అనగా అనగా ఒక ఊర్లో మారిక అనే అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి చాలా నల్లగా ఉండేది. కానీ, ఆ అమ్మాయికి చదువు అంటే చాలా చాలా ఇష్టం. అందుకే, ఇంట్లో తల్లిదండ్రులు వద్దంటున్నా వినకుండా డిగ్రీ దాకా చదువుకుంది. అయితే, ఆ అమ్మాయి నల్లగా ఉందని ఎప్పుడూ అందరూ వెక్కిరించేవారు. అలా ఎవరన్నా ఎగతాళి చేసినపుడల్లా ఏం చేయాలో అర్థం కాక, ఆ అమ్మాయి తనని తాను తిట్టుకునేది; ఎవరినీ ఏమీ అనకుండా తన పని తాను చేసుకుంటూ పోయేది.

ఒకరోజు వేరే వాళ్లు తనని చూసి, "కర్రి పిల్ల, కర్రి పిల్ల.." అని ఎగతాళి చేస్తుంటే మారిక బాధపడుతూ, దేవుణ్ణి-తననీ కలిపి తిట్టుకుంటూ పోతున్నది. అంతలో దారిన పోయే ఆమె ఒకామె ఇదంతా చూసి, "ఓ పాపా! ఇలా రామ్మా" అని మారికను పిలిచింది. మారిక పెద్దలను గౌరవించేది కనుక, సరేలే అని ఆమె దగ్గరకు వెళ్లింది.

"చూస్తే చదువుకున్నదానిలా ఉన్నావు. ఎందుకమ్మా దేవుణ్ణి తిడుతున్నావు?" అడిగిందామె, మారికని.

"అందరూ నన్ను 'కర్రి పిల్ల, కర్రి పిల్ల' అంటూ ఏడిపిస్తున్నారు!" చెప్పింది మారిక.

అపుడు ఆమె, "చూడమ్మా! దేవుడు కారణం లేనిదే ఏ పనీ చేయడు. సరే నువ్వు అంతగా బాధపడుతున్నావు కదా; బాధ పడడంలో కూడా అర్థమున్నదిలే... నేను నీకు ఒక పని చెబుతాను. అది చేస్తే నీకు ఈ బాధ తప్పుతుంది. చేస్తావా?" అన్నది ఆమె.

"ఓ! నువ్వు ఏం చేయమంటే అది చేస్తాను- చెప్పు" అన్నది మారిక, ఉత్సాహంగా.

"దేవుడిని తిట్టకు- ఏకాగ్రతతో ఆ దేవుడిని గూర్చి తపస్సు చెయ్యి. నిష్ఠగా ఒక్క రెండు మూడు నెలలు చేశావంటే, అటుపైన ఏదో ఒకరోజున నిన్ను దేవుడు తప్పకుండా కరుణిస్తాడు: ఏదో ఒక వరం ప్రసాదిస్తాడు- చూడు" అని చెప్పింది. సరేనని మారిక సంతోషంతో ఇంటికి వెళ్లింది.

తరువాతి రోజు నుండి ఆమె చెప్పినట్లే, ఘోరమైన తపస్సు చేసింది మారిక. మూడు నెలలు తిరిగేటప్పటికి, తళతళా మెరుస్తూ దేవుడు ప్రత్యక్షమయ్యాడు: "మారికా! ఏమిటి నీ కోరిక?" అని అడిగాడు.

అప్పుడు మారిక "దేవుడా! నువ్వు నన్ను ఇట్లా నల్లగా ఎందుకు పుట్టించావు? అందరూ నన్ను ఎగతాళి చేస్తున్నారు. కాబట్టి నాకు ఒక వరం ప్రసాదించు- నన్ను నువ్వు అందంగా, తెల్లగా చెయ్యి!" అని అడిగింది మారిక.

"ఓఁ దానిదేముంది- తప్పకుండా చేస్తాను. కానీ- నువ్వు అట్లా తెల్లగా, అందంగా అవ్వాలంటే మరి, నువ్వు నేర్చుకున్న చదువు అంతా మరిచిపోవాల్సి ఉంటుంది!" అన్నాడు దేవుడు.

ఇందులో ఏదో‌ మెలిక ఉన్నది అనిపించింది మారికకు. అయినా "సరే" అన్నది.

"అయితే విను, మరి. ఒకనెల లోపుగా నువ్వు కొంచెం కొంచెంగా నీ చదువంతా మర్చిపోతావు; అట్లాగే కొంచెం కొంచెంగా తెల్లబడతావు. ఈలోగా ఏదైనా వద్దనిపిస్తే వెంటనే నన్ను పిలు- వచ్చి మార్చేస్తాను" అని మాయమయ్యాడు దేవుడు. మారిక ఉత్సాహంగా గాలి పీల్చుకున్నది.

అట్లా మరో నెల తిరిగే సరికి ఆమె చదువు పూర్తిగా మర్చిపోవటం, పూర్తిగా తెల్లగా మారిపోవటం జరిగిపోయాయి.

దాంతో మారికకి చాలా సంతోషం వేసింది.

కొన్ని రోజుల తర్వాత, మారికకి పెళ్లి జరిగింది. "తెల్లగా, అందంగా ఉంది; బాగా చదువుకుంది" అని గొప్ప ఇంటివాళ్ళే వచ్చి ఖర్చులు భరించి మరీ చేసుకున్నారు. అయితే త్వరలోనే వాళ్లకు అర్థమైపోయింది- ఈమెకు చదువు అస్సలు రాదని! "మోసం చేశావు! నువ్వు అందంగా లేకపోయినా ఫరవాలేదు. ఎవరైనా నల్లగా ఉంటేనేమి, తెల్లగా ఉంటేనేమి? కానీ, నీకు చదువు రాదంటే మటుకు నాకు చాలా కష్టం అనిపిస్తున్నది" అనటం మొదలెట్టాడు మారిక భర్త.

ఇట్లా కొద్ది రోజులు గడిచే సరికి మారికకు చాలా బాధ అయిపోయింది. 'ఇంక లాభం లేదు'అనుకొని దేవుడిని గట్టిగా తలచుకొని "స్వామీ! నాకు ఈ దొంగ అందము-చందము ఏమీ వద్దు. నా చదువు నాకు తిరిగి ఇవ్వు చాలు" అని వేడుకున్నది.

అప్పుడు దేవుడు నవ్వి, "అమ్మా! ఈ లోకంలో చదువు కంటే గొప్పది ఏదీ లేదు. ప్రతి మనిషీ చదువుకోవాలి. అప్పుడే జీవితం బాగుంటుంది. నీ మంచితనాన్ని, చిత్త శుద్ధిని మెచ్చుకుంటూ, నీ చదువును నీకు తిరిగి ఇస్తున్నాను. నువ్వు చక్కగా ముందులాగే చదువుతావు; రాస్తావు. అంతేకాదు- ఇలా చదువు విలువను ఈ ఊరి ప్రజలందరికీ తెలియజేశావు కాబట్టి, ఈ ఊరికి 'మారిక పురం'అని, నీ పేరే పెడుతున్నాను" అని చెప్పి మాయమయ్యాడు. అట్లా మారిక కష్టాలు తీరాయి.

ఆ 'మారిక పురాన్నే', ఇప్పుడు అందరూ 'మార్కాపురం' అంటున్నారు!