అనగనగా ఒక ఊళ్లో సోమయ్య అనే రైతు ఉండేవాడు. అతని భార్య కాంతమ్మ. వాళ్లకొక చిట్టి కూతురు -పేరు సుమతి. ఒక సంవత్సరం సోమయ్యకు వ్యవసాయంలో చాలా నష్టం వచ్చింది. పూట గడిచేందుకు కూడా డబ్బు లేదు. పులి మీద పుట్రలాగా
అదే సమయంలో కాంతమ్మ ఆరోగ్యం పాడైంది. ఆరు నెలలపాటు మంచంలో ఉండి ఆమె కన్ను మూసింది. సోమయ్య హతాశుడైనాడు. అయితే తరువాతి సంవత్సరం బాగా వానలు పడ్డాయి; అంతా కలిసి వచ్చింది. సోమయ్య మళ్ళీ మోతుబరి అయ్యాడు. సుమతి కోసం మళ్ళీ పెళ్ళి చేసుకొమ్మని చుట్టాలు పక్కాలు అందరూ పోరారు. వాళ్ల పోరు పడలేక,
ఒక్కడే సుమతిని సాకలేక, సూరమ్మని రెండో పెళ్ళి చేసుకున్నాడు సోమయ్య. సూరమ్మ ఘటికురాలు. వచ్చీ రాగానే సుమతి ఎలాంటిదో అంచనా వేసింది. సోమయ్య తత్వాన్ని అర్థం చేసుకున్నది. క్రమంగా ఇంటి ఆజమాయిషీని యావత్తూ తన చేతి క్రిందికి తెచ్చుకొని, సోమయ్యను తన గుప్పెట్లో పెట్టుకున్నది.
అప్పటివరకూ తల్లి లేకున్నా సుఖంగా బ్రతికిన సుమతికి పెద్ద పెద్ద కష్టాలు మొదలయ్యాయి. సుమతిని ఎన్నో బాధలు పెట్టేది సూరమ్మ. సుమతి చేతే వంట చేయించేది; గిన్నెలు తోమించేది; ఇల్లు అలికించేది; పశువుల పాకని శుభ్రం చేయించేది- ఒక్క క్షణం కూడా తీరికగా ఉండనిచ్చేది కాదు.
ఒకరోజు సూరమ్మ గుడికి వెళ్తూ, వంట పనిని సుమతికి పురమాయించింది- "ఇదిగో, నేను బయటికి వెళ్తున్నాను.
వచ్చేసరికల్లా వంట తయారు చేసి ఉంచు. ముందే చెబుతున్నాను- భోజనాన్ని వేరే ఎవరికీ దానం చెయ్యకు. ఏ ముష్టివాడికో వేసావంటే చెబుతాను- నా సంగతి నీకు తెలుసు కదా?! జాగ్రత్త!" అని బెదిరించి చక్కా పోయింది.
సరిగ్గా సుమతి వంట పూర్తయ్యే సమయానికి ఒక స్వామీజీ వచ్చాడు- "తల్లీ భిక్షాం దేహి!" అంటూ. "వద్దు- వద్దు" అనుకుంటూనే సుమతి వెళ్ళి తలుపు తీసింది. తలుపు తీసింది కాబట్టి ఇక ఆయన్ని లోనికి రమ్మన్నది. రమ్మన్నది కాబట్టి, 'ఇక భోజనం పెట్టకపోతే ఏం బావుంటుంది?' అని భోజనం పెట్టింది. స్వామీజీ చక్కగా భోజనం చేసి, సుమతిని దీవించి వెళ్ళిపోయాడు.
ఆయన అటు వెళ్ళాడో లేదో, ఇటు సూరమ్మ ఊడి పడింది. సుమతి ఇంకా తేరుకోకనే భోజనం వడ్డించమని చెప్పి కూర్చున్నది. చూస్తే గిన్నెలో అన్నం సగమే ఉంది! "నేను నీతో చెప్పానుగా, ఎవరికీ అన్నం పెట్టద్దని? ఇదేమైనా మీ తాతల సొమ్ము అనుకున్నావా?! నిన్ను భరించడం నా వల్ల కాదు. ఇంట్లోనుండి వెళ్ళిపో! అంతే!" అని కొట్టి, గెంటేసింది సుమతిని.
