అనగా అనగా ఒక తిక్క రాజు గారు ఉండేవారు. వాళ్ల దేశమేమో చాలా పెద్దది. దేశంలో తలెత్తే సమస్యల్ని అన్నిటినీ ఆయనొక్కడే పరిష్కరించాలంటే చేతకావట్లేదు. అందుకని ఆయన తనకి నచ్చిన సలహాదారుల్ని చాలా మందిని పెట్టుకున్నాడు.

వాళ్లందరికీ రాజుగారు ఒక్కటే చెప్పేవాడు: "ప్రతిదాన్నీ కొత్తగా ఆలోచించాలి" అని.

ఒకసారి ఆయన నిండుగా కొలువు తీరి, తన సలహాదారులని ఇట్లా అడిగారు:
'అ ఆ ఇ ఈ లన్నీ ఇదే వరుస క్రమంలో ఎందుకుండాలి?!' అని.
"మనం అచ్చుల్ని, హల్లుల్ని వేరు చేసి ఉంచాం ప్రభూ!" చెప్పారు పండితులు.
"మరి అచ్చులే ముందు ఎందుకు నేర్పాలి? ముందు హల్లులు నేర్పుదాం!" అన్నారు రాజావారు.
"ఓ నేర్పచ్చు, దానిదేముంది?!" అన్నాడొక సలహాదారు ఉత్సాహంగా.
"కాదు ప్రభూ! ముందు అచ్చులన్నీ చెబితే తర్వాత హల్లులు, గుణింతాలు సులభంగా అర్థం చేయించచ్చు" అన్నాడొక పండితుడు నీరసంగా ముఖం పెట్టి.
"రాజు వారినే కాదంటారా?!" అడిగాడు సలహాదారు ఆయన్ని, కొంచెం బెదిరిస్తున్నట్లు.
"అబ్బె! అబ్బె! కాదని ఎలాగంటాం?! రాజావారు ఎప్పుడూ సరిగానే సెలవిస్తారు!" అనేశారు పండితులు, వెనక్కి తగ్గి.
"అంతే, ప్రభూ! తమరు చెప్పినట్లు, ఇకపైన హల్లుల్నీ ముందు నేర్పుతాం. అచ్చులు వెనక వస్తాయి" నిర్ణయించేసాడు సలహాదారు.
"అంటే 'క‌ ఖ గ‌ ఘ' తో మొదలౌతాయన్నమాట, అక్షరాలు!" గొణిగాడు పండితుడు.
"లేదు! కొంచెం ఆలోచించండి! అట్లానే ఎందుకు నేర్పాలి?" అడిగారు రాజుగారు, మరి కొంచెం‌ ఆలోచిస్తూ.
"క-ఖ-గ-ఘ -ఇవి కంఠ్యాలు-గొంతునుండి వెలువడతై యీ శబ్దాలు-
"చ ఛ జ ఝ -ఇవి తాలవ్యాలు -దవడలనుండి వెలువడే ధ్వనులు… ఇంకా ముక్కుతో పలికేవి అనునాసికాలు.."
"అంటే మీరు అక్షరాల వరసని వాటిని పలికే తీరును బట్టి నిర్ణయించారా?!"
"అవునండి!"
"అందుకేనన్నమాట, మన పిల్లలకు సరిగ్గా రాయటం రావట్లేదు.." సాలోచనగా అన్నారు రాజుగారు.
"అంటే మరి,..ఎలా ఉండాలండి?" అడిగాడొక పండితుడు, బెదిరిపోతూ.
"ఏవి రాసేందుకు సులభంగా ఉంటాయో, అవి ముందు రావాలి. ఉదాహరణకు సున్న. అది రాయటం చాలా సులభం. అది మొదట రావాలి. అట్లాగే 'ల'- ఎంత సులభం, దీన్ని రాయటం?! 'ఎ'- ఇది కూడాను. 'ప' కూడా సులభమే. ఇవన్నీ ముందు వస్తే, పిల్లవాడు బాగా రాయగల్గుతాడు" చెప్పాడు ఒక సలహాదారు.
"అవును- అవును. అట్లా చేయండి" అన్నారు రాజుగారు ఉత్సాహంగా.
"అవును ప్రభూ! చక్కగా సెలవిచ్చారు" అన్నారు పండితులందరూ తలలూపుతూ.
సభ వెనక వరసలో నిల్చొని ఉన్న పిల్లాడొకడు అరిచాడు-"మరి వరసని ఇట్లా మారిస్తే పిల్లలకి 'రాయటం' వస్తుందేమో గానీ, మరి- అప్పుడిక- 'పలకటం' రాదుగా, మళ్ళీ?! అని.

