ఎప్పటిమాదిరే ఓపికగా చెట్టెక్కి, తనని ఒడిసి పట్టుకొని, శ్రమపడుతూ క్రిందికి దిగుతున్న ఇన్‌స్పెక్టర్ విక్రంని చూసి విచారంగా నవ్వింది రోబో బేతాళం. దాని యాంటెన్నాలు గిరగిరా తిరిగాయి. గాజు కళ్ళు మిలమిలా మెరిసాయి. "చూడు విక్రం, నీ ఆఫీసుకు వచ్చి సాయం కోరిన సిద్ధప్ప మనసులో‌ నిజంగా ఏమున్నదో కనుక్కున్నావా? ఎందుకు అడుగుతున్నానంటే, మనసులోపల దాచుకున్న మోసం బయటికి కనిపించకపోయినా, అది అట్లా ఎంతో కాలం దాగదు. ఏనాడో ఒకనాడు తప్పక బయటపడుతుంది. దీనికి ఉదాహరణగా నీకు మంత్రాల కిష్టన్న కథ చెబుతాను విను-" అంటూ అది ఇలా చెప్పసాగింది:

కిష్టన్న ఒకప్పుడు అందరిలాంటి మామూలు మనిషే; అడవిలో కట్టెలు కొట్టి బ్రతికేవాడు. అతను రోజూ వెళ్ళే దారిలో ఓ చెట్టుకింద కూర్చొని జపం చేసుకుంటూ కనిపించేవాడు ఒక సాధువు. జనాలంతా అతనికి ఏవేవో శక్తులున్నాయని చెప్పుకునేవాళ్లుగానీ, కిష్టన్నకి ఏనాడూ అతనితో అవసరం పడలేదు.

అయితే ఒకరోజు ఆ సాధువు నేలమీద పడి దొర్లుతూ మూలగటం చూశాడు కిష్టన్న. వెంటనే తన చేతిలోని గొడ్డలి ప్రక్కన పెట్టి, ఆయన్ని లేపి, చెట్టుకి ఆనించి కూర్చోబెట్టాడు-

"స్వామీ! ఏమైంది?" అని అడుగుతూ.

"దాహం! దాహం! మంట! మంట!" మూలిగాడు సాధువు. కిష్టన్న తన దగ్గరున్న తిత్తిలోంచి కొన్ని నీళ్ళు ఆయన నోట్లో పోసాడు.

కొద్దిసేపట్లోనే సాధువు తేరుకున్నాడు. "వాడి కోసం జబ్బును నేను భరించాల్సి వచ్చింది. ఇప్పుడు తగ్గింది" అన్నాడు.

"అదేంటి స్వామీ? ఒకరి కోసం తమరు జబ్బును భరించడం ఏమిటి?" ఆశ్చర్యంగా అడిగాడు కిష్టన్న.

"కందనోలులో నా శిష్యుడు వీరయ్య, విపరీతమైన జ్వరంతో బాధపడుతున్నాడు. ఇంకో రెండు రోజులలో అతను చనిపోయేవాడు. అయితే నిన్నటి నుండీ అతను నిరంతరం నన్నే తలచుకుంటున్నాడు. అందుకని అతన్ని రక్షించడం కోసం అతని జబ్బును నేను కొంత తీసుకొని బాధపడ్డాను. అతనికి ప్రాణ భయం లేకుండా చేశాను."

"ఇదంతా చిత్రంగా ఉంది స్వామీ! నిజంగా మాయలు-మంత్రాలు ఉన్నాయా? నేను రోజూ కట్టెలు కొట్టుకోవడానికి పోతూ మిమ్మల్ని చూస్తున్నాను. ఊరికే కళ్ళు మూసుకొని కూర్చుంటే ఏం ఉపయోగమో నాకు అర్థం కాలేదు- తిండి తీర్థం ఎలా వస్తాయి? ఎవడు సమకూరుస్తారు?" అమాయకంగా అడిగేసాడు కిష్టన్న.

అతని అమాయకత్వం సాధువుకు నచ్చింది. పైగా తన వయసు అయిపో వచ్చింది కూడా. తను నేర్చుకున్న విద్యలన్నీ తనతో పాటు నశించిపోతాయి. అందుకని వాటిలో కొన్నన్నా వాడికి నేర్పిద్దామనుకున్నాడు.

"కిష్టన్నా! చూడు, దూరంగా ఆ చెట్టు మీద గుడ్లగూబ కూర్చుని ఉందా?"

