ఒక ఊరిలో తేజస్విని అనే అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి చాలా మంచిది. ప్రతి ఒక్క పనిలోనూ ముందుండేది.
తేజస్విని తల్లిదండ్రులు సీత-సుబ్బారావు. అయితే సీత ఎప్పుడూ తేజస్విని చేసే పనుల్లో తప్పులు వెతుకుతుండేది. "ఈ
అమ్మకి నేనంటే ఇష్టం లేదు- అందుకనే నన్ను ఎప్పుడూ తప్పుపడుతుంది" అని ఏడ్చుకునేది తేజస్విని. నిజానికి తేజస్వినికి చదువు అంటే చాలా ఇష్టం. ప్రతి పరీక్షలోనూ తనకు వందకి వంద మార్కులు వచ్చేవి.
ఒక రోజు వాళ్ల సైన్సు టీచర్ చెప్పింది: "రేపు పరీక్ష ఉంది; అందరూ బాగా చదువుకొని రండి. చక్కగా రాసేందుకు ప్రయత్నించండి" అని.
తర్వాతి రోజున అందరిలాగానే తేజస్విని కూడా బాగా చదువుకొని వచ్చింది. అయితే ఆ రోజు పరీక్షలో ఎందుకనో తనకు నూటికి తొంభై మార్కులే వచ్చాయి!
తేజస్వినికి ప్రపంచం మునిగిపోయినంత బాధ వేసింది. "పది మార్కులు తగ్గిపోయాయి! అయ్యో!" అని బాధపడుతూ ఉంది, రోజంతా. తోటి పిల్లలు తమకు ఎనభై మార్కులొచ్చినా పట్టించుకో-కుండా ఆటల్లో మునిగారు; కానీ ఈ పాపకు మటుకు శాంతి లేదు!
దానికి తోడు ఆ పాప ఇంటికి రాగానే సీత "వందకు తొంభయ్యా?! ఏం చేస్తున్నావు నువ్వు అసలు?! ఊరికే అన్నం తినేది, ఇంటికి వచ్చేది! నీ చదువుతో మాకు వృధా ఖర్చు!" అని చెడామడా తిట్టేసింది. దాంతో తేజస్విని ఏడ్చుకుంటూ ఓ గదిలోకి పోయి కూర్చున్నది.
కొంత సేపటికి సుబ్బారావు గారు వచ్చారు. ఆయనకి తేజస్విని అంటే చాలా ఇష్టం. తేజస్వినికి కూడా, వాళ్ల నాన్న అంటే చాలా ఇష్టం. ఆయన ఇంట్లోకి రాగానే "తేజస్వినీ.. తేజస్వినీ!" అని పిలిచాడు. ఎన్ని సార్లు పిలిచినా తేజస్విని ఉలుకు లేదు-పలుకు లేదు! తీరా వచ్చి చూసేసరికి గదిలో కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్నది!
నాన్నగారు అ పాప దగ్గరికి వెళ్లి- "హేయ్! ఏమైంది?! ఎందుకిట్లా ఏడుస్తూ కూర్చున్నావ్?" అని అడిగారు. తనకు నూటికి తొంభై మార్కులే వచ్చిన సంగతి చెప్పింది తేజస్విని.
సుబ్బారావు నవ్వేస్తూ "దానిదేమున్నది పాపా! చిన్నప్పుడు నాకు పాఠాలు అసలు ఏమీ అర్థం అయ్యేవి కావు- నూటికి ఎనభై కూడా ఎప్పుడూ రాలేదు తెలుసా?! అయినా నష్టం ఏం జరిగింది? ఇప్పుడు బానే ఉన్నాం! మార్కులు ఎన్ని వచ్చినా పరవాలేదు. అసలయితే అవి మీ టీచరు తను ఎంత బాగా పాఠం చెప్పిందో తెలుసుకోవటం కోసం తనకు తాను వేసుకున్న మార్కులు!" అని ఊరడించారు.
