అనగనగా ఒక ఊళ్లో రాము, శ్రీను, రాజేష్ అనే ముగ్గురు స్నేహితులు ఉండేవారు. ముగ్గురూ ఒకే స్కూల్లో చదివే వాళ్ళు; కలసి మెలసి ఉండేవాళ్లు.

ఒకసారి క్వార్టర్లీ పరీక్షలు పూర్తయిన తర్వాత, దసరా సెలవులకు శ్రీను, రామూలు కూడా రాజేష్ వాళ్ల ఊరికి వెళ్లారు. పట్నపు పిల్లలైన శ్రీను, రాములకి పల్లెటూరి జీవితం బలే కొత్తగా అనిపించింది.

ఊళ్ళో ఎవరికి వాళ్ళు ఈ పిల్లలకు ఏదో ఒక గుడి గురించో, గోపురం గురించో చెప్పటం, ఆ స్థలపు గొప్పదనాన్ని కథలు కథలుగా వర్ణించటం, వీళ్ళు వీలైతే అక్కడికి పోయి ఆ స్థలాల్ని చూసి రావటం- ఇట్లా గడుస్తున్నది కాలం.

ఎవరో అడిగారు పిల్లల్ని- "మన ఊరి పొలిమేరల్లోనే 'మహిమగల కోట' ఒకటున్నది- మీరు చూసారా?" అని. పిల్లలు ముగ్గురూ ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. రాజేష్‌కి కూడా తెలీదు దాన్ని గురించి!

"ఏంటా మహిమ?" అని అడిగాదు శ్రీను. అంతలో "పిల్లలు- వాళ్లకెందుకు చెబుతావు, ఇవన్నీ?!" అని కసిరారు ఇంకొకరు. దాంతో ఆ అడిగినవాళ్లు ఇంక ఏమీ పలకలేదు.

కానీ పిల్లలకు ఉత్సుకత పెరిగి పోయింది."ఇంతకీ మీరు ఎన్నడూ చెప్పనే లేదు- మీ ఊరి పొలిమేరల్లోనే ఏదో మహిమగల కోట ఉన్నదట?!" ఆ రోజు సాయంత్రం తీరిగ్గా కూర్చొని టీ త్రాగుతున్న రాజేష్ వాళ్ల నాన్ననే అడిగారు, శ్రీను- రాము.

రాజేష్ వాళ్ల నాన్న నవ్వాడు. "అక్కడికి పిల్లల్నెవరూ వెళ్ళనివ్వరు. అసలు దాన్ని గురించి కూడా మాట్లాడరు- మీకెలా తెల్సింది?" అన్నాడు.

పిల్లలు ఎంతకీ వదలక పోయే సరికి, ఆయనే చెప్పాడు- "కోటలోకి ఎవ్వరూ వెళ్లరు. అందులో దెయ్యాలున్నాయి అని నమ్ముతారు అందరూ. ఏనాడో, ఎవరో మంత్రాలవాళ్ళు ఆ కోట చుట్టూ ఓ తెల్లని గీత గీసారట- అది ఇంకా తెల్లగా అట్లానే ఉంది. ఆ గీతని ఎవరైనా తొక్కినా, దాటినా ఊళ్ళోవాళ్ళు అందరికీ కలవరం మొదలై-పోతుంది. అటుపైన పెద్ద పెద్ద పంచాయితీలే అవుతాయి"

"గీతని తొక్కినవాళ్ళు ఊళ్లోకి అడుగు పెట్టకూడదట. వాళ్ళని ఒకరోజు పాటు పూర్తిగా వెలి వేస్తారు ఊళ్ళోవాళ్ళు. ఆ రోజంతా వాళ్ళు కోటలో గడపాల్సి ఉంటుంది" చెప్పాడాయన- "మీరు మాత్రం ఆ ప్రక్కలకు కూడా పోకండి- ఊరికే లేనిపోని సమస్య! ఊళ్ళోవాళ్ళు ఊరుకోరు!"