"ఆ! పగలు దానికి కళ్లు కనబడవు. అందుకే అది అక్కడ కూర్చున్నది"

"దాన్ని రప్పిస్తాను- నా మంత్రశక్తిని నువ్వు నమ్ముతావా?" అంటూ సాధువు కళ్లు మూసుకొని ఏదో మంత్రం చదివాడు. అంతే! గుడ్లగూబ వచ్చి సాధువు చేతిలో వాలింది. కిష్టన్న నోరు ఆశ్చర్యంతో అలానే తెరుచుకుపోయింది.

వెంటనే ఆ సాధువు దాన్ని చంపేసి ప్రక్కన పారేశాడు. కిష్టన్న భయంతో గజగజ వణికిపోయాడు. "ఏంటి స్వామీ ఇది! సాధువులు, ఇలా చేశారు?!" అన్నాడు.

సాధువు విచారంగా నవ్వాడు. "కిష్టన్నా! ఇదిగో, ఇప్పుడు చూడు- నా అరచేతిలో! ఇక్కడికి దగ్గర్లో ఉన్న నిధి నిక్షేపాలు నీకు కనిపిస్తాయి- బాగా చూడు" అన్నాడు, తన అరచేతిని అతని కళ్లముందు పెట్టి.

సాధువు అరచేతిలో లంకె బిందెలు, బంగారు రాసులు కనిపించాయి కిష్టన్నకు- ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయిపోయాడు.
"స్వామీ! నిధులు అయితే రాసులు రాసులు ఉన్నాయి. కానీ అవి బయటకు వచ్చేది ఎలా?"

"ప్రశ్న అది కాదు కిష్టన్నా! నోరులేని ఈ పక్షిని ఉత్తి పుణ్యానికి చంపిన పాపం నన్ను వెంటాడదా?" అనేది- చెప్పాడు సాధువు.

"మనం చేసిన పనులవల్ల లాభనష్టాలే కాదు; పాపపుణ్యాలు కూడా మన పాలవుతాయి. నాకు ఇన్ని శక్తులు ఉండి కూడా కొన్ని కోరికలు మటుకు నెరవేరకుండా ఉండిపోయినై: నా తల్లిదండ్రుల పేరు మీద ఒక సత్రం కట్టించి బీదలకు అన్నదానం చెయ్యాలని, ఓ విద్యాలయం కట్టించి పిల్లలకు ఉచితంగా విద్యనందించాలని, అలాగే ఒక వైద్యాలయం కట్టించి రోగులకు ఉచిత వైద్యం అందించాలని- ఇవి ఎంతకీ నెరవేరలేదు- నా పాపాల ఫలితం అది!" అన్నాడు.

"దానిది ఏముంది స్వామీ! మీరు నాకు ఈ మంత్రం నేర్పండి- నేను మీ ఈ కోరికలు నెరవేరుస్తాను" అన్నాడు కిష్టన్న ఆశగా. సాధువు కొద్దిసేపు అతనికేసి నిశ్శబ్దంగా చూసాడు. "సరే- ముందు ఏటికి పోయి శుచివై రా పో!" అని పంపాడు. తరువాత అతనికి నిధి నిక్షేపాల మంత్రం నేర్పించేసాడు.

పన్నెండు మాసాలు గడిచేసరికి కిష్టన్న ధనవంతుడైపోయాడు. కందనవోలులో మూడు భవంతులు కట్టించటం మొదలెట్టాడు. మూడు భవంతులూ పూర్తయ్యాయి. అన్నదాన సత్రం, బడి, ఆసుపత్రి- మూడింటిపైనా ఆజమాయిషీ తను పెట్టుకొని, సిబ్బందికి బరువు బాధ్యతలు అప్పగించాడు కిష్టన్న.

సాధువు కోర్కె ప్రకారం నూరుమంది పేదలకు రోజూ సత్రంలో అన్నదానాలు జరుగుతుండేవి.

అలాగే ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత విద్యాలయం కూడా ప్రారంభించబడింది.

వైద్యాలయం కూడా మొదలైంది.

పెద్దవాడైన తర్వాత కిష్టన్న వేషం కూడా మారింది. పసుపుబట్టలు ధరించటం మొదలెట్టాడు. మెడలో రుద్రాక్షమాలలు, చేతిలో పొన్నుకర్ర! చుట్టుప్రక్కల ప్రజలు కిష్టన్నను చూస్తే భయపడసాగారు. అతను వస్తుంటే దారి తప్పుకోవటం చేస్తున్నారు. మరో సంవత్సరం గడిచేసరికి సాధువు బాగా డస్సిపోయాడు- "కిష్టన్నా! నేను దేహం వదిలే ఘడియలు దగర పడుతున్నాయి. నేను పోయాక ఇక నీకు ఈ మంత్రాలేవీ పని చేయవు. నీకు వీలైతే ఈ సత్రం, విద్యాలయం, వైద్యాలయం నువ్వు నడిపించు. లేకపోతే ఆపెయ్యి. ఏమీ పరవాలేదు" అని, కిష్టన్న మరో మాట అనేలోగా కన్ను మూసాడు.

