అనగనగా ఒక అడవిలో ఒక నెమలి, కొంగ స్నేహంగా ఉండేవి. ఏ కష్టం వచ్చినా ఒకదానికొకటి సాయం చేసుకునేవి. ఒకరోజు అడవిలోకి ఒక వేటగాడు వచ్చాడు. సాయంత్రం వరకూ వేటాడినా ఒక్క పక్షిగానీ, జంతువుగానీ చిక్కలేదు అతనికి. విసిగి, వేసారి; అలసి సొలసి ఓ చెట్టు క్రింద కూర్చుండి పోయాడు.

సరిగ్గా అదే సమయంలో అటువైపుగా వచ్చింది నెమలి. అది వేటగాడిని గమనించలేదు పాపం- పరధ్యానంగా వేరేవైపుకు తిరిగి, కొంగ కోసం చూడసాగింది.వేటగాడు తన పంట పండిందనుకున్నాడు. నిశ్శబ్దంగా విల్లు ఎక్కుపెట్టాడు. నెమలిని గురి చూస్తున్నాడు.

అప్పుడే పొదల్లోంచి బయటికి వచ్చింది కొంగ. ప్రమాదాన్ని పసిగట్టింది.

పొడవైన తన ముక్కుతో వేటగాడి కాలును పొడిచింది.


చటుక్కున ఎగిరిపోయింది- రెక్కలు టపటపలాడిస్తూ.

శబ్దానికి అటు తిరిగి చూసిన నెమలికి వేటగాడు కనిపించాడు. అది తన పింఛాన్ని ముడుచుకుంటూ గబగబా కొమ్మ మీది నుండి కొమ్మ మీదికి ఉరికి తప్పించుకున్నది. వేటగాడు వదిలిన బాణం కూడా గురి తప్పింది. నెమలి-కొంగల స్నేహం మరింత గట్టిపడింది!