పిల్లలకు ఉత్సాహం పెరిగిపోయింది. "లోపలికి పోవద్దుగానీ, ఊరికే అక్కడి వరకూ వెళ్ళి, దూరం నుండి చూసి- వచ్చేద్దాం!" అన్నాడు శ్రీను.

"ఏమోరా! అసలు అటు పోవద్దులే- ఏమైనా అయిందంటే ఊళ్ళో వాళ్ళు బాగా గొడవ చేస్తారు!" అన్నాడు రాజేష్. "ఏమీ కాదులేరా! వెళ్ళి చూసొద్దాం" తేల్చేసాడు రాము.

ముగ్గురు మిత్రులూ బయలుదేరి కోటని వెతుక్కుంటూ వెళ్ళారు. కోట పరిసరాల్లో "ఎవ్వరూ లేరు- అంతా నిర్మానుష్యంగా ఉంది" అనుకున్నారు పిల్లలు- అంతలోనే ఓ‌ పదిమంది మనుషుల గుంపు వాళ్లని చుట్టు ముట్టింది.

"ఎందుకొచ్చారిటు?" అడిగాడొకడు. "మీకిక్కడేం పని?" అడిగాడు మరొకడు. "వెళ్ళిపోండి- వెంటనే వెళ్ళిపోవాలి" ఆజ్ఞాపించాడు మరొకడు. "ఇంతకీ ఎవరి పిల్లలు మీరు?" అడిగాడు మరొకడు. పిల్లలు వాళ్లకి మర్యాదగా ఏదో చెప్పి వెనక్కి తిరిగారు.

"ఇక్కడేదో మోసం‌ ఉందిరా, వీళ్ళంతా బాగా త్రాగి ఉన్నారు- గమనించారా?" అడిగాడు రాజేష్.

"అవును- మీ ఊరివాళ్ళు బలే మొరటుగా ఉన్నారు!" అన్నాడు రాము.

"అది కూడా ఆశ్చర్యం- వీళ్ళు ఎవరూ అసలు మా ఊరి మనుషులు కాదు! బయటి వాళ్లు ఇక్కడేం చేస్తున్నట్లు? వీళ్ళలో ఒక్కరు కూడా నన్ను గుర్తు పట్టలేదు చూసారా?" తనలో తనే అనుకున్నట్లు అన్నాడు రాజేష్. రాము చటుక్కున ఆగాడు-"వెనక్కి పోదాం. వాళ్లకు కనబడకుండా కోటలోకి పోయి చూద్దాం. ఏమీ‌కాదు- రండి" అన్నాడు. రాజేష్ కొంచెం సంకోచించాడు. అయితే శ్రీను చేయి పట్టుకొని లాగే సరికి తనూ బయలు దేరాడు. పిల్లకు ముగ్గురూ వెనక్కి తిరిగి పోయేసరికి ఆ మనుషుల జాడ లేదు. "మనం నిజంగానే వెళ్ళిపోయామనుకొని పండగ చేసుకుంటుంటారు- ఐనా గోడలకు కళ్ళుండచ్చు.. మనం ఈ పొదల వెంబడే నక్కి నక్కి నడుద్దాం. అదిగో, అక్కడ- కోట గోడకు రంధ్రం ఉన్నది చూసారా, అందులోంచి లోనికి దూరాలి..ఒక్కొక్కరుగా పోదాం!" ఆజ్ఞాపించాడు రాము, ముందుకు నడుస్తూ.

కోట బురుజు క్రిందుగా ఉన్న రంధ్రం పెద్దదే- ఇద్దరు మనుషులు ఒకేసారి పట్టేంత పెద్దగా ఉందది. పిల్లలు ముగ్గురూ దానిలోంచి లోనికి దూరారు. పురుగుల కిచకిచలు తప్ప కొద్ది సేపటి వరకూ అంతా నిశ్శబ్దంగా ఉండింది లోపల.

