ఒక ఊరిలో నిమ్మకాయ అనే ఒక అబ్బాయి ఉండేవాడు. తనకు నిమ్మకాయలంటే చాలా ఇష్టం. మిరపకాయ, కారం లాంటి వంటే మటుకు అస్సలు ఇష్టం లేదు.

తను అస్సలు చదువుకునేవాడు కాదు. అమ్మానాన్నలు చదువుకోమని ఎన్ని సార్లు చెప్పినా వినేవాడు కాదు. ఇంకా తనకు 'ఆ ఆ లు' కూడా రావు.

ఇంకో సంగతేంటంటే, ఎప్పుడు చూసినా వాడు మూడే పనుల్లో ఉండేవాడు: సినిమాలు చూస్తూండేవాడు (అవును, సరైనోడు, జులాయి, రాజు గారి గది, బ్రహ్మోత్సవం, క్షణం, ఊపిరి లాంటి సినిమాలు అనీ మళ్ళీ మళ్ళీ చూసాడు- ఈ విషయం ఊరందరికీ తెలుసు.); లేకపోతే చదరంగం ఆడేవాడు; లేకపోతే నిమ్మకాయలు తింటూ ఉండేవాడు!

నిమ్మకాయ వాళ్ళమ్మకి వాడు బలే తలనొప్పి అయిపోయాడు. తనకు కనబడ్డ వాళ్ళనల్లా 'ఏం చేయాలి?' అని అడుగుతూ ఉండటం అలవాటై పోయింది ఆవిడకి. దాంతో ఊళ్ళోవాళ్ళంతా కూడా ఆవిడ కనబడగానే 'ఏం చేయాలి?' అనుకోవటం మొదలెట్టారు.

చివరికి వాళ్ళంతా నిమ్మకాయ లేనప్పుడు వాళ్లింటికి వచ్చి, వాళ్లమ్మ తో చెప్పారు: 'ఈ టైం బలే మంచిది. ఇప్పుడు గనక వినాయకుడికి ఒక నెల రోజుల పైన పూజ చేస్తే, క్షణంలో ప్రత్యక్షం అవుతాడు ఆయన. వినాయకుడే నిమ్మకాయకి 'సరైనోడు' అని. 'పూజని ఎక్కడైనా చేయచ్చు. మీ దేవుడి గదిలో ఉన్న వినాయకుడికి చేసినా చాలు' అని కూడా చెప్పారు వాళ్ళు.

నిమ్మకాయ వాళ్ల అమ్మ జులైలో మొదలుపెట్టి ఆగస్టు వరకూ పూజ చేసింది చాలా పట్టుదలగా. దాంతో వినాయకుడు నిజంగానే ప్రత్యక్షం అయ్యాడు: "నీ సమస్య నాకు తెలుసు. నిమ్మకాయ చదవకపోవడమే నీ సమస్య, అవును కదా?! నేను ఒక్క ఏడాది లోగా ఏదో ఒకటి చేసి, నిమ్మకాయని చదువుకునేలా చేస్తాను" అన్నాడు.

"అట్లాకాదు స్వామీ- నువ్వు ఇంత మహిమలు ఉన్నవాడివి గదా, అట్లా ఒకసారి చెయ్యి ఊపితే మా వాడు బాగైపోడా?" అన్నది అమ్మ.

వినాయకుడు విచారంగా మొహం పెట్టి, నవ్వాడు: "అట్లా అవ్వడు అమ్మా! చదువును అట్లా ఇచ్చే వీలుంటే ఇంకేముంది? మీ మనుషులు పుట్టే ముందే, కాళ్ళు చేతుల్లాగా చదువును కూడా ఇచ్చేసి పంపించేవాడిని నేను! చదువు మీద ఇష్టం అట్లా రాదు. ఏదైనా మ్యాజిక్ చేయాల్సిందే, తప్పదు. నువ్వు ఓపిక పట్టాల్సిందే తల్లీ" అని మాయం అయిపోయాడు.

ఆరోజు రాత్రే నిమ్మకాయ ముందు ఒక దెయ్యం ప్రత్యక్షమయ్యింది. నిమ్మకాయకు చాలా భయం వేసింది. గట్టిగా అరుద్దామని నోరు తెరిచాడు. ఆ నోరు అట్లాగే తెరుచుకొని ఉండిపోయింది! శబ్దం ఏదీ బయటికి రాలేదు.

దెయ్యం ఒక చేతిలో కొంచెం కారం పట్టుకొని వచ్చింది. రెండో చేతిలో ఇంత పెద్ద నిమ్మకాయ ఉంది. ఆ రెండు చేతులూ నిమ్మకాయకు చూపించింది- "నేను నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. నువ్వు సరైన జవాబులు చెప్తే నేను నీకు ఈ నిమ్మకాయను ఇస్తాను. లేకపోతే కారం తినిపిస్తాను" అన్నది.

నిమ్మకాయ నోరు పని చేయటం మొదలెట్టింది మళ్ళీ. "సరే అడుగు!" అన్నాడు వాడు.

"'అ ఆ ఇ ఈ' లు 'ఱ' వరకూ చెప్పు" అన్నది.

నిమ్మకాయ నోరు తెరిచాడు- వాడికి అవి అస్సలు రావు!

"రాకపోతే కారం తినాల్సిందే" అని మీదికి దూకింది దెయ్యం.

"ఆగాగు- ముందే చెప్పకుండా ఒకేసారి అడిగితే ఎట్లా?!" అన్నాడు నిమ్మకాయ.

దెయ్యం ఆగింది. సరే అయితే- నేను మళ్ళీ వచ్చే వారం వస్తాను- అట్లా ప్రతి వారమూ వచ్చి నిన్ను ప్రశ్నలు అడుగుతాను" అంది.

నిమ్మకాయ మీది ఆశతో నిమ్మకాయ ఒప్పుకున్నాడు.

కానీ, ఆ తర్వాతి వారం ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పలేకపోయాడు! "ఇంకొక్క వారం టైమివ్వు. ఇప్పుడే గదా మొదలు పెట్టింది?!" అని బేరం పెట్టుకున్నాడు దెయ్యంతో.

దెయ్యం నోరు తెరవకుండానే నవ్వింది. ఏమీ‌ మాట్లాడకుండా మాయం‌ ఐపోయింది.

'ఇంకేం చెయ్యాలిరా దేవుడా' అని చదువుకోవటం మొదలుపెట్టాడు నిమ్మకాయ.

తర్వాతి వారం దెయ్యం అడిగిన ప్రశ్నలన్నిటికీ సరైన జవాబు చెప్పాడు. అది ఇచ్చిన నిమ్మకాయ బలే ఉంది- చాలా స్పెషల్‌గా కూడా ఉంది!

నిమ్మకాయ చదువుకోవటం చూసి ఊళ్ళో వాళ్లంతా సంతోషించారు. వాడికి అవసరమయ్యే రకరకాల పుస్తకాలు కూడా తెచ్చి ఇచ్చారు వాళ్ళు. అప్పటి నుండి ప్రతీ సంవత్సరం ఆ నెలరోజుల్నీ ఒక బ్రహ్మోత్సవం లాగా జరుపుకున్నారు.

త్వరలోనే నిమ్మకాయ చాలా తెలివిగలవాడు అయ్యాడు. కానీ వినాయకుడే ఆ దెయ్యం లాగా వచ్చాడని తనకు ఎప్పటికీ తెలీదు. లేకపోతే మళ్ళీ చదవటం మానేసి ఉండేవాడేమో!