శంభావతి నగరాన్ని శంభులుడనే రాజు పరిపాలించేవాడు. ఆయన ఆస్థానంలో గొప్ప మల్ల యోధుల పరివారం ఒకటి ఉండేది. ఎటువంటి మల్ల యోధులనైనా మట్టి కరిపించగల వస్తాదులు శంభావతిలో ఉంటారని చెప్పుకునేవారు.
ఒకసారి మహామల్లుడనే వస్తాదు ఒకడు శంభులవారి ఆస్థానానికి వచ్చాడు. దేశ విదేశాలలోని మల్లులను ఎంతో మందిని ఓడించి, ఘనమైన బిరుదులు, పతకాలు పొందిన మల్లుడతడు.
'నన్ను ప్రపంచంలో ఎవ్వరూ జయించలేరు' అని కంకణం కట్టుకున్న మొనగాడు. మహామల్లు నేరుగా శంభల మహారాజుతో "రాజా! మీ ఆస్థానంలో నన్ను గెలిచే వాళ్లెవరైనా ఉన్నారా? ఉంటే నాతో తలపడమనండి. లేకపోతే తమ సంస్థానంవారు నాతో ఓడినట్లు ఒప్పుకొని, నాకు విజయపత్రం దయచేయించండి" అని సవాలు చేశాడు.
రాజుగారు ఆస్థానమల్లులకేసి చూసారు. వాళ్లంతా తలలు దించుకున్నారు. మహామల్లుని గురించి వాళ్లందరికీ తెలుసు. అతనితో తలపడటం అంటే ప్రాణాలమీద ఆశ వదిలెయ్యటమే.
వాళ్ల మొహాలు చూసిన రాజుకు ఏం చెప్పాలో తోచింది కాదు. చూస్తూ చూస్తూ ఓటమిని అంగీకరించలేడు... అటు ఆస్థాన మర్యాదను నిలపాల్సిన అవసరం కూడా ఉన్నదాయె!
అయితే వెంటనే మంత్రి లేచి నిలబడ్డాడు. "ప్రభూ! మన ప్రధాన మల్లు- చండ ప్రచండ దుర్దండ గుండుమల్లు- వారికి దీటు రాగల మల్లులు ఈ ప్రపంచంలో ఇంకా పుట్టలేదు.
సమస్య ఏమంటే, వారు ప్రస్తుతం జైత్రయాత్రలో ఉన్నారు. ఒక నెల రోజుల్లో తిరిగి వస్తారు. వస్తూనే ఈ మహామల్లు గారికి బదులు చెబుతారు- తమరి సెలవైతే అంతవరకూ వీరికి మన ఆస్థానంలోనే విడిది ఏర్పాటు చేస్తాం" అన్నాడు.
"మీ సలహాని అమలు చేయండి- గుండుమల్లులవారు రాగానే మాకు తెలియపరచండి" అన్నారు రాజుగారు.
వెంటనే సకల మర్యాదలతోటీ మహామల్లుకు ఒక బస ఏర్పరచారు. మహామల్లు బసలో కూర్చున్నాడే కానీ, మంత్రి మాటలు విన్నప్పటి నుండి అతని మనస్సు కొంచెం అదొకలాగా మారిపోయింది-
ఆత్రంతో పరిచారకులను చేరబలిచి, గుండుమల్లు గురించిన భోగట్టా అడిగాడు. మంత్రిగారు ముందుగానే చెప్పినట్లు, పరిచారకులు గుండుమల్లు పేరు వింటూనే ఒకసారి వణికిపోయి, గాలికి నమస్కరించుకుంటూ, “వారు మా మల్లులందరికీ గురువు.
అనుక్షణం యోగసాధనలో ఉంటారు. తమరి సంగతి మాకు తెలీదు గాని, నిజానికి గుండుమల్లులవారికి పోటీయే లేదు. ఎప్పుడో ఒకసారి, తగిన పని పడి, 'రాకపోతే ఆస్థానం పేరు పోతుంది' అనిపిస్తే తప్ప, సామాన్యంగా ఆయన బయటికే రారు" అని చెప్పటం మొదలుపెట్టారు.
మరునాడు మహామల్లు బసకు సమీపంలోనే ఒక ప్రత్యేక భవన నిర్మాణం ప్రారంభమైంది. దానికి ఒక బ్రహ్మాండమైన సింహద్వారం అమర్చారు. ఇది చూచి ఆశ్చర్యపడి, మహామల్లు- "ఇంత పెద్ద ద్వారం ఎందుకు?” అని అడిగాడు.
అక్కడి సేవకులు చెప్పారు: "గుండుమల్లు గారు దయచేస్తున్నారు కదా, వారు సామాన్యులా?! మామూలు గుమ్మం ఏం సరిపోతుంది, వారికి? అందుకనే సింహద్వారం" అని బదులు చెప్పారు.
అంతలో భవనాన్ని కట్టే మేస్త్రీ అరిచాడు: "అరేయ్, బాగా గట్టిగా దిమ్మిసె కొట్టండి! మన గుండుమల్లుల వారు అడుగులు వేయాలి! నేల ఎక్కడ దిగబడిపోయి గోతులు పడ్డా, వారికి తిక్క రేగుతుంది- మనకి మంచి పేరు తీసుకురండి!” అని హెచ్చరిస్తూ.
మరో వారం రోజులలో గుండుమల్లు వస్తాడనగా భవనం పని మరింత వేగం పుంజుకున్నది.
మహామల్లు చూస్తుండగానే గంగాళాల-తోనూ, బండ్లతోనూ వెన్న, బాదం పప్పులూ, వస్తాదులు తినే రకరకాల పదార్థాలూ వచ్చి దిగటం మొదలెట్టాయి.
ఈ అట్టహాసమంతా పరిశీలనగా గమనిస్తూనే ఉన్నాడు మహామల్లు.
సమరం దగ్గర పడుతున్నకొద్దీ అతని గుండె జారిపోసాగింది 'ఈ గుండుమల్లు ఎవరో, ఎంత గొప్పవాడో' అని.
అనుకున్నరోజున ఇరవై ఎనిమిది గుర్రాలు లాగే ఒక చిత్రమైన వాహనం వచ్చి భవనం వాకిట నిలిచింది. పరివారం అంతా "చండ ప్రచండ దుర్దండ గుండుమల్లు గారికీ- జై!" అంటూ ఘోష పెట్టారు. ఆ మల్లుకు స్వాగతమిచ్చేందుకై మహారాజుల వారు స్వయంగా వాహనం వద్దకు వచ్చారు.
ఆయనకు మహామల్లును పరిచయం చేద్దామని మంత్రి ఆయన బసకు వెళ్లి చూసాడు.
ఏమున్నదీ అక్కడ? బస ఖాళీ! ఘనత వహించిన మహామల్లు ఎప్పుడు, ఎలా మాయమయ్యాడో ఎవ్వరికీ తెలీదు! మంత్రి పథకం ఫలించింది!