"ముందుకు పోదాం" అన్నాడు రాజేష్.

సరిగ్గా అదే సమయానికి దూరంగా ఎక్కడో "ధన్.. ధన్...ధన్" అని శబ్దం మొదలైంది. దానికితోడుగా చాలా మంది మనుషుల గొంతులు.

పిల్లలు ముగ్గురూ ఆ శబ్దం వచ్చిన వైపుకు బయలుదేరారు. అన్ని దిక్కులూ చూసుకుంటూ, గోడలు పట్టుకొని లోపలికి జరుగుతూ పోయారు.

అకస్మాత్తుగా వాళ్లకు ఒక దెయ్యం కనిపించింది! తెల్లగా, గాలిలో తేలుతూ, సూటిగా వీళ్ల వైపుకే వచ్చిందది. పిల్లలు ముగ్గురికీ "కెవ్వు"మని అరిచేందుకు కూడా గొంతు పెగల్లేదు. ముగ్గురూ గోడకు అతుక్కొని, ఊపిరి బిగబట్టి దానికేసే చూసుకుంటూ నిలబడ్డారు. అయితే అది వీళ్లను చూసినట్లే లేదు- నేరుగా ముందుకు పోయింది! అది వేసుకున్న బట్టలు వీళ్ళను రాసుకుంటూ‌ పోయాయి.

"బట్టలు ఉతుక్కున్నది- వాటి వాసన చూసారా, రిన్ సబ్బు వాసన!" గుసగుసలాడాడు రాజేష్. "అసలిది మనిషి కాదు- బెలూన్- చూపిస్తాను- చూడండి" అని గబుక్కున ముందుకు దూకాడు శ్రీను. గబగబా పరుగెత్తి, తన ముందు దూసుకుపోతున్న దయ్యాన్ని తన చేతిలో‌ఉన్న పిన్నీసుతో ఒక్క పోటు పొడిచాడు. "ఠపాలు!"మని పేలిపోయిందది!

"పరుగెత్తండి! ఇక్కడంతా ఏదో‌ మోసం జరుగుతున్నది!" గట్టిగా అరిచాడు రాజేష్. పిల్లలు ముగ్గురూ ఎవరికి వాళ్ళు వెనక్కి పరుగు పెట్టారు.

వాళ్ల వెనక, అన్ని వైపులనుండీ అడుగుల చప్పుళ్ళు వాళ్లని వెంబడించాయి. అయితే పిల్లలు వెనక్కి తిరిగి చూడలేదు. ఇల్లు చేరుకునేవరకూ పరుగును ఆపలేదు!


తర్వాతి రోజున ఊళ్ళోవాళ్ళు వచ్చి గొడవ చేస్తారని భయపడ్డారు పిల్లలు. అయితే ఆశ్చర్యంగా, ఎవ్వరూ రాలేదు.
"మనం‌ అటు వెళ్ళామని వాళ్లకి తెలీలేదేమోరా!" నవ్వాడు రాము.

"కాదు, వాళ్ళ బెలూన్ దయ్యం పగిలిపోయింది గదా, కొత్తది తయారు చేసుకునేందుకు పట్నం పోయి ఉంటారు!" నవ్వాడు శ్రీను.

"అట్లా ఏమీ కాదురా, మరీ తక్కువ అంచనా వేయకండి- వీళ్లదేదో పెద్ద మోసమే. ఖచ్చితంగా మనల్ని గుర్తు పట్టి ఉంటారు ఈపాటికి. ఇవాల్టి రాత్రి మన ఇంటికి వస్తారు చూస్తూండండి!" అన్నాడు రాజేష్, ఆందోళనగా. *

ఆరోజు రాత్రి రాజేష్ వాళ్ల ఇంట్లో దొంగలు పడ్డారు. పెద్దవాళ్లనందర్నీ లేపి స్తంభాలకు కట్టేసారు. పిల్లలకోసం వెతికారు గానీ, వాళ్ళు కనబడలేదు. ఇంట్లో ఏమేం సామాన్లున్నాయో అన్నీ చిందర వందర చేసేసారు.

