అనగనగా ఒక కోతి. దానికి ఓ తాత. తాత-మనుమళ్లు ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఎంతో ప్రేమ. కానీ తాత-మనుమడు ఇద్దరూ పాపం, వేరు వేరు ఊళ్లల్లో ఉండవలసి- వచ్చింది! అయినప్పటికీ వీలు దొరికి-నప్పుడల్లా ఒకరి యోగక్షేమాలు మరొకరు తెలుసుకుంటూ గడిపేవాళ్ళు వాళ్ళు.
ఒకరోజున, మరి ఎవరి దగ్గరినుండి ఎత్తుకొచ్చిందో గానీ, తాత చేతికి ఒక సెల్‌ఫోను వచ్చింది. అంతే కాదు- ఆ కబురు సాయంత్రం కల్లా మనుమడికి కూడా అందింది! వాళ్ల ఊరికి వెళ్ళొచ్చిన వేరే కోతి మిత్రుడు ఒకడు, సహజంగానే, అన్ని సంగతులతో పాటూ ఆ కబురునూ వాడికి చేరవేసాడు.
అంతే- ఇక ఆరోజునుండీ మనుమడి కోతికి కోరిక మొదలైంది: 'నాకు కూడా ఒక సెల్‌ఫోన్ ఉంటే ఎంత బాగుంటుంది?! తాతతో చక్కగా రోజూ మాట్లాడుకోవచ్చు!' అని.
ఈ మనుమడు కోతి ఉండే ఊళ్ళోనే 'చిన్ను' అనే ఆకతాయి పిల్లాడు ఒకడు ఉండేవాడు. వాడు రోజూ స్నేహితులతో కలిసి ఊరంతా తిరగడం, చెరువులో ఈత కొట్టడం, స్కూలు గ్రౌండ్లలో ఆటలు ఆడటం చేస్తుండేవాడు.
ఇంట్లో పేచీ పెట్టి, రెండ్రోజులు అన్నం తినకుండా అల్లరిచేసి మరీ, వాళ్ల నాన్నతో సెల్‌ఫోను కొనిపించుకున్నాడు వాడు! ఆ తర్వాత ఒకసారి తన స్నేహితులతో కలిసి వాడు చెరువులో ఈతకు వెళ్లటం, సెల్‌ఫోనుతో సహా బట్టలన్నీ కూడా గట్టున పెట్టి చెరువులోకి దిగటం జరిగింది.
అవకాశం వచ్చిందని తెల్సింది మనుమడు కోతికి. మెల్లగా చెట్టు దిగి వచ్చిందది; గుట్టు చప్పుడు కాకుండా చిన్ను బట్టల్లోంచి సెల్ ఫోన్ కాజేసింది; మళ్ళీ చెట్టుపైకి పరిగెత్తింది!
చిన్ను చాలా సేపు ఈతకొట్టి, వెనక్కి తిరిగి వచ్చాక చూసుకుంటే స్మార్ట్ఫోను లేదు! కొద్ది సేపు అక్కడా ఇక్కడా వెతికాక, ఏవేవో గొణుక్కుంటూ అయోమయంగా ఇంటికి పోయాడు చిన్ను.
సెల్ ఫోన్ దొరికిన ఆనందంతో మనుమడు కోతి వెంటనే వాళ్ళ తాతకు ఫోన్ చేసింది. తాత కోతి చాలా కష్టాల్లో ఉన్నది: 'మూడేళ్లుగా వానలు లేవు. చెట్లు ఎండిపోయాయి. పూట గడవడం కూడా కష్టంగా ఉంది. దానికి తోడు, నేను ఉండే ఊళ్లో జనం చెట్లు నరికేసి ప్లాట్లు వేస్తున్నారు!" ముసలి కోతి మనుమడికి ఈ సంగతులు చెప్పి కళ్ళ నీళ్ళు పెట్టుకున్నది.
దాంతో చలించిపోయిన మనుమడు తాతతో "ఏడవకు తాతా! ఈ ఊరికి వచ్చేసెయ్యి. ఇక్కడ వానలు బాగానే పడ్డాయి. మనుగడ చక్కగా ఉంది. మనం ఇద్దరం సంతోషంగా కలిసి ఉండచ్చు ఇక్కడ" అన్నాడు.
సరేనన్నది తాత కోతి. మరుసటి రోజు ఉదయాన్నే తట్టా-బుట్టా సర్దుకుని బయలుదేరింది- కానీ ఎక్కడికి పోవాలి? మనుమడు ఉండే ఊరు ఏది? ఎంత దూరం?! అంతలో దానికి గుర్తు వచ్చింది- మనుమడికి ఫోన్ చేసి అడగొచ్చు!
మనుమడు నవ్వాడు- "పిచ్చి తాతా, స్మార్ట్ ఫోన్ చేతిలో పట్టుకొని వేరేవాళ్లను దారి అడిగేదేమి? గూగుల్ మేప్ ఆన్ చేసుకొని రావచ్చుగా?!" అని హింట్ ఇచ్చాడు.
మేప్ దారి చూపించగా, తాత కోతి సులభంగానే మనుమడు నివసిస్తున్న చింత చెట్టు దగ్గరకు చేరుకున్నది.
తాత మనుమడు ఆప్యాయంగా పలకరించుకున్నారు.
"ఇద్దరూ ఒకే చోట ఉంటున్నప్పుడు రెండు ఫోన్లు ఎందుకురా?" అన్నాడు తాత. "సరే ఏదో ఒకటి చేద్దాం" అన్నాడు మనుమడు.
తర్వాతి రోజున చిన్ను మళ్ళీ ఈతకు వచ్చినప్పుడు, మనుమడు కోతి పోయి, తను కాజేసిన సెల్‌ఫోనును మళ్ళీ చిన్ను బట్టల్లో పెట్టేసింది.
ఫోన్ దొరికిందన్న సంతోషంతో పొంగిపోతూ చిన్ను ఇంటిదారి పట్టాడు.
కథ కంచికి-మనం చిన్నూ వాళ్ళ ఇంటికి!