ఏడుస్తూ కనబడ్డ దారినల్లా పట్టుకొని పోయింది సుమతి. అట్లా పోతూ ఉంటే సాయంత్రం అయ్యేసరికి ఆ పాపకో పెద్ద మర్రిచెట్టు ఎదురయింది. చెట్టు చుట్టూతా మర్రి పళ్ళు పడి ఉన్నాయి. ఆ పాప కొద్ది సేపు వాటిని ఏరుకొని తిన్నది. కొన్నిటిని మూట కట్టుకున్నది.
అంతలోనే ఉరుములు, మెరుపులతో వర్షం కూడా మొదలైంది. దాంతో ఆ పాప గబగబా చెట్టు క్రిందికి చేరి వణుక్కుంటూ నిలబడ్డది. మెల్లగా చీకటి పడసాగింది; వర్షం ఆగేట్లు లేదు. చెట్టుకు అటువైపుగా ఓ తొర్ర ఉంది. సుమతి జాగ్రత్తగా ఆ తొర్రలోకి దూరి, ముడుచుకొని కూర్చున్నది. మెల్లగా నిద్రలోకి జారుకున్నది.
అర్థరాత్రి అవుతుండగా ఇద్దరు రాక్షసులు ఆ చెట్టు మీదికి వచ్చి వాలారు. వాళ్ళ బరువుకు చెట్టంతా అదిరినట్లైంది. సుమతి చటుక్కున లేచి కూర్చున్నది.
వాళ్లలో ఒకడు అన్నాడు "ఆకలిగా ఉందిరా. తినేందుకు ఏమైనా దొరికితే బాగుండు" అని.
"ఈ మధ్య మనకి సరైన ఆహారమే దొరకట్లేదు. ఇప్పుడు ఎవరైనా ఇటు వస్తే బాగుండు. కడుపునిండా తినచ్చు" అన్నాడు రెండోవాడు.
సుమతి చటుక్కున తొర్రలోంచి బయటికి వచ్చి, తన చేతిలోని మర్రి కాయల మూట వాళ్ళకేసి చాచింది- "ఇదిగో, ఇవి తినండి, బానే ఉన్నాయి. నేను తిన్నాను సాయంత్రం" అన్నది అమాయకంగా.
ఒక రాక్షసుడు చటుక్కున ఆ పాప మీదికి దూకబోయాడు. అయితే రెండోవాడు వాడిని వారించాడు. సుమతి మంచితనం, అమాయకత్వం రెండూ వాడిని కదిలించాయి. "ఏవీ, ఇటివ్వు పాపా!" అని, వాడు రెండు మర్రి పళ్ళు నోట్లో వేసుకున్నాడు. "అద్భుతం! భలే ఉన్నాయి!" అన్నాడు నవ్వుతూ.
"నేను చెప్పలేదా, ఇవిగో, నువ్వు కూడా తిను. ఊరికే ఆకలితో ఉండకూడదు" అంటూ మూటని రెండోవాడికి అందించింది సుమతి. "కావాలంటే నేను ఇంకొన్ని మర్రిపండ్లు ఏరి పెడతాను" అని కూడా చెప్పింది.
సుమతి మంచితనానికి రాక్షసులిద్దరూ మైమరచిపోయారు. వాళ్ళిద్దరూ సంధ్యాసమయం వరకూ ఆ పాపతో ముచ్చట్లు పెట్టుకొని, వాళ్ల ఇంటి సంగతులన్నీ అడిగి తెలుసుకున్నారు. తెలవారుతుండగా ఇక ఆ పాపను ఇంటికి వెళ్లమని, అక్కడున్న ఇసుకను ఓ నాలుగు గ్లాసులంత మూట కట్టి ఇస్తూ "ఇదిగో పాపా! ఇది తీసుకెళ్ళి మీ చిన్నమ్మకి ఇవ్వు. బంగారమని చెప్పు. నిన్ను బాగా చూసుకోవాలని కూడా మా మాటగా చెప్పు. సరేనా?!" అని ముద్దుచేసి, పంపారు.
