అనగనగా ఒక ఊళ్లో ఒక రామచిలుక ఉండేది. ఆ రామ చిలుక ఎప్పుడూ సంతోషంగా ఉండేది. ఒకరోజున అది ఎగురుకుంటూ ఓ ఇంటి ముందు వాలింది.

అక్కడ రాము అనే ఒక చిన్న పిల్లవాడు అరటి పండు తింటూ ఉన్నాడు. తన ముందు వాలిన చిలుకను చూసి వాడికి చాలా సంతోషం వేసింది. అయితే అంతలోనే వాడి చెయ్యి జారింది- వాడు తింటున్న అరటి పండు కాస్తా కింద పడిపోయింది.

ఆ సంగతి రామ చిలుకకేం తెలుసు పాపం? 'తన కోసమే వాడు అరటిపండు ఇచ్చాడు' అనుకొని, చటుక్కున ముందుకు నడిచి ఆ అరటి పండును కొంచెం కొరుక్కున్నది.

రాము చిన్న పిల్లాడు కదా, చిలుక అంత దగ్గరికి వచ్చేసరికి వాడికి భయమూ‌ వేసింది, కోపం కూడా వచ్చింది. ఆ రామ చిలుక ముక్కు దగ్గరి నుండి అరటి పండు లాక్కొని, దూరంగా పరుగెత్తుతూనే, వంగి, ఒక రాయి తీసుకొని రామచిలుక మీదికి విసిరాడు వాడు! తరువాత ఇక వెనక్కి చూడకుండా ఇంటికి పరుగుపెట్టాడు.

వాడు విసిరిన రాయి, పాపం, రామచిలుక రెక్కకు తగిలింది. అది ఇంక ఎగరలేకపోయింది. మెల్లగా, దూకుకుంటూ దూకుకుంటూ ఎలాగోలా అది తన ఇంటికి చేరుకున్నది. వాళ్ల అమ్మ దాన్ని చూడగానే కంగారు పడింది గానీ, వెంటనే తనకు తెలిసిన వైద్యం చేసి పిల్ల చిలుకను కదలకుండా పడుకోబెట్టింది. రెండు రోజులకు, గాయం మేలైన తర్వాత, మళ్లీ రామ చిలుక సంతోషంగా ఎగరడం మొదలు పెట్టింది.

తర్వాత కొద్ది రోజులకు మళ్ళీ రాము కనిపించాడు దానికి. ఈసారి వాడు స్నేహితులతో గొడవపడుతున్నాడు. రామ చిలుక రామును చూసింది కానీ, వాడు దాన్ని చూసే పరిస్థితిలో కూడా లేడు: ఎందుకంటే మరి, స్నేహితులందరూ‌ రాముని అవమానిస్తున్నారు: ఒకడు వాడిని నెడుతున్నాడు; మరొకడు కాలు పట్టుకొని లాగుతున్నాడు; మరొకడు ఎగతాళిగా నవ్వుతున్నాడు. రాము ఏడుస్తున్నాడు. రామ చిలుక చటుక్కున వాళ్ళ మధ్యకి దూకి, నెట్టేవాడిని గోళ్లతో‌ గీరింది; కాలు పట్టుకున్న వాడిని పొడిచింది; గట్టిగా అరిచింది. దాంతో వాళ్ళు రాముని వదిలేసి పరుగు లంకించుకున్నారు.
"నన్ను కాపాడినందుకు థాంక్స్" అన్నాడు రాము. అప్పటి నుండి రామ చిలుక, రాము మంచి స్నేహితులైపోయారు. రచన: పి.పావని, ఐదవ తరగతి, వికాస విద్యావనం, పోరంకి, విజయవాడ.

స్వేచ్ఛ

అనగనగా ఒక ఊళ్లో ఒక ఇల్లు ఉండేది. ఆ ఇంట్లో ఒక పంజరం ఉండేది. పంజరంలో ఒక చిలుక ఉండేది. ఆ చిలుకని ఒక అబ్బాయి పెంచుకునేవాడు. పంజరంలో పెట్టి, దానికి ముద్దుగా అన్నీ తెచ్చి పెట్టేవాడు. చిలుకకి మాత్రం ఎగరటం ఇష్టం. పంజరంలో ఉంటే ఎగిరేందుకు వీలు కాదు. అందుకని దానికి పంజరంలో ఉండబుద్ధి కాలేదు.

ఎలాగైనా పంజరంలోంచి వెళ్లిపోవాలని అనిపించింది దానికి ఒకరోజున. ఆ సమయానికి దాన్ని పెంచుకునే అబ్బాయి ఇంట్లో లేడు. చిలుక చాలాసేపు ప్రయత్నించాక, పంజరం తలుపు తెరుచుకున్నది.

చిలుక బయట పడింది. సంతోషంగా గంతులు వేసింది. ఆకాశంలో రివ్వు రివ్వున ఎగిరింది.

కొంత సేపటికి ఒక చోటికి చేరింది. అక్కడ ఇంకో‌ పిల్లాడు ఉన్నాడు. "నా దగ్గర పంజరం ఏమీ లేదు- నేను నిన్ను పట్టుకోను.

దగ్గరికి రా" అని పిలిచాడు. దానికి ఆకలేస్తున్నదని తెలిసి అరటి పండు తినిపించాడు.

పండు తినేసి చిలుక మళ్ళీ పైకి ఎగిరిపోయింది.
రచన: వసంత కృష్ణ, 5th, నవనీత్ 6th వికాస విద్యావనం, పోరంకి, విజయవాడ.

మంచి పిల్లలు

ఒక ఊళ్లో ప్రియ, సోహిత్ అనే అక్కతమ్ముళ్లు ఉండేవాళ్లు. వాళ్ళిద్దరూ ఒకరోజు వరండాలో ఆడుకుంటున్నారు. అప్పుడు ఒక రామ చిలుక అటుగా వచ్చి, వాళ్ళ ఇంటి గోడ మీద వాలింది.

దాన్ని చూసి ప్రియ అంది- 'ఒరే! సోహిత్ మనం ఆ రామ చిలుకని పెంచుకుందాం" అని. సౌహిత్ కొంచెం ఆలోచించి "వద్దులే అక్కా! ఆ రామచిలుకని పెంచుకుంటే మనం దాన్ని బంధించినట్టు అవుతుంది" అన్నాడు.

ప్రియ దానికేసే మురిపెంగా చూస్తూ ఆలోచించింది- "నిజమే... సరేలే మనం దాన్ని పెంచుకోవద్దు. ఊరికే దానికి ఏమన్నా తినిపిద్దాం" అన్నది.

ఇద్దరూ వంటింట్లోకి వెళ్లి తినే పదార్థాలకోసం వెతికారు. వాళ్లకొక ఒక అరటి పండు కనిపించింది. 'సరే' అని దాన్ని తీసుకువెళ్లి తినిపించారు.

రామ చిలుక పండుని చూడగానే 'క్రాక్ క్రాక్- రా-రా' అని అరిచింది. పండుని తినేసి తృప్తిగా ఎగిరిపోయింది. ఇప్పటికీ అది అప్పుడప్పుడూ వస్తూ ఉంటుంది.

వచ్చినప్పుడల్లా దానికి ఏదో ఒకటి తినిపిస్తుంటారు సొహిత్, ప్రియ.
రచన: కె. స్నేహిత, ఆరవ తరగతి, వికాస విద్యావనం