"మరి అమ్మ అట్లా ఎందుకు తిట్టింది?" గట్టిగా అరిచింది సీత. "కూల్! కూల్! నేను అడుగుతానులే, సమయం చూసుకొని. సరేనా?! అప్పటివరకూ ఓపికగా ఉండు. ఏడవద్దు" అని చెప్పారు నాన్న.
తర్వాతి రోజున సీత ఇల్లు ఊడుస్తుండగా దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు సుబ్బారావు. కొంత సేపటికి ఊడవడం అయిపోయింది. వెంటనే సుబ్బారావు ఒక ప్రక్కగా జమ అయి ఉన్న వెంట్రుకల పోచలు కొన్నింటిని చూస్తూ సీతని పిలిచాడు. సీత వచ్చి "ఏంటండీ?!" అంది. "ఇక్కడ చూసావా, ఎంత జుట్టు పడిందో?! వెంటనే ఈ చెత్తను ఎత్తి పడేసి, మళ్ళీ ఒకసారి ఇల్లు మొత్తం ఊడ్చుకునిరా!" అన్నాడు.
అమ్మకి కోపం వచ్చేసింది. "ఇల్లు మొత్తం చక్కగా ఊడిస్తే అది కనబడలేదేం, ఒక్కచోట మిగిలిన వెంట్రుకలు కనబడి వేధించాయి?! ఆ వెంట్రుకలేవో మీరే ఎత్తేస్తే పోలేదా, ఇంత మాత్రానికి నన్ను పిలిచి ఎత్తి చూపించాలా?!" అన్నది నొచ్చుకుంటూ.
ఆ మాటకి సుబ్బారావు నవ్వి, "తేజస్వినికి పది మార్కులు తగ్గితే అంతలా తిట్టావు-దానికి వచ్చిన తొంభై మార్కుల్నీ పట్టించుకోలేదుగా, మరి?!" అన్నాడు.
అమ్మ కొంచెం సేపు ఏమీ మాట్లాడలేదు. తర్వాత కొంచెం రోషంగా "దానికీ, దీనికీ ఏం సంబంధం?" అంది. "అట్లా కోపగించుకోకు సీతా, చూడు, నువ్వు తిట్టిన తిట్లకి తేజస్విని చాలా బాధపడుతున్నది. ఎదిగే పిల్ల- సెన్సిటివ్‌గా ఉంటుంది; మనం గమనించాలి.
తను బాధ్యత తెలిసిన పిల్ల. తన శక్తి కొద్దీ ఉత్సాహంగా చదువుతున్నది; బడికి పోతున్నది; పరీక్షలు రాస్తున్నది! ఇక మార్కులు ఏవో రాకుండా ఎందుకుంటాయి? ఏవో వస్తుంటాయిలే, మంచివే! మనం మటుకు తనకు రాని మార్కుల గురించి తన వెంట పడకూడదు-వచ్చిన వాటిని చూసి సంతోషిస్తూండాలి అంతే. అట్లా ఐతే మనమూ సంతోషంగా ఉంటాం, తనూ సంతోషంగా ఎదుగుతుంది...ఆలోచించు!" అన్నాడు సుబ్బారావు.
సీత ఏమీ మాట్లాడ లేకపోయింది.
కొంత సేపటికి తేజస్విని బడి నుంచి ఇంటికి వచ్చాక, తనకి తినేందుకు ఏదో పెడుతూ సీత "నేను నిన్ను మార్కుల కోసం తిట్టానని కోప్పడకు- 'అమ్మలు అట్లా తిడుతూనే ఉంటారు' అనుకొని నన్ను క్షమించేసెయ్యి" అంది నవ్వు మొహంతో.
తేజస్విని ముఖం విచ్చుకుంది. "సరేలే, మళ్ళీ ఇంకో సారి క్షమించేస్తాను. ఇవాళ్ల లెక్కల్లో వందకు వంద వచ్చాయిలే!" అంది నవ్వుతూ. వింటున్న నాన్న కూడా నవ్వాడు.