ఇంటికి వెళ్లగానే సూరమ్మ "ఎక్కడ చచ్చావే, రాత్రంతా?! నువ్వు లేకపోతే గిన్నెలు ఎవరు కడుగుతారు?" అని తిట్లు లంకించుకున్నది.
"మర్రి చెట్టు దగ్గరికి. ఇదిగో ఈ ఇసుక మూటని నీకు ఇమ్మన్నారు. బంగారమట. నన్ను బాగా చూసుకోవాలని వాళ్ల మాటగా చెప్పమన్నారు" అంటూ తన చేతిలోని మూటని సూరమ్మకి అందించింది సుమతి.
"ఎవరు వాళ్ళు?!" అంటూ మూట విప్పిన సూరమ్మ ఆశ్చర్యంతో నోరు తెరిచింది. మూట నిండుగా బంగారు ఇసుక! ధగధగా మెరుస్తున్నది.
"ఎక్కడిదే, ఇది?" అని అడిగి సంగతంతా తెలుసుకున్నది సూరమ్మ. "అక్కడి ఇసుకంతా బంగారమేనట!" అనుకున్నది తప్పిస్తే, రాక్షసుల గురించి సుమతి చెప్పిందేదీ ఆమె తలకు ఎక్కలేదు. "పిచ్చిది, ఎవరినో చూసి 'రాక్షసులు' అనుకున్నది. రాక్షసులెందుకుంటారు, ఈ రోజుల్లో?!" అనుకున్నది.
సుమతికి రాత్రి మిగిలిన అన్నమూ, కూరలూ పెట్టి, "అక్కడికి వెళ్ళేందుకు దారేదే?" అని అడిగి కనుక్కున్నది. వెంటనే ఓ ఎద్దుల బండి కట్టుకొని, కావలసినన్ని సంచులు, పార గట్రా తీసుకొని "పిచ్చిది- ఇది వెళితేనే ఇంత బంగారం వచ్చిందే, నేను వెళితే చాలా బంగారం తెచ్చుకొవచ్చు!" అని దురాశ కొద్దీ బయలుదేరి పోయింది.
సాయంత్రం కల్లా మర్రి చెట్టు దగ్గరికి చేరుకొని, చెట్టు తొర్రలో దాక్కుంది. చీకటి పడ్డాక రాక్షసులు వచ్చి, చెట్టు మీదే పడుకొని నిద్ర పోయారు. వాళ్ళు నిద్రపోవటం చూసి నవ్వుకుంటూ బయటికి వచ్చింది సూరమ్మ. చూస్తే అక్కడి ఇసుకంతా బంగారు రంగులో మెరుస్తోంది! సూరమ్మ "ఓహో! నాకు ముందే తెలుసు ఈ సంగతి. వీళ్లదేమున్నది?!" అని తను తెచ్చుకున్న సంచుల్లోకి ఆత్రంగా ఇసుకని నింపుకోవటం మొదలెట్టింది.
అయితే ఇసకలో దుమ్ము ఉంటుంది కదా, అది కొంచెం ముక్కుల్లోకి పోయేసరికి సూరమ్మ ఇంక ఆపుకోలేక గట్టిగా ఒక్క తుమ్ము తుమ్మింది.
ఆ శబ్దానికి ఉలిక్కిపడి లేచిన రాక్షసులు "ఆహా! సూరమ్మా! నువ్వొస్తావని మాకు ముందే తెలుసు. నువ్వు లేకపోతేనే గదా, మా సుమతి పాప బాగుండేది! ఇదంతా నీ వల్లనే!" అని చటుక్కున సూరమ్మ మీదికి దూకి, గుటుక్కుమనిపించి, సంతోషంగా ఎగిరిపోయారు.
సుమతి కష్టాలు తీరాయి. వాళ్ల నాన్న మళ్ళీ మామూలు మనిషయ్యాడు. వాళ్ల ఇంట్లో మళ్ళీ ఓ సారి సంతోషపు పూలు పూశాయి.