సలహాదారు కోపంగా అరిచాడు-"ఎవరా సాహసి? పండిత చర్చల్లో పామరులా?!" అని.
అంతలో ఇంకో సలహాదారుకు ఆలోచన వచ్చింది-"ఇంకో పని చేయచ్చు ప్రభూ! అక్షరాలని అదే క్రమంలో ఉంచి, వాటి రూపాన్ని మాత్రం మార్చెయ్యటం! ఉదాహరణకు, 'అ' ని త్రిప్పించి మళ్లించి 'అ' అని రాయకుండా, ఊరికే సులభంగా '.' అని రాయచ్చు. 'ఆ' అనాలంటే ఊరికే సరళంగా ',' అనచ్చు. ఇట్లా అక్షరం స్థానం పెరిగేకొద్దీ వాటిని రాయటం కూడా కఠినమౌతూ పోతుంది!"
"ఇది చాలా చక్కని సూచన!" అన్నారు రాజుగారు.
"అంటే ఇప్పుడింక తెలుగు అక్షరాలే ఉండవన్నమాట..!" గొణిగాడు పిల్లాడు.
"ఎందుకు, ఇవే క్రొత్త తెలుగు అక్షరాలౌతాయి! ఆధునిక తెలుగు లిపి చక్రవర్తి' అని మన రాజువారికి పేరు వస్తుంది!" చెప్పాడు పండితుడు ఉత్సాహంగా.
"ఈ ఆలోచనల్ని మన బళ్లలో వెంటనే అమలు చెయ్యండి!" ఆదేశించారు రాజావారు.
"మన భాషకు సులభమైన అక్షరాలు రాబోతున్నాయ్! ఒక్కో చుక్క ఒక్కో అక్షరం కానున్నది" అని రాజ పత్రికలన్నీ రాయటం మొదలుపెట్టాయి.
అయితే రెండేళ్ల తర్వాత కూడా పిల్లలకెవ్వరికీ యీ కొత్త అక్షరాలు రాలేదు; చాలా మందికి పాతవీ రాలేదు.
'ఎందుకు?' అడిగారు రాజుగారు, అప్పుడు.
'నేర్పే టీచర్లకెవ్వరికీ కొత్తది అంతు పట్టలేదు. అందుకని అందరూ పిల్లలకు నేరుగా ఆంగ్లం నేర్పటం మొదలెట్టారు.'
'ఎందుకు?!' అడిగారు రాజావారు.
"చుక్కకంటే గీత సులభం అని కొందరు, గీతకంటే 'కామా' సులభం అని కొందరు వాదులాడుతున్నారండి. కొత్త వాటిపై ఉపాధ్యాయులకే ఇంకా అవగాహన రాలేదు"
'మరైతే పిల్లలకి పాత అక్షరాలే నేర్పమనండి!' అన్నారు రాజావారు.

పండితులు ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. టీచర్లంతా, మరి- పాతవాటిని వదిలేసారు గదండీ, ఇప్పుడింక వాటి వరసలూ, గట్రా ఎలా ఉంటాయో వాళ్లూ మర్చిపోయారటండి. ఇప్పుడు అందరూ 'ఆంగ్లమే సులభం' అంటున్నారండి"
తిక్కరాజుగారు తలపట్టుకున్నారు. చూస్తూన్న పిల్లాడు "ఏ బీ సీ డీ యీ యఫ్‌ జీ" అని పాడుతూ కిసుక్కున నవ్వాడు.

బడులు, చదువులు, భాష ఇవన్నీ గొప్ప గందరగోళంలో ఉన్న యీ తరుణంలోనే, కొత్త సాంకేతికతలు, వినూత్న బోధనా పద్దతులు, పెట్టుబడులు పాత వాటిని బయటికి నెట్టేస్తున్నాయి; మరోవైపున 'నూతన మదింపులు, నిరంతర సమగ్ర మూల్యాంకనాలు ఉపాధ్యాయులకు ఊపిరి సలపనివ్వట్లేదు. వీటన్నిటి నడుమా పిల్లలు ఇంకా ఏదో ఒకటి నేర్చుకుంటున్నారంటే, అది వాళ్ల ప్రతిభకు నిలువెత్తు తార్కాణం తప్ప మరొకటి కాదు. ఏమంటారు?!