళ్ళు ఊరికే పోతుంటే సమస్య కదా!" అన్నది.

రాఘవయ్యకి కోపం వచ్చింది కానీ, "అది చెప్పింది మంచికే గదా" అని ఊరుకున్నాడు.

తర్వాత కొన్ని రోజులకు రాఘవయ్య కొడుకు, పన్నెండేళ్లవాడు, పట్నం నుండి వచ్చాడు. రాఘవయ్య వాడిని ముద్దు చేస్తూ, తను మామూలుగా అమ్మే అరటిపళ్ళు రెండు తీసి ఇచ్చాడు తినేందుకు. సరిగ్గా అదే సమయానికి ఎగురుకుంటూ‌ వచ్చిన చిలుక వాడి చేతిలోంచి పళ్ళు లాక్కొని, పైకెగిరిపోయి కూర్చున్నది!

రాఘవయ్యకి కోపం వచ్చి తిట్లు లంకించుకున్నాడు. అతన్ని పూర్తిగా తిట్టనిచ్చి, చిలుక శాంతంగా "చూడు, నువ్వు అమ్మే అరటిపండుని ఒకరోజు తిన్నందుకే నా కడుపులో భరించలేనంతగా మంటగా ఉండింది:

ఇక నువ్వు అమ్మే పళ్లను కొనుక్కొని తినే మనుషులకు ఏమేమి రోగాలు వస్తున్నాయో, వాళ్ళు ఎంత మంటను భరిస్తున్నారో తెలీదు.

పచ్చి కాయల్ని ప్రమాదకర రసాయనాలతో నింపి అమ్ముతున్నావే, వాటివల్ల జనాలకెంత కష్టమో ఆలోచించావా? అట్లా ఆలోచించి ఉంటే నీ కొడుక్కి ఈ పండ్లు పెట్టేవాడివా అసలు?! నేను ఈ పని చేసింది నీ కొడుకు క్షేమం కోసమే!" అన్నది.

ఆ మాటలు విని రాఘవయ్య హృదయం కంపించింది. తన తప్పుకు పశ్చాత్తాప- పడ్డాడు. చిలుకకు క్షమాపణ చెప్పుకొని, అటుపైన నీతిగా వ్యాపారం చేసుకున్నాడు. మంచి పనులు తన తోటే మొదలవ్వాలన్న నిజాన్ని తెలియజెప్పిన చిలుకకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకున్నాడు.