చెలగరు కలగరు సాధులు
మిళితములయి పరుల వలన మేలున్ కీడున్
నెలకొనిననైన నాత్మకు
నొలయవు సుఖ దు:ఖ చయములుగ్రములగుచున్

భావం: సజ్జనులు ఇతరుల వల్ల మేలు జరిగితే పొంగిపోరు; కీడు జరిగితే క్రుంగిపోరు; సుఖాలు, దు:ఖాలు ఎంత బలంగా వచ్చి చుట్టుకున్నా సరే, గొప్పవారి ఆత్మలను మాత్రం అవి అంటుకొనవు.

సందర్భం: శమీకుడనే ఋషి మెడలో చచ్చిన పామును, వేస్తాడు పరీక్షిత్తు అనే రాజు. దాంతో శమీకుడి కొడుకైన శృంగి కోపం ఆపుకోలేక, పరీక్షిత్తును శపిస్తాడు. అది తెల్సిన శమీకుడు తన కొడుకుని మందలిస్తూ ఈ సంగతిని గుర్తుచేస్తాడు- మంచివాళ్ళు ఎలా ఉండాలో‌ చెబుతాడు,