"'పోలీసులకు చెబుదాం' అనుకుంటు-న్నారేమో, అతి తెలివి ప్రదర్శించారంటే ఇక మీరు ఉండరు" అని బెదిరించారు. ఆశ్చర్యం ఏమంటే, ఒక్క వస్తువును కూడా ఎత్తుకుపోలేదు! *

ఖచ్చితంగా ఇంట్లో‌ దొంగలు పడిన ఆ సమయంలోనే, పిల్లలు ముగ్గురూ కోటలో ఉన్నారు. ఒకరితో ఒకరు మాట్లాడకుండా, టార్చిలైట్ల వెలుగులో లోపల అంతా తిరిగి చూసారు.

లోపల మనుషులెవ్వరూ లేరు- దయ్యాలు కూడా లేవు. చిన్న చిన్న ఎలుకలు, సాలీళ్ళు, గబ్బిలాలు తప్ప మరే ప్రాణులూ కనిపించలేదు. అయితే పారలు, గునపాలు, ఏవేవో త్రవ్వకాలు జరిపినట్లు గుర్తుగా మట్టి దిబ్బలు- మాత్రం పుష్కలంగా కనిపించాయి. పిల్లలు ముగ్గురూ నిట్టూర్చి, నిశ్శబ్దంగా వెనక్కి మరలారు. *

తెల్లవారగానే రాజేష్ వాళ్ల నాన్నని వెంటబెట్టుకొని పట్నం వెళ్ళి, పోలీసు కమిషనర్ గారిని కలిసారు పిల్లలు. రాజేష్ వాళ్ళ నాన్న తమ ఇంట్లో‌ పడిన దొంగల గురించి చెబితే, పిల్లలు ముగ్గురూ బెలూన్ దయ్యం గురించి చెప్పారు- "నిధుల కోసం ఈ దొంగలు మా ఊరి కోటలో తవ్వకాలు జరుగుపుతున్నారు సర్.." చెప్పేసాడు రాజేష్.

"అవునా?! నీకెట్లా తెలిసింది ఆ సంగతి?! క్రైం పుస్తకాలు ఎక్కువ చదువుతావేమో కదా?!" అడిగాడు పోలీసు కమిషనర్, నవ్వుతూ.

"కాదు సర్! మేం ముగ్గురం రెండు రోజులుగా అక్కడికి వెళ్ళి చూస్తున్నాం!" చెప్పారు పిల్లలు. రాజేష్ వాళ్ళ నాన్నతోబాటు కమిషనర్ గారు కూడా‌ ఆశ్చర్యంతో నోరు తెరిచారు. పిల్లలు ఏం చేసారో అడిగి తెలుసుకొని, ఒక నిశ్చయానికి వచ్చిన కమిషనర్ గారు, ఓ పెద్ద పోలీసు పటాలాన్నే పంపారు.

అసలైతే కోటలోని నిధులు అన్నీ‌ ప్రభుత్వానికి చెందుతాయి. వాటిని అక్రమంగా త్రవ్వుకుంటూ, పైగా అటువైపు ఎవ్వరూ‌ రాకుండా ఉండేందుకు దయ్యాల్నీ, భూతాల్నీ సృష్టించారు దొంగలు!

ఆరోజు జరిగిన పోలీసు దాడిలో‌ దొంగల ముఠాలోని సభ్యులందరూ‌ పట్టుబడ్డారు! ఆరోజు వరకూ వాళ్ళు దొంగిలించిన నిధిని కూడా ప్రభుత్వం‌ స్వాధీనం చేసుకున్నది!

పిల్లలకు ముగ్గురికీ సాహస బాలల అవార్డులు లభించాయి!