కిష్టన్నలో కంగారు మొదలైంది. 'ఆ సరికే తనకు మంత్రాల కిష్టన్న అని పేరు వచ్చింది. ఇప్పుడు మంత్రాలు పని చెయ్యకపోతే ఎలాగ?' అనుకున్నాడు.

అయితే 'తనకేం భయం లేదు' అని అతనికి త్వరలోనే అర్థమైంది. అతని మంత్రాలు పని చేయట్లేదని జనాలెవ్వరూ కనుక్కోలేదు!

జనాలు రకరకాల మంత్రాల పనులతో అతని ముందు బారులు తీరుతూనే వచ్చారు. ముఖ్యంగా ఆడవాళ్ళు అనేకమంది, కిష్టన్న మంత్రశక్తిని నమ్మి రావటం మొదలెట్టారు. కిష్టన్నకు డబ్బులు వస్తూనే పోయాయి.

అయితే చూస్తూండగానే మద్య మాంసాలకు, పలురకాల దురవాట్లకు లోనయ్యాడు అతను. సత్రాన్ని, విద్యాలయాన్ని, ఆసుపత్రిని నడిపించేం-దుకుగాను భారీగా దానాలు స్వీకరించి, వాటిలో సగం తన అవసరాలకు వాడుకోవటం మొదలెట్టాడు; వాహనాలు కొన్నాడు; రకరకాల దొంగ వ్యాపారాలలోకి దిగాడు.

కానీ త్వరలోనే అతని మోసాలన్నీ బయట పడ్డాయి. ఆవేశంతో ఒకటైన జనాలు అతన్ని కొట్టి, పోలీసులకు అప్పగించారు. సత్రమూ, విద్యాలయమూ, వైద్యా-లయమూ, వ్యాపారాలూ అన్నీ‌ మూతపడ్డాయి.

బేతాళం ఈ కథ చెప్పి "సాధువు బ్రతికి ఉన్నప్పుడు అంత వృద్ధిలోకి వచ్చిన కిష్టన్న, చివరికి అకస్మాత్తుగా అంత పతనం చెందటానికి కారణం ఏమిటి? అతని మంత్రశక్తులన్నీ సాధువుతోపాటు ఎందుకు పోయాయి? ప్రజల మేలు కోరి ప్రారంభించిన సత్రమూ, విద్యాలయమూ, వైద్యాలయం అన్నీ కూడా ఘోరంగా నశించిపోయాయి, ఎందుకంటావు?" అని అడిగింది. విక్రం నవ్వి "సహజంగా జరిగే రకరకాల సంఘటనలకు వ్యక్తిగత కారణాలు వెతుక్కోవటం కొత్తకాదు. ఇవన్నీ అసలు నిష్కారణంగానే సంభవించి ఉండవచ్చు.

అయితే సాధువు మాటలలో కూడా తత్వం కొద్దిగా కనబడుతుంది. 'మనం చేసిన పనులవల్ల లాభనష్టాలే కాదు; పాపపుణ్యాలు కూడా మన పాలవుతాయి' అనేది:

సాధువు చేసిన పాపం వల్ల అతని కోరికలు నెరవేరలేదు. అయితే కిష్టన్నకు మంత్రాలు ఉపదేశించటం ద్వారా అతని పాపం కొంత తొలిగింది; సత్రం మొదలైన పనులు మొదలైనాయి. దాన్ని గుర్తించి ఉంటే, 'తనకు సంక్రమించిన వరాలు శాశ్వతంగా ఉండవు' అని కిష్టన్నకూ అర్థమై ఉండాలి.

అయితే అతను అలా అనుకోక, మోసాలకు ఒడిగట్టి, మరింత పాపాన్ని మూటగట్టుకున్నాడు. చివరికి అతని పాపాలే అతన్ని నాశనం చేసాయి" అన్నాడు.

విక్రం మౌనం భంగం అవ్వటంతోటే బేతాళం అతని పట్టువీడి, మళ్ళీ చెట్టెక్కి కూర్చున్నది.